దీవులు లేదా ద్వీపపు ప్రాంతాలకు వెళ్లాలంటే అందరూ లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు వంటివి ఎంచుకుంటారు. అలాంటి ప్రాంతాలకు వెళ్తే ఖర్చు కూడా అధికంగానే అవుతుంది. అంతవరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అందమైన ద్వీప ప్రాంతాన్ని మన ఆంధ్ర ప్రదేశ్ లోనే చూడవచ్చు. ఇందుకోసం మీరు ఎక్కువ దూరాలు ప్రయాణం చేయాల్సిన అవసరం కూడా లేదు. కోనసీమ బ్యాక్ వాటర్స్ లో తెలియాడే ఒక అందమైన మారుమూల ద్వీప గ్రామం పల్లం ద్వీపం. ఈ ద్వీపాన్ని చూస్తే ఎంతో ప్రశాంతంగా, పచ్చదనంతో, నీటి పరవళ్లతో నిండిపోయి ఉంటుంది.
పల్లం ద్వీపం ఎక్కడ ఉంది?
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన మండలం పరిధిలోకి వస్తుంది ఈ పల్లం ద్వీపం. గోదావరి డెల్టాలో ఉన్న ఒక చిన్న జనాభా సహిత ద్వీపం ఇది. దీన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు. పక్షులు, అలల ప్రవాహాలు, పచ్చదనంతో చూసేందుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ద్వీపం చుట్టూ దట్టమైన మడ అడవులు ఉంటాయి. ఈ మడ అడవులకు వలస పక్షులు, క్షీరదాలలో ఎన్నో జలజాతులు వస్తూపోతూ ఉంటాయి. అందుకే ఈ పల్లం ద్వీపాన్ని అద్భుతమైన జీవవైవిద్య హాట్ స్పాట్ గా చెప్పుకోవచ్చు.
పల్లం ద్వీపంలో 12,000 మందికి పైగా జనాలు నివసిస్తున్నారు. ఈ ద్వీపం దాదాపు పది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ వారి జీవితం కూడా ఆ నది మీద ఆధారపడి సాగుతుంది. ఇక్కడ ఉన్న నివాసితులు చేపలు పట్టడం, వ్యవసాయం చేయడం, రొయ్యల పెంపకం పైనే ఆధారపడి జీవిస్తున్నారు. కొబ్బరి చెట్లు ఈ ద్వీపంలో నిండుగా ఉంటాయి.
వైజాగ్, హైదరాబాద్ వంటి నగరాల నుండి ఈ ద్వీపానికి సులువుగా చేరుకోవచ్చు. వైజాగ్ నుండి రోడ్డు మార్గంలో ఐదు గంటల్లో ఈ పల్లం ద్వీపానికి వెళ్ళవచ్చు. వైజాగ్ నుండి కాకినాడ లేదా రాజమండ్రి కి రైలులో ప్రయాణించి అక్కడ నుంచి కాట్రేనికోనకు రోడ్డు మార్గంలో ప్రయాణించవచ్చు. ఆ తర్వాత పడవ మీద లేదా వంతెన గుండా ఈ పల్లం ద్వీపానికి చేరుకోవచ్చు.
వైజాగ్ నుంచి ఎలా వెళ్లాలి?
విశాఖపట్నం నుండి పల్లం ద్వీపానికి వెళ్లేందుకు 230 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుంది. అదే మీరు కారులో వెళ్తే ఈ రోడ్డు మార్గంలో అయిదు గంటల సమయం పడుతుంది. ఎలమంచిలి, తుని, కాకినాడ పట్టణాల గుండా ప్రయాణించాలి.
ఈ పల్లం ద్వీపంలోని గ్రామస్తుల జీవన శైలి నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. చిన్న ద్వీపంలోనే వారు ఎంత ఆనందంగా జీవిస్తున్నారో గమనించవచ్చు. ఈ ప్రదేశం నిశ్శబ్దంగా ఉంటుంది. అందమైన పక్షుల కిలకలరావాలతో, నీటి అలజడులతో కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది. మీరు ఒక సరికొత్త ప్రపంచంలోకి వెళ్లాలనుకుంటే ఈ పల్లం ద్వీపం వెళ్లేందుకు ప్రయత్నించండి. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది.