Metro Project Cancellation: ఒక రాష్ట్రం ఆభివృద్ధి దశలో ముందుకు దూసుకెళ్లాలంటే రవాణా వ్యవస్థే మొదటి అడుగు. ఆ వ్యవస్థలో కీలకంగా వ్యవహరించేది మెట్రో ప్రాజెక్ట్. కాని ఇప్పుడు ఆ రాష్ట్రంలో మెట్రోపై అంతా రచ్చరచ్చ సాగుతోంది. ఆ రచ్చ సాగుతున్న రాష్ట్రం ఏదో తెలుసా.. ఒరిస్సా. ఒకప్పుడు కలల ప్రాజెక్ట్‌లా అందరినీ ఆకట్టుకున్న ఒరిస్సా లోని భువనేశ్వర్ మెట్రో, ఇప్పుడు రాజకీయ బంతిగా మారింది. ఒకవైపు మాజీ సీఎం నవీన్ పట్నాయక్ తన కాలంలో మొదలైన ప్రాజెక్ట్‌ను రద్దు చేసినందుకు BJP ప్రభుత్వంపై ఫైర్ అవుతుంటే, మరోవైపు ప్రస్తుత ప్రభుత్వం కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్లబోతున్నట్టు చెబుతోంది. ఎవరి వాదనకు నిజం ఉంది? అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.
భువనేశ్వర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ను 2027 నాటికి మొదటి ఫేజ్ పూర్తవుతుందని నాటి సీఎం పట్నాయక్ భరోసా ఇచ్చారు. తన ప్రభుత్వ కాలంలోనే డీటైల్ ప్లాన్ వేసి, మొత్తం 5,000 కోట్ల ఖర్చుతో రాష్ట్ర నిధులపై ప్రాజెక్ట్ కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుండి త్రిసూలియా స్క్వేర్ వరకు కనెక్టివిటీతో ప్రారంభమయ్యే మెట్రో నగర రవాణాకు గేమ్‌చేంజర్ అని ఆయన చెప్పిన మాటలు అప్పట్లో హాట్‌టాపిక్ అయ్యాయి.
ఇప్పుడు మాత్రం BJP ప్రభుత్వమే ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌ను స్టాప్ అని చెప్పింది. నవీన్ పట్నాయక్ ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతూ.. భువనేశ్వర్‌ను వరల్డ్ క్లాస్ సిటీగా మార్చే దిశలో పెద్ద అడుగు వేసాం. క్రీడల మౌలిక సదుపాయాలు, ఐటీ హబ్‌లు, అంతర్జాతీయ ఈవెంట్లు.. ఇవన్నీ కలిసి నగరాన్ని కొత్త దిశలో ముందుకు నడిపించాయి. కానీ మెట్రో ప్రాజెక్ట్ రద్దు చేయడం ద్వారా నగరం 10 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోతుందని ఫైర్ అయ్యారు.
పట్నాయక్ ప్రకారం, మెట్రో ప్రాజెక్ట్ ప్రారంభమైతే మోబస్ వంటి బస్సులు, చివరి మైల్ కనెక్టివిటీ అన్నీ కలిసి నగర ట్రాఫిక్ సమస్యలను చాలా వరకు తగ్గించేవి. మెట్రో రైళ్ల రాకతో నగరంలో ట్రాఫిక్ కిక్కిరిసిన రోడ్లకు కొంత ఊరట లభించి, రవాణా వేగం పెరిగేదని ఆయన భావిస్తున్నారు. 2019లో మొదలైన ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు హఠాత్తుగా రద్దు కావడంతో ప్రజలు తమ కలల ప్రాజెక్ట్‌ను కోల్పోతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.
Also Read: Vande Bharat train speed: వందే భారత్ స్పీడ్ డౌన్.. ఎందుకిలా? రైల్వే మంత్రి క్లారిటీ ఇదే!
మరోవైపు ప్రస్తుత హౌసింగ్, అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కృష్ణ చంద్ర మహాపాత్ర చెప్పేది వేరే కథ. గత ప్రభుత్వం ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ పూర్తిగా రాష్ట్ర నిధుల మీదే ఆధారపడింది. కానీ ఆ ప్లాన్ పెద్దగా ఫీజిబుల్ కాదు. మేము కొత్త DPR తయారు చేసి సెంటర్‌తో కలిపి మెట్రో ప్రాజెక్ట్ చేస్తాం. ఇలా చేస్తే ప్రాజెక్ట్ మరింత బలంగా, సరైన దిశలో అమలు అవుతుందని ఆయన చెబుతున్నారు.
ఇదిలా ఉంటే, భువనేశ్వర్ ప్రజల్లో మాత్రం ఒక్కటే చర్చ.. మెట్రో రైలు కల నిజం అవుతుందా లేదా? ఒకప్పుడు వరల్డ్ క్లాస్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ అని పట్నాయక్ చెప్పిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు రద్దు కావడంతో, నగర అభివృద్ధి మళ్లీ స్లో మోడ్‌లోకి వెళ్ళిపోతుందేమోనన్న భయం వ్యక్తమవుతోంది. BJP ప్రభుత్వం కొత్త ప్రాజెక్ట్ తేవడమంటే ఎప్పుడు? ఎలాంటి మార్పులు ఉంటాయి? అన్న సందేహాలు ఇంకా కొనసాగుతున్నాయి.
నవీన్ పట్నాయక్ తన వాదనలో చెప్పిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని చెప్పుకునే BJP ఈ నిర్ణయంతో ప్రజలకు ద్రోహం చేసిందని ఆయన ఆరోపించారు. ప్రజల కలలను సాకారం చేయాల్సిన బదులు, ఆ కలల్ని చిద్రం చేశారంటూ ఆయన తన మాటలతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంలో ఒకవైపు రాజకీయ వాదనల వేడి, మరోవైపు నగర అభివృద్ధి అవసరం రెండూ కలిసి చెలరేగుతున్నాయి. భువనేశ్వర్ మెట్రో ప్రాజెక్ట్ నిజంగా వాయిదా పడితే, దాని ప్రభావం రాబోయే దశాబ్దంలో స్పష్టంగా కనిపించనుంది. BJP ప్రణాళికలు ఎప్పుడెప్పుడు ఫైనల్ అవుతాయో చూడాలని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే.. పాత ప్రాజెక్ట్ రద్దు, కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ ఇంకా ఫైనల్ కాకపోవడం. అంటే నగరానికి మెట్రో కల ఇంకోసారి లేట్ అవుతున్నట్టే. భువనేశ్వర్ నగరం మోడర్న్ ఫెసిలిటీలతో ముందుకు దూసుకెళ్ళాలని కోరుకునే ప్రజలకు ఇది కొంచెం నిరాశ కలిగించే వార్తే. ఇకపై ఈ వివాదం ఎక్కడ ఆగుతుంది? కొత్త మెట్రో ప్రాజెక్ట్ ఎంత త్వరగా తీసుకువస్తుంది? నవీన్ పట్నాయక్ చేసిన విమర్శలకు ఎలా సమాధానం ఇస్తుంది? అన్నది చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం.. భువనేశ్వర్ మెట్రో రైలుపై ఇంత పెద్ద స్టాప్ సైన్ పడడం అందరినీ ఆలోచనలో పడేస్తోంది.