Ghatkesar-Yadagirigutta MMTS: యాదగిరిగుట్టకు వెళ్లే నారసింహుడి భక్తులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఘట్ కేసర్- యాదగిరి గుట్ట ఎంఎంటీఎస్ రైల్వే ప్రాజెక్టు పనుల కోసం రూ. 100 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ మేరకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. సుమారు 33 కిలో మీటర్ల మేర ఉన్న మూడో లైన్ కోసం కేటాయించిన రూ. 412 కోట్లు విడుదల చేయాలని గత పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీ చామల కేంద్రాన్ని కోరారు. ఆ తర్వాత అశ్విని వైష్ణవ్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఎంపీ చామలకు కేంద్రమంత్రి లేఖ
తాజాగా నిధుల కేటాయింపుకు సంబంధించి కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఎంపీ చామలకు లేఖ రాశారు. “ఏప్రిల్ 3న జీరో అవర్ లో ఘట్ కేసర్- యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ విస్తరణ కోసం రూ. 412 కోట్లు విడుదల చేయాలని కోరారు. 2016లో ఎంఎంటీఎస్ కింద ఖర్చు భాగస్వామ్య ప్రాతిపదికన ఆమోదం లభించింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు డిపాజిట్ చేయకపోవడంతో ప్రాజెక్టు ప్రారంభించలేకపోయాం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పూర్తిగా రైల్వేశాఖ నిధులతో చేపడుతున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్టు కోసం రూ. 100 కోట్లు కేటాయిస్తున్నాం” అని ఈ లేఖలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఎంపీ చామల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సహాయమంత్రి రవనీత్ సింగ్ కు ధన్యవాదాలు తెలిపారు.
Read Also: ఆ నగరాలకూ బుల్లెట్ రైళ్లు.. జాబితాలో ఏపీ, తెలంగాణ ఉన్నాయా? ప్రాజెక్ట్ డిటైల్స్ ఇవే!
ఘట్ కేసర్-యాదగిరిగుట్ట నడుమ మూడో లైన్
ఇక ఘట్ కేసర్ నుంచి భువనగిరి వరకు కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న 33 కిలో మీటర్ల మేర మూడో లైన్ నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో భూసేకరణ జరపల్సిన అవసరం ఉంది. అప్పటి వరకు రైల్వే స్థలంలోనే పనులు చేపట్టనున్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నాలుగో లైన్ నిర్మాణం కోసం ఘట్ కేసర్ నుంచి వంగపల్లి వరకు 39 కిలోమీటర్ల పరిధిలో 79 ఎకరాల భూమిని సేకరించేందుకు రైల్వే అధికారులు సిద్ధం అవుతున్నారు. భువనగిరి రైల్వే స్టేషన్‌లో మూడో ప్లాట్‌ఫాంగా ఎంఎంటీఎస్ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేస్తారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానాన్నిఅద్భుతంగా తీర్చిదిద్దడంతో భక్తుల సౌకర్యం కోసం ఎఎంటీఎస్ ను రాయగిరి వరకు పొడగించాలని సౌత్ సెంట్రల్ రైల్వే నిర్ణయించింది. ఎంఎంటీఎస్ అందుబాటులోకి వస్తే తక్కువ చార్జీలు, తక్కువ సమయంలో యాదగిరిగుట్టకు చేరుకునే అవకాశం ఉంది. భక్తులకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు.
Read Also: బాబోయ్.. మేం నడపలేం, చేతులెత్తేసిన పాక్ రైల్వే, పలు రైళ్లు ప్రైవేట్ పరం!