New York Slow Sink: గ్లోబల్ వార్మింగ్ ప్రపంచ వ్యాప్తంగా పలు విపత్తులకు కారణం అవుతోంది. ఉష్ణోగ్రతల పెరుగుదల, అకాల వర్షాలు, తుఫాన్లు, భూకంపాలు, సునామీలు, ఆకస్మిక వరదలకు కేంద్ర బిందువుగా మారుతోంది. భూగోళం మీద ఉన్న అనేక ప్రాంతాలు కనుమరుగు అయ్యేందుకు గ్లోబల్ వార్మింగ్ ఊతమిస్తోంది. దీని ప్రభావంతో పలు దేశాలతో పాటు అమెరికాలోని అత్యంత కీలకమైన న్యూయార్క్ నగరం కూడా కనుమరుగయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆకాశహర్మ్యాలు, సందడిగా ఉండే వీధులకు ప్రసిద్ధ నగరమైన న్యూయార్క్ నెమ్మదిగా మునిగిపోతోంది. సబ్ సిడెన్స్ అని పిలువబడే ఈ విపత్తుకు గురవుతోంది. ఈ నగరం సంవత్సరానికి సగటున 1–2 మిల్లీమీటర్ల చొప్పున భూమిలోకి కుంగిపోతుంది. కొన్ని ప్రాంతాలు ఏటా 4 నుంచి 5 మిల్లీమీటర్ల వరకు లోపలికి వెళ్లిపోతుంది. ఈ సంఖ్యలు వినడానికి చిన్నగా అనిపించినా, పెరుగుతున్న సముద్ర మట్టాలతో కలిపి గణనీయమైన సవాళ్లను కలిగిస్తాయి.
న్యూయార్క్ ఎందుకు మునిగిపోతోంది?
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు న్యూయార్క్ నగరం మునిగిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. దాని ఎత్తైన భవనాల బరువు నుంచి పురాతన భౌగోళిక ప్రక్రియల వరకు, అనేక అంశాలు న్యూయార్క్ మునిగిపోవడానికి కారణమవుతున్నాయి. ఇంతకీ న్యూయార్క్ నగరం మునిగిపోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మహానగరం బరువు
న్యూయార్క్ లో ఏకంగా 1.1 మిలియన్ భవనాలు ఉన్నాయి. అన్నింటి బరువు సుమారు 1.68 ట్రిలియన్ పౌండ్లు ఉంటుంది. ఈ భవనాలు భూమిపై అపారమైన ఒత్తిడిని కలిగిస్తున్నాయి. లోయర్ మాన్ హట్టన్, బ్రూక్లిన్, క్వీన్స్ లలో బంకమట్టి, కృత్రిమ పూడకం లాంటి మృదువైన నేలల మీద నిర్మించిన కట్టడాలు అత్యంత దుర్భలంగా మారుతున్నాయి. ఆకాశహర్మ్యాలు, మౌలిక సదుపాయాల భారీ బరువు నగరాన్ని కుంగిపోయేలా చేస్తుంది.
జియోలాజికల్ లెగసీ
న్యూయార్క్ నగరం మునిగిపోవడం పోస్ట్-గ్లేషియల్ ఐసోస్టాటిక్ సర్దుబాటు కూడా ముడిపడి ఉంది. ఈ ప్రక్రియ దాదాపు 24,000 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఈ హిమానీనదాల బరువు పెరిగినప్పుడు, న్యూయార్క్ కింద ఉన్న భూమి నెమ్మదిగా సర్దుబాటును అవుతుంది. ఫలితంగా భూమి క్రస్ట్ తిరిగి సమతుల్యం కావడం వల్ల క్రమంగా మునిగిపోతుంది. ఈ సహజ ప్రక్రియ నెమ్మదిగా ఉన్నప్పటికీ.. ఈ నగరాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది.
భూగర్భ నీటి వెలికితీత
న్యూయార్క్ నగరం మునిగిపోవడానికి మరో కీలక కారణం భూగర్భ నీటి వెలికితీత. ముఖ్యంగా చిత్తడి నేలలు, పల్లపు ప్రాంతాలపై నిర్మించిన ప్రాంతాలలో భూగర్భజలాలను అధికంగా వెలికితీయడం నగరం వేగంగా మునిగిపోతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. గర్భ జలాలను బయటకు పంపినప్పుడు, నేల కుదించబడుతుంది. దీనివల్ల ఉపరితలం మునిగిపోతుంది. జమైకా బే లాంటి ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులే కొనసాగుతున్నాయి. ఇక్కడ చారిత్రక ఓవర్-పంపింగ్ భూమి స్థిరత్వంపై శాశ్వత ప్రభావాలను చూపింది.
సముద్ర మట్టం పెరుగుదల
పెరుగుతున్న సముద్ర మట్టం కూడా న్యూయార్క్ నగరం మునిగేందుకు కారణం అవుతుంది. హిమానీనదాలను కరగడం, సముద్రపు నీటి ఉష్ణ విస్తరణ తో ఈ నగరం చుట్టూ సముద్రం సంవత్సరానికి 3 నుంచి మిల్లీ మీటర్లు పెరుగుతోంది. ఇది ప్రపంచ సగటు కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ. 2012లో హరికేన్ శాండీ, 2021లో హరికేన్ ఇడా సమయంలో చూసినట్లుగా, లోతట్టు ప్రాంతాలు వరదలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
న్యూయార్క్ అంతా ఒకేలా మునిగిపోదు!
న్యూయార్క్ లోని అన్ని ప్రాంతాలు ఒకేలా మునిగిపోవు. ఇంటర్ ఫెరోమెట్రిక్ సింథటిక్ ఎపర్చర్ రాడార్ (InSAR) నుంచి సేకరించిన ఉపగ్రహ డేటా ప్రకారం, పల్లపు ప్రాంతాలు, మృదువైన నేలలపై నిర్మించబడిన లాగ్వార్డియా విమానాశ్రయం, ఆర్థర్ ఆషే స్టేడియం లాంటి ప్రాంతాలు సంవత్సరానికి 3.7–4.6 మిల్లీమీటర్ల చొప్పున కుంగుతున్నాయి.
న్యూయార్క్ ను మునిగిపోకుండా కాపాడలేమా?
న్యూయార్క్ నగరాన్ని కాపాడేందుక బహుముఖ విధానం అవసరం. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ భూగర్భజల వినియోగాన్ని నియంత్రించడం: భూగర్భ జలాల వెలికితీతను పరిమితం చేయడం వల్ల నేల సంపీడనాన్ని తగ్గించవచ్చు.
⦿ మౌలిక సదుపాయాల బలోపేతం: భవనాలు, వంతెనలు, రవాణా వ్యవస్థలను వరదలు తట్టుకునేలా రూపొందించాలి.
⦿ పట్టణ ప్రణాళిక సర్దుబాట్లు: మృదువైన నేలలు, ఇతర ప్రాంతాల్లో ఎత్తైన నిర్మాణాలను పరిమితం చేయాలి.
⦿ వరద నుంచి కాపాడు రక్షణలు: సముద్రపు గోడలు, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థలు వరదల నుంచి కాపాడుతాయి.
Read Also: పిల్ల సైంటిస్టులు.. డ్రింక్ బాటిల్స్‌తో రాకెట్.. గాల్లోకి ఎలా దూసుకెళ్లిందో చూడండి!