Vande Bharat Express: భారతీయ రైల్వేలో అత్యాధునిక సెమీ హైస్పీడ్ రైలుగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ అడుగు పెట్టింది. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ప్రయాణీకులకు అత్యంత వేగవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తోంది. ఈ రైళ్లో టికెట్ లేకుండా ప్రయాణించడం సాధ్యం కాదు. కానీ, కొంత మంది టీటీఈలు టికెట్ లేని ప్రయాణీకుల నుంచి డబ్బులు తీసుకుని ప్రయాణానికి అనుమతిస్తున్నట్లు తేలింది. ప్రయాణీకుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు టీటీఈలను తాజాగా రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన జార్ఖండ్ లో జరిగింది.
ఆకస్మిక తనిఖీల సందర్భంగా టీటీఈలపై వేటు
తాజాగా ధన్‌బాద్ డివిజన్ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ (ADRM) వినీతా కుమార్ మే 11న ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నసీమ్, అర్జున్ సాహు టికెట్ లేని ప్రయాణీకుల నుంచి అక్రమంగా డబ్బులు వసూళు చేసినట్లు గుర్తించారు. టికెట్లు లేకుండా ప్రయాణిస్తున్న 11 మంది ప్రయాణికులను గుర్తించారు. వారందరి దగ్గర డబ్బులు తీసుకుని టీటీఈలు ప్రయాణించేందుకు అనుమతించినట్లు తేలింది. పాట్నా- టాటానగర్ మధ్య నడుస్తున్న రైలులో రిజర్వ్డ్ సీటింగ్, ఎలక్ట్రానిక్ టికెటింగ్ వ్యవస్థలు ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో అనధికార ప్రయాణీకులు ఉండటం పట్ల ఆయన షాకయ్యారు. తనిఖీ సమయంలో సేకరించిన వివరాల ప్రకారం ఇద్దరు TTEలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని స్పష్టం చేశారు. టికెట్ లేని ప్రయాణీకుల నుంచి రైల్వే నిబంధనల ప్రకారం జరిమానాలు వసూలు చేయడానికి బదులుగా, వారు అక్రమంగా వసూళ్లకు పాల్పడి, ప్రయాణించడానికి అనుమతించారని వెల్లడించారు.
Read Also: ఇకపై 24 గంటల ముందే రిజర్వేషన్ చార్జ్ రెడీ, ఎందుకంటే?
రైల్వే డివిజన్ కు నివేదిక సమర్పించిన ADRM
తనిఖీ తర్వాత, చక్రధర్ పూర్ రైల్వే డివిజన్ కు ADRM వినీతా కుమార్ వివరణాత్మక నివేదికను సమర్పించారు. సమగ్ర ప్రాథమిక సమీక్ష తర్వాత, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ (సీనియర్ DCM) ఆదిత్య చౌదరి, తక్షణమే ఇద్దరు TTEలను రైల్వే విధుల నుండి తొలగించారు. ప్రస్తుతానికి, పూర్తి శాఖాపరమైన విచారణ జరిగే వరకు వారిని టాటానగర్ స్టేషన్ కు అటాచ్ చేశారు. “ఈ విషయంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. తుది నివేదిక తర్వాత కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాము”DCM ఆదిత్య చౌదరి వెల్లడించారు. అవినీతి, నిర్లక్ష్యంతో పాటు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లాంటి ప్రీమియం రైళ్ల పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని గుర్తు చేశారు. ఇటువంటి సంఘటనలను సహించబోమని ఆయన తేల్చి చెప్పారు. తరచుగా ఆకస్మిక తనిఖీలు, CCTV కెమెరాల ఏర్పాటు, ఆన్ బోర్డ్ సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు పర్యవేక్షణ కఠినతరం చేస్తున్నట్లు తెలిపారు. రైల్వే ఉద్యోగులు నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వందేభారత్ లాంటి రైళ్లలో అవినీతికి పాల్పడితే చర్యలు మరింత సివియర్ గా ఉంటాయని తేల్చి చెప్పారు. ఉద్యోగులు ఎవరైనా నిబంధనలకు అనుగుణంగా పని చేయాల్సిందేనన్నారు.
Read Also: పలు రైళ్లను రద్దు చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే, ఎందుకంటే?