Cab Fare Hike: ఇప్పటికే టిప్స్ అని జనాలతో డబ్బులు అడ్డగోలుగా వసూలు చేస్తున్న యాప్స్.. అయితే ఇప్పుడు మేలు చేసేలా కేంద్రం వెసులుబాటు కల్పించింది. రద్దీని బట్టి చార్జీలు పెంచుకోవచ్చని చెప్పింది. దీంతో యాప్ దోపిడికి గేట్లు తెరిచినట్టయింది. అయితే దీని ఎఫెక్ట్ జనం పై ఎలా ఉండబోతోంది.
క్యాబ్ ధరలు పెంపు
మీరు ఆన్ లైన్‌లో క్యాబ్ సర్వీసులను అందించే యాప్స్‌ను వాడుతున్నారా? అయితే ఇకపై జాగ్రత్త. మీ నుండి ఈ ఓలా, ఉబెర్, ర్యాపిడో వంటి క్యాబ్ సర్వీసులు రద్దీ సమయాల్లో ఎక్కువ డబ్బులు వసూలు చేయనున్నాయి. ఈమేరకు వారికి వెసులుబాటు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. దీని ప్రకారం క్యాబ్ కంపెనీలు పీక్ అవర్స్‌లో రెట్టింపు ఛార్జీలు వసూలు చేసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం జూలై 2 ఉబెర్, ఓలా, రాపిడో వంటి క్యాబ్ అగ్రిగేటర్లు రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ప్రయాణికుల నుండి బేస్ ఫేర్ కంటే రెండు రెట్లు ఎక్కువ వసూలు చేయడానికి అనుమతించింది. గతంలో, రైడ్-హెయిలింగ్ సంస్థలు పీక్ అవర్స్‌లో బేస్ ఫేర్ కంటే 1.5 రెట్లు ఎక్కువ వసూలు చేయవచ్చు. నాన్-పీక్ అవర్ ఛార్జీలు బేస్ రేట్లలో 50 శాతం కంటే తక్కువ ఉండకూడదని కూడా పేర్కొంది.
క్యాబ్స్ డ్రైవర్లకు గుడ్ న్యూస్
దేశంలోని ప్రధాన నగరాల్లో చాలామంది ఈ యాప్ ఆధారిత టాక్సీలు, బైక్ రైడ్‌లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది సౌకర్యం కాదు అవసరం. రోజువారీ ప్రయాణాలకు జీవనాధారం. కానీ పట్టణాల్లో రద్దీ పెరుగుతున్న కొద్దీ, ఖర్చులు పెరుగుతున్న కొద్దీ స్పష్టమైన, న్యాయమైన ధరల నిర్ణయించడం చాలా అవసరం. కేంద్రం డ్రైవర్లకు అనుకూలంగా కూడా నిర్ణయాలు తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి క్యాబ్ కంపెనీ డ్రైవర్‌కు రూ. 5 లక్షల విలువైన ఆరోగ్య బీమా, రూ. 10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ అందించాలి.
కేంద్ర ప్రభుత్వం నూతన ఈ మార్గదర్శకాలను తదుపరి మూడు నెలల్లోపు అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. వాస్తవ ధర, డ్రైవర్ కమిషన్ నమూనాలను నిర్ణయించడం రాష్ట్రాల ఇష్టం. ఒక రాష్ట్రం ఇంకా ఛార్జీలను నిర్ణయించకపోతే క్యాబ్ కంపెనీలు తమ సొంత ప్రాథమిక ఛార్జీని స్పష్టంగా ప్రకటించాలి. ప్రయాణికులు గమనించాల్సిన మరో విషయం “డెడ్ మైలేజ్” ఛార్జీలు… అంటే డ్రైవర్ మీ వద్దకు చేరుకోవడానికి ప్రయాణించే దూరానికి చెల్లించేది. మీ పికప్ పాయింట్ 3 కి.మీ కంటే ఎక్కువ దూరంలో ఉంటే ఇది వర్తిస్తుంది. ఇది అనవసరమైన ఛార్జీలను తగ్గించడం, చిన్న దూర ప్రయాణాలను మరింత న్యాయంగా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read: ఏపీ లిక్కర్ స్కాంలో కొత్త పేర్లు ..
ముఖ్యంగా యాప్‌లో ప్రయాణాన్ని అంగీకరించిన తర్వాత కారణం పేర్కొనకుండ డ్రైవర్ బుకింగ్‌ను రద్దు చేస్తే, ఛార్జీలో 10 శాతం జరిమానా, రూ.100 పరిమితితో విధించబడుతుందని కొత్త నిబంధనలు పేర్కొంటున్నాయి.