Indian Railways: భారతీయ రైల్వే ద్వారా నిత్యం కోట్లాది మంది ప్రయాణం చేస్తుంటారు. పేద, మధ్య తరగతి ప్రజలు తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం జర్నీ చేస్తారు. బస్సులు, విమానాలతో పోల్చితే రైల్వే ఛార్జీలు చాలా తక్కువగా ఉంటాయి. దేశ రవాణాకు వెన్నెముకగా ఉన్న రైల్వే టికెట్ల ధర స్వల్పంగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త ధరలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే, రైల్వే నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. చాలా ఏళ్ల తర్వాత టికెట్ ధరలను సవరించబోతోంది రైల్వేశాఖ.
టికెట్ ధరల పెంపు ఎలా ఉండబోతోందంటే?
విశ్వసనీయ సమాచారం ప్రకారం, నాన్-ఏసీ మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్ల టికెట్ ధర ప్రతి కిలోమీటరుకు 1 పైసా పెరగనుంది. ఏసీ తరగతికిటికెట్ ధర ప్రతి కిలోమీటరుకు 2 పైసలు చొప్పున పెరగనుంది. జనరల్ క్లాస్ కు సంబంధించి 500 కి.మీ. దాటిన ప్రయాణాలకు కిలోమీటరుకు 1 పైసా చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీ పెంపు సాధారణ ప్రయాణికులపై పెద్దగా ప్రభావం చూపించదు. మధ్య, ఎక్కువ దూరం ప్రయాణించే ప్యాసింజర్ల మీద స్వల్ప ప్రభావం చూపించనుంది.
ఎవరి మీద పెరిగిన భారం పడదంటే?
రైలు టికెట్ ఛార్జీలు పెరిగినప్పటికీ, సబర్బన్ రైలు టికెట్ ధరలు యథాతథంగా ఉంటాయి. మెట్రో, పట్టణాల్లో రోజువారీ ప్రయాణీలు చేసే వారికి ఊరట కలగనుంది. అటు నెలవారీ సీజన్ టికెట్ల ధరల్లో కూడా ఎలాంటి మార్పులు ఉండవు. ఉద్యోగులు, విద్యార్థులు పాత ఛార్జీలనే చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ క్లాస్ టికెట్ మీద 500 కి.మీ. వరకు ప్రయాణించే వారిపై ఛార్జీ పెంపు ప్రభావం ఉండదు.
Read Also: స్కూటీ కాస్ట్ లక్ష, ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ కాస్ట్ 14 లక్షలు!
సింపుల్ గా భారతీయ రైల్వే ఛార్జీల పెంపు వివరాలు!
⦿ AC కోచ్‌లు: కిలోమీటరుకు 2 పైసల ఛార్జీల పెంపు.
⦿ నాన్-AC కోచ్‌లు: కిలోమీటరుకు 1 పైసా ఛార్జీల పెంపు.
⦿ జనరల్ టికెట్లు: 500 కి.మీ వరకు దూరాలకు పెంపు లేదు.
⦿ సబర్బన్, సీజన్ టికెట్లు: ఎటువంటి మార్పులు లేవు. రోజువారీ ప్రయాణికులకు ఉపశమనం కలిగిస్తాయి.
⦿ సుదూర ప్రయాణం: 500 కి.మీ కంటే ఎక్కువ దూరాలకు, కి.మీ.కు అదనంగా రూ.0.50 వర్తిస్తుంది. ఉదాహరణకు ఢిల్లీ నుంచి ముంబై లేదంటే కోల్ కతాకు AC తరగతిలో వన్-వే ట్రిప్‌కు రూ.25–30 ఎక్కువ ఖర్చవుతుంది.
⦿ కొత్త బుకింగ్ సిస్టమ్: అటు 24 గంటల ముందుగా సీట్లను నిర్ధారించే వ్యవస్థను భారతీయ రైల్వే అధికారులు పరీక్షిస్తున్నారు.
⦿ రైలు టికెట్ల ధరల పెంపు జులై 1 నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటి వరకు టికెట్ల ధర పెంపునకు సంబంధించి రైల్వే నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.