Namo Bharat Trip Pass: నమో భారత్ రైళ్లలో ప్రతిరోజూ ప్రయాణించే వారి కోసం ఎన్‌సీఆర్‌టీసీ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికుల టైమ్, ఖర్చు రెండింటినీ తగ్గించేందుకు ‘ట్రిప్ పాస్’ను ప్రారంభించింది. ఈ పాస్ ద్వారా రోజూ ఒకే మార్గంలో ప్రయాణించే వారు ప్రతిసారి టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ముందుగానే అవసరమైన ట్రిప్పులను కొనుగోలు చేసుకుని ప్రయాణించవచ్చు.
ట్రిప్ పాస్ ను ఒక రకమైన బల్క్ ట్రావెల్ పాస్ గా చెప్పొచ్చు. సాధారణంగా బస్సులు, లోకల్ రైళ్లలో ఉపయోగించే పాస్‌ల మాదిరిగానే ఇది పనిచేస్తుంది. రెండు నిర్దిష్ట స్టేషన్ల మధ్య ప్రయాణానికి ముందుగానే టికెట్లు కొనుగోలు చేసుకునే అవకాశం ఇందులో ఉంటుంది. ఉద్యోగులు, విద్యార్థులు, ప్రతిరోజూ ఒకే రూట్‌లో ప్రయాణించే వారికి ఈ సదుపాయం ఉపయోగపడుతుంది. ప్రయాణికులు తమ అవసరాన్ని బట్టి ఒకటి లేదా రెండు వారాల ప్రయాణానికి సంబంధించిన ట్రిప్పులను ముందుగానే తీసుకోవచ్చు.
ట్రిప్ పాస్‌ను తీసుకునే సమయంలో ఎంచుకున్న రెండు స్టేషన్ల మధ్య మాత్రమే అది చెల్లుతుంది. బేగంపూల్ నుంచి సరాయ్ కాలే ఖాన్ వరకు పాస్ తీసుకుంటే, ఆ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణానికే దాన్ని ఉపయోగించాలి. ఎంచుకున్న మార్గానికి ముందు, తర్వాత ఉన్న మరో స్టేషన్ లో దిగితే ట్రిప్ పాస్ వర్తించదు. వేరే స్టేషన్‌కు ప్రయాణిస్తే సాధారణ ఛార్జీ NCMC గ్లోబల్ వాలెట్ నుంచి తీసుకుంటుంది.
నమో భారత్ స్టేషన్లలోని ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ (AFC) గేట్ల దగ్గర లోని కౌంటర్లలో ట్రిప్ పాస్‌ను తీసుకోవచ్చు. అవసరాన్ని బట్టి తర్వాత టాప్ అప్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఎలక్ట్రానిక్ ఫేర్ ఆఫీస్, టికెట్ వెండింగ్ మెషీన్ల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ట్రిప్ పాస్‌తో పాటు ప్రయాణికులకు మరో బెనిఫిట్ కూడా అందిస్తోంది. ప్రతి ప్రయాణంపై 10 శాతం వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది. అలాగే NCMC కార్డు ద్వారా నమో భారత్ రైలులో ఖర్చు చేసే ప్రతి రూ.1కి ఒక లాయల్టీ పాయింట్ లభిస్తుంది. ఒక్కో లాయల్టీ పాయింట్ విలువ 10 పైసలుగా ఉంటుంది. 300 పాయింట్లను రీడీమ్ చేసుకుంటే ఓ ఉచిత ప్రయాణాన్ని పొందవచ్చు. దీంతో తరచూ ప్రయాణించే వారికి కొంత అదనపు ప్రయోజనం లభిస్తుంది.
ట్రిప్ పాస్‌ను స్టాండర్డ్, ప్రీమియం కోచ్‌లకు అందుబాటులో ఉంచారు. ప్రయాణికుల అవసరాన్ని బట్టి 1 నుంచి 40 ట్రిప్పుల వరకు ఎంపిక చేసుకోవచ్చు. 10 ట్రిప్పుల పాస్‌కు రీఫండ్ ఉండదు. అయితే 15, 20, 40 ట్రిప్పుల పాస్‌లను రద్దు చేసుకుంటే రూ.200 ఛార్జ్ ను మినహాయించి మిగిలిన మొత్తాన్ని రీఫండ్ చేసే అవకాశం ఉంది.
Read Also: బెంగళూరు నుంచి ముంబైకి స్లీపర్ వందే భారత్.. పట్టాలెక్కేది ఎప్పుడంటే?