దేశ వ్యాప్తంగా వాహనాల కొనుగోళ్లు పెరిగిపోయాయి. చాలా మంది కార్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్న చిన్న పట్టణాల్లో కూడా ట్రాఫిక్ జామ్ లు ఏర్పడుతున్నాయి. కూడళ్ల దగ్గర గ్రీన్ సిగ్నల్ పడగానే హారన్ల మోతలు వినిపిస్తాయి. కానీ, దేశంలో ట్రాఫిక్ జామ్ లు లేని, వాహనాల హారన్లు వినిపించని నగరం ఒకటి ఉంది. వినడానికి విచిత్రంగా ఉన్నా, ఇది నిజం.ఇంతకీ అదేంటంటే..
ట్రాఫిక్ జామ్ లు లేని ఏకైక భారతీయ నగరం
జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం లాంటి తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలతో సహా దేశంలోని ప్రధాన పట్టణ కేంద్రాల్లో చాలా వరకు ట్రాఫిక్ సమస్య అనేది ఉంటుంది. కానీ, దేశంలో ట్రాఫిక్ సమస్య లేని ఏకైక నగరం మిజోరాంలోని ఐజ్వాల్. ఇక్కడ ఇతర నగరాల మాదిరిగా గ్రీన్ సిగ్నల్ పడగానే చెవులు చిల్లులు పడేలా హారన్లు కొట్టరు. అడ్డదిడ్డంగా వాహనాలు నడపరు. రెడ్ సిగ్నల్ పడగానే, ఇక్కడ వాహనాల ఇంజిన్లు ఆపేసి, గ్రీన్ సిగ్నల్ పడే వరకు.. అదీ ముందు ఉన్న వెహికిల్స్ వెళ్లే వరకు ఓపికగా ఎదురు చూస్తారు.
ఎందుకు ఐజ్వాల్ లో ట్రాఫిక్ జామ్ ఉండదంటే?
ఐజ్వాల్ లో ట్రాఫిక్ జామ్ లు ఉండకపోవడం వెనుక పెద్ద రహస్యం ఏమీ లేదు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడమో? కఠినమైన ట్రాఫిక్ రూల్స్ ఉండటమో? కాదు. ఇక్కడి ప్రజల్లో ఉన్న క్రమ శిక్షణ మాత్రమే దానికి కారణం. మిజోరాం సంస్కృతిలోనే ఆ రహస్యం ఉండటం విశేషం. ఇక్కడి ప్రజలు ఎవరూ రూల్స్ ను అతిక్రమించరు. బాధ్యతలను తుచ తప్పకుడా పాటిస్తారు.
ఆశ్చర్య పరుస్తున్న ఐజ్వాల్ ప్రజల క్రమశిక్షణ
ఐజ్వాల్ లో ట్రాఫిక్ జామ చక్కగా మెయింటెనెన్స్ కావడం పట్ల దేశ, విదేశీ పర్యాటకులు ఆశ్చర్యపోతున్నారు. మన దేశంతో పాటు ఇతర దేశాల్లోని నగరాల్లో మాదిరిగా కాకుండా, నగరంలోని రోడ్లు నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండటాన్ని చూసి ఇంప్రెస్ అవుతున్నారు. ట్రాఫిక్ లేకపోవడంతో పాటు ఐజ్వాల్ పరిశుభ్రతకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి వీధుల్లో చెత్త వేయడం చాలా అరుదుగా కనిపిస్తుంది.
Read Also: హైదరాబాద్ మెట్రోకు ఒక్క రోజులో అంత ఖర్చవుతుందా? అస్సలు నమ్మలేరు!
మిజోరం ప్రజలు ఇతర ప్రాంతాల ప్రజలలో పోల్చితే చాలా పరిణతితో ఆలోచిస్తారు. ఆ రాష్ట్ర ప్రజలు నైతిక విలువలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఎదుటి వారికి ఇబ్బంది కలిగించకూడదు అనే నియమాన్ని ప్రతి ఒక్కరు పాటిస్తారు.అందుకు ప్రత్యక్ష ఉదాహారణ ట్రాఫిక్ మెయింటెనెన్స్. పోలీసింగ్, భారీ జరిమానాల కంటే వ్యక్తిగత నైతికత భావన అనేది ట్రాఫిక్ నిర్వహణ, క్రమబద్ధతకు ఎలా ఉపయోగపడుతుంది? అని చెప్పేందుకు ఒక సజీవ ఉదాహారణగా నిలుస్తుంది. ఇక్కడి ప్రజలను చూసి దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా క్రమశిక్షణగా ఎలా ఉండాలో వీరిని చూసి తెలుసుకోవాలి.
Read Also: రాత్రికి రాత్రే రూ.2000 కోట్లకు అధిపతి అయిపోయాడు.. అంతా ఆ లాటరీ మహిమే!