భారతీయ రైల్వే అందిస్తున్న సబ్సిడీలను అలాగే కొనసాగించాలని పార్లమెంటరీ ప్యానెల్ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. సబర్బన్, నాన్ ఏసీ టికెట్లపై సబ్సిడీలు ఇవ్వడం వల్ల మధ్య తరగతి ప్రజలకు ప్రయాణభారం తగ్గుతుందని అభిప్రాయపడింది. రైల్వేశాఖ గ్రాంట్ల డిమాండ్లపై రైల్వే స్టాండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేసింది. ఏసీ క్లాస్ ఛార్జీలను ఖర్చులతో కంపేర్ చేయడానికి, నాన్-ఏసీ క్లాస్ లను క్రమంగా, సరసమైన సర్ధుబాట్లను చేయడానికి ఎప్పటికప్పుడు సమగ్ర ఛార్జీల సమీక్ష చేపట్టాలని సూచించింది.
ఆదాయం లేకున్నా సబ్సిడీలు
పార్లమెంట్ సభ్యుడు సి.ఎం. రమేష్ నేతృత్వంలోని ప్యానెల్ ఈ మేరకు సమావేశమైన కీలక నిర్ణయాలు తీసుకున్నది. “2020, 2022లో ఛార్జీల హేతుబద్ధీకరణ ప్రయత్నాలు ఉన్నప్పటికీ, ఇందులో నాన్ ఏసీ, ఏసీ క్లాస్ ఛార్జీలలో స్వల్ప పెరుగుదల ఉంది. ఏసీ ఇఎంయు (ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్), ఫస్ట్ క్లాస్ సబర్బన్ ఛార్జీలలో గణనీయమైన తగ్గింపులు ఉన్నాయి. అయినప్పటికీ భారతీయ రైల్వే ప్రయాణీకుల టికెట్లపై భారీగా సబ్సిడీని అందిస్తూనే ఉన్నాయి” అని ప్యానల్ వెల్లడించింది.
ఆదాయ పెంపు కోసం చర్యలు చేపట్టిండి!
ఇక సబర్బన్ సేవలు ఖర్చులలో 30 శాతం మాత్రమే వసూలు చేస్తున్నాయని తెలిపింది. నాన్ ఎసీ ప్రయాణంలో 39 శాతం మాత్రమే వసూలు చేస్తుందని వివరించింది. ఏసీ ప్రయాణం కేవలం 3.5 శాతం స్వల్ప మిగులును సాధిస్తుందని ప్యానెల్ గుర్తించింది. తక్కువ ఆదాయం ఉన్నా ప్రయాణీకులకు సరసమైన ధరలను నిర్ధారించేటప్పుడు, నికర ఆదాయాన్ని పెంచడానికి రైల్వేలు సమగ్రమైన వ్యూహాలను అనుసరించాలని సూచించింది. ఇందులో ఏసీ క్లాస్ లు, ప్రీమియం రైళ్లకు డైనమిక్ ధరలను అమలు చేయాలన్నది. డిమాండ్ ఆధారంగా ఫ్లెక్సీ ఫేర్ పథకాలను క్రమం తప్పకుండా సమీక్షించాలన్నది. ఇ-వేలం విధానాలు, ప్రకటనలు, రైల్వే ఆస్తుల కమర్షియల్ వినియోగం ద్వారా నాన్-ఫేర్ ఆదాయాన్ని పొందే అవకాశం ఉందని ప్యానెల్ తెలిపింది.
Read Also: హోలీ రద్దీ నేపథ్యంలో రైల్వే కీలక నిర్ణయం, బెంగళూరు నుంచి విశాఖకు ప్రత్యేక రైలు!
ఆదాయాన్ని పెంచుకునేందుకు కీలక నిర్ణయాలు
అటు ఖర్చు నియంత్రణ చర్యలతో పాటు నికర ఆదాయాన్ని పెంచడం ప్రాధాన్యతగా పెట్టుకున్నట్లు భారతీయ రైల్వే పార్లమెంట్ ప్యానెల్ కు వెల్లడించింది. అందుబాటులో ఆదాయ వనరులను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది. ఆదాయాన్ని పెంచడానికి ప్రత్యేక రైళ్లను నడపడం, వందే భారత్, అమృత్ భారత్ రైళ్లను ప్రవేశపెట్టడం, ఆన్-బోర్డ్ సామర్థ్యాన్ని పెంచడం, ప్రీమియం రైళ్లలో ఫ్లెక్సీ-ఫేర్ పథకాన్ని ప్రవేశపెట్టడం, హేతుబద్ధీకరించడం, అవసరమైన చోట రిజర్వేషన్ కోటాను సమీక్షించడం, VIKALP పథకాన్ని విస్తరించడం లాంటి వివిధ కార్యక్రమాలు చేపట్టామని ప్యానెల్ కు వివరించింది. అటు సరకు రవాణా, ఇతర ఆదాయాన్ని పెంచడానికి సరళీకృత నిబంధనలతో కూడిన కార్గో టెర్మినల్ విధానాన్ని ప్రవేశపెట్టడం, వ్యాగన్ పెట్టుబడి పథకాలు, గూడ్స్ షెడ్ రేటింగ్ డాష్ బోర్డ్ ప్రారంభం, వాణిజ్య ఆదాయ, ఇతర ఆదాయ ఒప్పందాల కోసం ఇ-వేలం విధానాన్ని ప్రవేశపెట్టడం, ఈ-కామర్స్ సేవలపై ఫోకస్ పెట్టినట్లు రైల్వే సంస్థ వెల్లడించినట్లు పార్లమెంట్ ప్యానెల్ తన నివేదికలో వెల్లడించింది.
Read Also: వైజాగ్ వెళ్లే ప్రయాణీకులకు గుడ్ న్యూస్, రెండు రోజుల పాటు ప్రత్యేక రైళ్లు!