Vande Bharat Train Accident: బీహార్ లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. నవాడా నుంచి క్యుల్ కు వెళ్తున్న ఈ సెమీ హైస్పీడ్ రైలు షేక్ పురా జంక్షన్ దాటిన తర్వాత జఖ్రాజ్ స్థాన్ రైల్వే గేట్ సమీపంలో ట్రాక్ మీద ఉన్న గేదెలను ఢీకొట్టింది. ఈ సమయంలో, గేదెలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న కాపరిని కూడా ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు గేదెలతో పాటు కాపరి అక్కడిక్కడే చనిపోయారు. రైలు ముందు భాగం పెద్ద మొత్తంలో దెబ్బతిన్నది.
అకస్మాత్తుగా గేదెలు ట్రాక్ మీదికి రావడంతో ప్రమాదం
ఉదయం 11 గంటల ప్రాంతంలోఈ ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా రెండు గేదెలు రైల్వే ట్రాక్ పైకి వచ్చాయి. వాటిని కాపాడేందుకు కచ్చి రోడ్ కు చెందిన 50 ఏళ్ల గోపాల్ యాదవ్ ట్రాక్ పైకి వచ్చాడు. అప్పుడే వందే భారత్ రైలు దూసుకొచ్చింది. గేదెలతో పాటు ఆయనను రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గోపాల్ యాదవ్ అక్కడికక్కడే మరణించాడు. అతడి రెండు గేదెలు కూడా ప్రాణాలు కోల్పోయాయి. గేదెలతో పాటు గోపాల్ మృతదేహాలు ముక్కలు ముక్కలు అయిపోయాయి. ఆ ప్రాంతం అంతా మాంసం ముద్దలతో భయంకరంగా మారింది.
ఎమర్సెన్సీ బ్రేకులు వేసిన లోకో పైలెట్
అటు ఈ ప్రమాదం జరిగిన వెంటనే లోకో పైలట్ వెంటనే అత్యవసర బ్రేక్‌లు వేసి రైలును ఆపాడు. అకస్మాత్తుగా బ్రేకింగ్ చేయడం వల్ల రైలులో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంత మంది ప్రయాణీకులు ముందువైపుకు దూసుకొచ్చారు. ప్రయాణీకులు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. ప్రాథమిక దర్యాప్తు తర్వాత, సాంకేతిక బృందం రెండు నిమిషాల్లోనే రైలును పంపించింది. అయితే, ఈ ఘటనలో రైలు ముందు భాగం దెబ్బతిన్నది.
Read Also: రైలు టికెట్ ధరలు పెరుగుతాయ్.. కానీ, వీటికి మాత్రం కాదు!
రైల్వే అధికారులపై ప్రయాణీకులు ఆగ్రహం
ఈ ప్రమాదం తర్వాత రైల్వే అధికారులు తీరుపై ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తగిన భద్రతా ఏర్పాట్లు లేకుండా క్యుల్-గయా రైల్వే విభాగంలో హైస్పీడ్ వందే భారత్ రైలును నడిపారని మండిపడుతున్నారు. ఈ సెక్షన్ లో రైలు వేగం సాధారణంగా గంటకు 95-100 కిలోమీటర్లు ఉంటుంది. అయితే షేక్ పురా ప్రాంతంలో రైల్వే ట్రాక్ కు ఇరువైపులా జన సంచారం ఎక్కువగా ఉంటుంది. రైల్వే ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేయలేదు. అండర్ పాస్ లు, ఇతర భద్రతా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ రైల్వే విభాగంలో భద్రతా ప్రమాణాలను త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై రైల్వే యంత్రాంగం విచారణ మొదలుపెట్టింది. ప్రమాదానికి గల కారణాలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై విచారణ జరుపుతోంది.
Read Also: చిత్తూరులో రైలు దోపిడీ.. అచ్చం సినిమాల్లో చూపించినట్లే!