Indian Railways: రైల్వే ప్రయాణంలో తరచుగా ప్రయాణీకులకు ఏదో ఒక ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. ఫుడ్ సరిగా లేకపోవడమో, టాయిలెట్లు నీట్ గా లేకపోవడమో, బెడ్ షీట్లు వాసన వస్తున్నాయనో ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి. కానీ, తాజాగా ఓ ప్రయాణీకుడికి వింత అనుభవం ఎదురయ్యింది. ఏకంగా తను ప్రయాణిస్తున్న ఏసీ కోచ్ లోకి ఎలుకలు రావడంతో షాక్ అయ్యాడు. వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో హల్ చల్ చేస్తోంది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి సౌత్ బీహార్ ఎక్స్ ప్రెస్ సెకెండ్ క్లాస్ ఏసీ కోచ్ లో టికెట్ బుక్ చేసుకున్నాడు. ఇందుకోసం రూ. 3 వేలు చెల్లించాడు. కంఫర్టబుల్ గా ప్రయాణం చేద్దామని రైలు ఎక్కాడు. కాసేపటికే తన సీటు దగ్గరికి ఎలుకలు రావడం చూసి షాక్ అయ్యాడు. ఎలుకలు కోచ్ మొత్తంగా తిరడగం చూసి ఖంగుతిన్నాడు. వెంటనే ఏసీ కోచ్ లో ఎలుకలు తిరుగుతున్న వీడియోను తీసి సోషల్ మీడియా ద్వారా రైల్వే సంస్థకు ఫిర్యాదు చేశాడు. “రైలు నంబర్ 13288, PNR నెంబర్ 6649339230, A2 కోచ్ లో ఎలుకలు సీట్లు, లగేజీపైకి ఎక్కి తిరుగుతున్నాయి. ఇందుకోసమా నేను అంత డబ్బు చెల్లించి టికెట్ కొనుగోలు చేసింది?” అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించాడు. ఈ ట్వీట్ కు కేంద్ర రైల్వేమంత్రితో పాటు రైల్వేమంత్రిత్వశాఖ, IRCTCని ట్యాగ్ చేశాడు.
@complaint_RGD @IRCTCofficial @RailMinIndia @RailwaySeva @AshwiniVaishnaw
PNR 6649339230, Train 13288, multiple rats in coach A1, rats are climbing over the seats and luggage.
Is this why I paid so much for AC 2 class?@ndtv @ndtvindia @aajtak @timesofindia @TimesNow @htTweets pic.twitter.com/vX7SmcfdDR— Prashant Kumar (@pkg196) March 6, 2025
స్పందించిన రైల్వేశాఖ..
ఈ ఘటనపై రైల్వేశాఖ స్పందించింది. తగిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. “సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూశాం. ఈ ఘటన మార్చి 6న జరిగింది. ఏసీ కోచ్ లో ఎలుకలు తిరుగుతున్నట్లు ప్రయాణీకులు ఫిర్యాదు చేశారు. రైల్వే సిబ్బంది వెంటనే ఆ కోచ్ లో లిజోల్ క్రిమిసంహారక మందుతో డ్రై స్వీపింగ్, వెట్ స్వీపింగ్ చేశారు. ఆ తర్వాత సీటింగ్ ఏరియాలో దోమల మందు పిచికారీ చేశారు. సీటు కింద గ్లూ ప్యాడ్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకున్నాం” అని వెల్లడించింది.
Read Also: ట్రైన్ లో ల్యాప్‌టాప్ మరిచిపోయిన రైల్వే అధికారి.. విజయవాడ సిబ్బంది చేసిన పనికి అంతా ఫిదా!
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
అటు ఈ ఘనటపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైలులో ఎలుకలు తిరగడం వల్ల ప్రయాణీకులకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదరుయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టికెట్ల పేరుతో వేల రూపాయలు తీసుకుంటున్న రైల్వేశాఖ శుభ్రత విషయంలో పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. రైల్వేలోని ఫుడ్ కూడా దారుణంగా ఉంటుందని ఆరోపిస్తున్నారు. మరుగుదొడ్లు, బెడ్ షీట్ల శుభ్రత గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదని కామెంట్స్ పెడుతున్నారు. మరికొంత మంది ఈ ఘటనపై ఫన్నీగా రియాక్డ్ అవుతున్నారు. “ట్రైన్ జర్నీలో బోర్ కొట్టకూడదని ఎలుకతో ఆడుకునే ఏర్పాటు చేసింది రైల్వేశాఖ” అంటూ జోకులు వేస్తున్నారు.
Read Also: 60 స్టేషన్లలో కొత్త విధానం అమలు, ఇలా చేస్తే మీకు నో ఎంట్రీ!