Oyo New Rules : సులువుగా ఆన్ లైన్ లో హోటల్ బుకింక్స్ చేసే అవకాశాన్ని కల్పించి.. అతిథ్య రంగంలో అగ్రగామి స్టార్టప్ గా ఎదిగిన ఓయో సరికొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది. ఇన్నాళ్లు.. మేజర్లు అయిన ఎవరికైనా హోటళ్లల్లో ప్రవేశం కల్పించగా, ఇకపై పెళ్లైన జంటలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. గతంలో పెళ్లితో సంబంధం లేకుండా… ఎవరైనా నిరభ్యంతరంగా హోటల్ గదుల్ని బుక్ చేసుకునే అవకాశం ఉంది. కానీ.. ప్రస్తుతం విడుదల చేసిన నూతన విధానాల్లో కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో.. ఇకపై ఓయో ద్వారా హోటళ్లు బుక్ చేసుకోవాలంటే.. కొత్త విధానాల్ని అనుసరించాల్సి ఉంటుందని తెలిపింది.
హోటల్ అగ్రిగేటర్ ఓయో కొత్త చెక్-ఇన్ పాలసీని పరిచయం చేసింది. ఇందులో భాగంగా.. ఇకపై పెళ్లికాని జంటలు తమ యాప్ ద్వారా రూమ్ బుక్ చేసుకునే అవకాశం లేదని తెలిపారు. అయితే.. తొలుత ఈ నిబంధనను మేరఠ్ నుంచి ప్రారంభించనున్నట్లు ఓయో ప్రకటిచింది. ఈ విధానం అమలు తర్వాత వెలువడే ఫలితాల ఆధారంగా దేశంలోని ఇతర నగరాలకు ఈ విధానాన్ని విస్తరించనున్నట్లు తెలిపింది.
ఓయో కొత్త చెక్-ఇన్ పాలసీ ప్రకారం.. ఇకపై ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో రూమ్ బుకింగ్ చేసుకోవాలంటే అన్ని జంటలు పెళ్లి జరిగినట్లుగా రుజువులు చూపించాల్సి ఉంటుందని తెలిపింది. అంటే కచ్చితంగా పెళ్లిని నిర్ధరించేలా ఏదో ఓ ఐడీ ఫ్రూఫ్ చూపించాలని కోరింది. లేదంటే.. వాళ్లకు బుకింగ్ ఇవ్వరని స్పష్టం చేసింది.
అయితే.. ఏదైనా సందర్భంలో మ్యారేజ్ ఫ్రూఫ్ లేని జంటలకు రూమ్స్ తిరస్కరించేందుకు ఓయో తనభాగస్వామి హోటళ్లకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఇన్నాళ్లు.. ఎలాంటి పెళ్లి ఆధారాలు చూపించకపోయినా బుకింగ్ కల్పించాల్సిందే. లేదంటే.. సంబంధిత హోటళ్లపై ఓయో ఫైన్ వేస్తుండేంది. కానీ.. ఇప్పటి నుంచి అలాంటిది ఉండదని స్పష్టం చేసిన ఓయో..మేరఠ్‌లోని తన భాగస్వామ్య హోటళ్లలో తక్షణమే దీన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్దేశించింది.
Also Read : అందుబాటులోకి తొలి నమో భారత్ రైలు, జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోడీ!
దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా తన సేవల్ని విస్తరిస్తున్న ఓయో.. తాజా నిర్ణయం వెనుక సుదీర్ఘ కసరత్తు జరిగింది అంటున్నారు. తమను ఆశ్రయించే వినియోగదారుల భద్రత, క్షేమంతో పాటు.. ఓయో సురక్షితమైన, బాధ్యతాయుతమైన ఆతిథ్య పద్ధతులను అమలు చేస్తుందని తెలిపేందుకే ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. కుటుంబాలు, విద్యార్థులు, ఒంటరిగా ప్రయాణం చేసేవారికి సురక్షితమైన ప్రాంతంగా ఓయో నిలవాలని, అలాంటి బ్రాండ్ వ్యాల్యూ పొందాలని ఆశిస్తున్నట్లు ఓయో కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. వినియోగదారులకు ఓయో బుకింగ్స్ పై నమ్మకం, విశ్వాసం పెరిగితే.. బుకింగ్స్ మరింత పెరుగుతాయని ఆశిస్తోంది.