Indian Railways toy train: ఆ ఆటల రైలు బండి మళ్లీ అడవుల్లోకి వచ్చింది. చిన్ననాటి ఆటలు, పచ్చని ప్రకృతి మధ్య కేరింతలు వేసిన ఆ జ్ఞాపకాలు ఇప్పుడు నిజం అవుతున్నాయి. మెల్లగా ఊగే బోగీలు, చెట్ల మధ్య నుంచి తొంగిచూసే సూర్యరశ్ములు, దారిలో ఎదురయ్యే వన్యప్రాణులు.. ఇవన్నీ మరోసారి ఆ మాయాజాలాన్ని మనసులో నింపుతున్నాయి. ఇంతటి ప్రకృతి సౌందర్యాన్ని సందర్శకులకు చేరువ చేసే ఆ రైలు బండికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇంతకు ఈ బండి ఏమిటి? అసలు ఆ ప్రకృతి ఏమిటి? ఇవన్నీ తెలుసుకుంటే మీరు కూడా ఛలో అంటూ అక్కడికే పరుగులు పెడతారు.
ఫారెస్ట్ క్వీన్ వచ్చేసింది!
ముంబైకి సమీపంలోని బోరివలి ప్రాంతంలో ఉన్న సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ మళ్లీ కిక్కిరిసిపోయింది. 1970లో మొదటిసారి ప్రారంభమైన టాయ్ ట్రైన్ ఫారెస్ట్ క్వీన్ అప్పటి పిల్లలకు, కుటుంబాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కృష్ణగిరి ఉపవనంలోని 5.5 చ.కి.మీ. పరిధిలో తిరుగుతూ అడవుల మధ్య ఆ ప్రయాణం ఒక అద్భుత అనుభవంగా మారేది. కానీ 2021లో వచ్చిన భయంకర తుఫాన్ నారో-గేజ్ ట్రాక్‌లను నాశనం చేసింది. ఇప్పుడు పార్క్ అధికారులు దీన్ని మరింత ఆధునికంగా, పర్యావరణానికి మేలు చేసే విధంగా ఎలక్ట్రిక్ రైలు రూపంలో తిరిగి ప్రారంభించారు.
కొత్తగా ముస్తాబైన ఫారెస్ట్ క్వీన్
ఈసారి ఫారెస్ట్ క్వీన్ పూర్తిగా కొత్త లుక్‌తో వచ్చింది. డీజిల్ బదులుగా ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో నడిచే ఈ రైలు ఇక కాలుష్యం లేకుండా నిశ్శబ్దంగా సాగుతుంది. మొత్తం 80 మంది ప్రయాణికులు కూర్చునే సౌకర్యం ఉంది. స్టేషన్‌లు, కృత్రిమ టన్నెల్లు కొత్త డిజైన్‌తో ఆకట్టుకుంటున్నాయి. ప్రతి 30 నిమిషాలకోసారి ట్రైన్ సర్వీసులు నడుస్తున్నాయి.
కొత్త ఫీచర్లు ఇవే..
గాజు కిటికీలతో ఉన్న ఈ కోచ్‌ల నుంచి పచ్చని అరణ్యాన్ని, పక్షుల గుంపులను కళ్లారా చూడవచ్చు. పాత రోజుల జ్ఞాపకాన్ని గుర్తు చేసే ఓపెన్ కోచ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. గతంలో మూడు బోగీలు ఉండగా, ఇప్పుడు నాలుగు బోగీలతో మరింత విశాలంగా పయనిస్తుంది. ఎలక్ట్రిక్ శక్తితో నడిచే ఈ రైలు శబ్దం లేకుండా, పొగలు రాకుండా పచ్చదనాన్ని కాపాడుతుంది. రైల్వే స్టేషన్, మార్గం, సొరంగాలు అన్ని కొత్తగా పూత పూసినట్లు మారాయి.
Also Read: Metro Project Cancellation: ఆ రాష్ట్రానికి మెట్రో రైల్ ప్రాజెక్ట్ క్యాన్సిల్.. షాక్ లో మాజీ సీఎం!
సంజయ్ గాంధీ నేషనల్ పార్క్
సుమారు 104 చ.కి.మీ. విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ పార్క్ ఆసియాలో అత్యధికంగా సందర్శించే నగర పార్క్‌లలో ఒకటి. ఏటా దాదాపు 2 మిలియన్ల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ జింకలు, కోతులు, నెమళ్లు, బాతులు, సీతాకోక చిలుకలతో నిండిన ప్రకృతి మధురానుభూతిని అందిస్తుంది. సుమారు 2000 సంవత్సరాల నాటి కన్హేరి గుహలు బౌద్ధ శిల్పకళకు నిదర్శనాలు. రాతిని త్రవ్వి నిర్మించిన ఈ గుహలు పార్క్ చరిత్రలో ముఖ్యమైన భాగం. ఇక్కడ రెండు కృత్రిమ సరస్సులు ఉన్నాయి. వాటిలో మొసళ్లు, వలస పక్షులు కనిపిస్తాయి. ఈ సరస్సుల నుంచే ముంబై నగరానికి తాగునీరు అందుతుంది.
అడవిలో వింతలు
పర్యాటకులు రైలు ప్రయాణం చేస్తూ అనుకోని వన్యప్రాణులను చూస్తే ఆశ్చర్యపోతారు. గాలిలో తేలే పూల రేణువులు, చెట్ల నుండి కిలకిలలాడే పక్షుల కూయుళ్లు.. ఇవన్నీ రైడ్‌ను మరింత మధురంగా చేస్తాయి. వేసవిలో పసుపు పూలతో కప్పబడిన మార్గం, చలికాలంలో తడి గాలి.. ప్రతి సీజన్‌కు ప్రత్యేక అనుభవం ఇస్తుంది. ఫారెస్ట్ క్వీన్‌లో కూర్చుని చిన్నప్పటి ఆటపాటల్ని గుర్తు చేసుకోవడం సందర్శకుల మనసుకు హాయినిస్తుంది. పిల్లల కోసం ఇది ఒక కొత్త ప్రపంచం అయితే, పెద్దలకు ఇది ఒక అందమైన ఫ్లాష్‌బ్యాక్.
పర్యావరణాన్ని కాపాడుతూ వినోదాన్ని అందించడంలో ఫారెస్ట్ క్వీన్ ఒక అద్భుతమైన ఉదాహరణ. సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ సహజసిద్ధమైన సౌందర్యంతో పాటు ఈ ఎలక్ట్రిక్ టాయ్ ట్రైన్ ప్రతి పర్యాటకుడికి ఒక ప్రత్యేక అనుభవం అందిస్తుంది. నగర హడావిడిలో నుంచి బయటకు వచ్చి, ప్రకృతిని దగ్గరగా ఆస్వాదించాలని కోరుకునే ప్రతి ఒక్కరి కోసం ఇది తప్పనిసరిగా చూడదగిన ప్రదేశం.