Honeymoon Couple: కొత్తగా పెళ్లయిన ఓ జంట హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లింది. అయితే వారం రోజులుగా వారి నుంచి ఎలాంటి ఫోన్ రాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో టెన్షన్ మొదలైంది. వారికి ఆచూకీ చెబితే 5 లక్షలు ఇస్తామని ఆ కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఇంతకీ అసలేం జరిగింది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఓ వ్యాపారి రాజా రఘవంశీ-సోనమ్‌లకు మే 11న మ్యారేజ్ అయ్యింది. హనీమూన్ కోసం కొత్త జంట సెవెన్ సిస్టర్ స్టేట్స్‌కు వెళ్లింది. తొలుత గౌహతిలోని కామాఖ్య దేవి ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు హనీమూన్ ట్రిప్‌కు వెళ్లారు.
అక్కడి నుండి బైక్ అద్దెకు తీసుకుని మే 23న చిరపుంజికి బయలుదేరారు. అదే రోజు మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో రాజా కుటుంబ సభ్యులు మాట్లాడారు. వారితో మాట్లాడడం అదే చివరి కాల్. ఆ తర్వాత వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ అవుతున్నట్లు వినిపిస్తున్నాయి.
ఓ ప్రాంతంలోని బైక్ పార్కింగ్ చేసి కాలినడకన ఈ జంట వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. రాజా రఘవంశీ సోదరుడు విపిన్ ఈ విషయమై ఇండోర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి మధ్యప్రదేశ్ ప్రభుత్వం మేఘాలయ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.
ALSO READ: రైలులోనే రెస్టారెంట్.. ఎక్కడో కాదు ఇండియాలోనే
దీంతో మేఘాలయ పోలీసులు, టూరిజం అధికారులు ఆ జంట కోసం గాలింపు మొదలుపెట్టారు. దాదాపు వారం రోజులు గడుస్తున్నా, కొత్త జంట నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆ కుటుంబ సభ్యుల్లో ఆందోళన రెట్టింపు అయ్యింది. ఈ క్రమంలో రాజా రఘవంశీ-సోనమ్ ఆచూకి చెప్పినవారికి రూ.5లక్షల రివార్డును ఇస్తామని ప్రకటించింది.
వర్షాలు పడుతుండటంతో సెర్చ్ ఆపరేషన్‌కు సవాళ్లు ఎదురవుతున్నాయని సీఎం పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని చెప్పారు. చిరపుంజిలో భారీ వర్షాలు పడుతుండడంతో గాలింపు ఇబ్బందికరంగా మారిందన్నారు.
చిరపుంజి ప్రాంతం గురించి చెప్పనక్కర్లేదు. దేశంలో 100 శాతం వర్షపాతం నమోదైన ఏరియా. మేఘాలయ నిత్యం టూరిస్టులు, కొత్త జంటలతో కళకళలాడుతూ ఉంటుంది. దట్టమైన అటవీ ప్రాంతం, లోతైన లోయలు, వాటర్ ఫాల్స్ ఇవన్నీ అక్కడ ఉంటాయి. అందుకే కొత్త జంటలు ఆ ప్రాంతాన్ని ఎంచుకుంటాయి. జంట కోసం మేఘాలయ పోలీసులు అక్కడి రిసార్టుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
మేఘాలయలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. ఏప్రిల్ ప్రారంభంలో హంగేరీ పర్యాటకుడు మరణించాడు. తొలుత అతడు తప్పిపోయినట్లు వార్తలు వచ్చాయి. దాదాపు 12 రోజుల తర్వాత సోహ్రా ప్రాంతంలోని ఓ గ్రామంలో అతడి మృతదేహం కనిపించింది. ఇప్పుడు ఇండోర్ రాజా రఘవంశీ దంపతుల వంతైంది.