KTR ED Investigation: బషీర్ బాగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. అయితే కేటీఆర్ విచారణకు హాజరైన నేపథ్యంలో ఈడీ ఆఫీస్‌కు భారీ ఎత్తున బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. అయితే కార్యకర్తలను పోలీసులు అక్కడ తోపులాట జరిగింది. దీంతో ఈడీ కార్యాలయం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ముందస్తు చర్యల్లో భాగంగానే పోలీసులు భాష్పవాయువు, వాటర్ కెనాన్ల వాహనాలను కూడా తెప్పించారు. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్‌ను నమోదు చేసిన విషయం తెలిసిందే. జనవరి 7న మొదటిసారి ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉండగా.. ఏసీబీ కేసును కోట్టివేయాలని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు వచ్చే అంత వరకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్ కోరారు. దీంతో ఇవాళ విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం ఈడీ ఆఫీసులో కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
బీఆర్ఎస్ మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, తదితర కీలక నేతలు ఈడీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో తరలిరావడంతో ఈడీ కార్యాలయంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. దాదాపు అక్కడ 250 మంది పోలీసులు ఉన్నారు. అయితే పోలీసులతో గంగులా కమలాకర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఫార్ములా ఈ రేసు కేసులో ఎలాంటి అవినీతి జరగలేదని అన్నారు. తెలంగాణ పేరు, ప్రతిష్ఠలు ప్రపంచ వ్యాప్తంగా తెలియజేయడానికే కార్ రేసింగ్ నిర్వహించామని చెప్పారు. దేశంలో రూ.లక్షల కోట్ల అవినీతి పాల్పడుతున్న వ్యక్తులను పట్టుకోకుండా.. హైదరాబాద్‌లో మంచి ఈవెంట్ నిర్వహిస్తే అవినీతి అనడం కరెక్ట్ కాదని అన్నారు. న్యాయస్థానాలపైన తమకు నమ్మకం ఉందని.. నిజమే గెలుస్తుందని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు.
Also Read: JOBS: నిరుద్యోగులకు సూపర్ న్యూస్.. త్వరలో 26,263 ఉద్యోగాలకు నోటిఫికేషన్..
కేటీఆర్‌కు సంబంధించిన న్యాయవాదులు కొందరు ఈడీ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వొకేట్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసే అధికారం ఎవరికీ లేదని అన్నారు. ప్రస్తుతం కేటీఆర్‌ను ఈడీ విచారిస్తోందని.. విచారణలో డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌ను బట్టి ఆయనకు నోటీసులా ఇవ్వాలా..? వద్దా..? అనేది తెలుస్తుందని చెప్పారు. ఆర్బీఐ ఆఫీసర్లను విచారించిన తర్వాతే నిబంధనలకు లోబడి నిధులు బదిలీలు జరిగాయా..? లేదా..? అని తెలిసే అవకాశముందని అన్నారు. అలాగే హెచ్ఎండీఏలో కూడా కొంత మంది అధికారులను విచారిస్తే నిజాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ ఎలాంటి తప్పుచేయలేదని.. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన వద్ద సమాధానాలు ఉన్నాయన్నారు. కేటీఆర్ ఎలాంటి విచారణకు అయినా సిద్ధంగానే ఉన్నారని పేర్కొన్నారు.