Petroleum Amendment Bill 2026: పెట్రోల్, డీజిల్ వ్యాపారాలు ఇకపై ఇష్టానుసారం చేస్తామంటే కుదరదు. లైసెన్సు అవసరమైన పెట్రోలియం కార్యకలాపాలను అనుమతి లేకుండా నిర్వహిస్తే భారీ జరిమానాలు, జైలు శిక్షలు విధించేలా కేంద్రం కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది. పెట్రోలియం చట్టం 1934లో మార్పులు చేయడానికి పెట్రోలియం సవరణ బిల్లు-2026 ముసాయిదాను కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ప్రజాభిప్రాయానికి విడుదల చేసింది.
ప్రస్తుతం ప్రతిపాదించిన నిబంధనల ప్రకారం.. లైసెన్సు తప్పనిసరి అయిన పెట్రోలియం కార్యకలాపాలను అనుమతి లేకుండా నిర్వహిస్తే రూ.25 కోట్ల వరకు జరిమానా, మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంతేకాదు.. అధికారులు ఉల్లంఘనలను గుర్తించి హెచ్చరించిన తర్వాత కూడా అదే పని కొనసాగిస్తే రోజుకు రూ.10 లక్షల వరకు అదనపు జరిమానా విధించే ప్రతిపాదన ఉంది. అంటే హెచ్చరిక వచ్చినా ‘చూద్దాంలే’ అంటూ కొనసాగిస్తే.. కఠిన చర్యలు తప్పవు.
పెట్రోలియం కార్యకలాపాలకు లైసెన్సు తీసుకునే విషయంలోనూ కఠిన నిబంధనలు ప్రతిపాదించారు. తప్పుడు సమాచారం, మోసపూరిత పద్ధతులు, నకిలీ ఆధారాలతో లైసెన్సు పొందితే ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా ముసాయిదాలో ప్రతిపాదనలు ఉన్నాయి. అంటే, లైసెన్సు కోసం పేపర్లు సెట్ చేయడం కాదని.. పేపర్లు తప్పుగా సెట్ చేస్తే జైలు తలుపులు తెరుచుకునే అవకాశం ఉందన్నమాట.
పెట్రోలియం రంగానికి సంబంధించిన కీలక మౌలిక వసతులకు నష్టం కలిగించే చర్యలపైనా కఠిన శిక్షలను ప్రతిపాదించారు. ప్రభుత్వం ‘క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’గా గుర్తించిన వసతులకు నష్టం కలిగించే ఉల్లంఘనలకు భారీ జరిమానా, జైలు శిక్షలు ఉండేలా నిబంధనలు రూపొందించారు. పెట్రోలియం రంగంలో భద్రత, సరఫరా వ్యవస్థకు ఇబ్బంది కలిగించే చర్యలను తీవ్రంగా పరిగణించాలన్నదే ఈ మార్పుల వెనుక ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
పెట్రోలియం చట్టం 1934లో రూపొందింది. ప్రస్తుత శిక్షలు, జరిమానాల్లో చాలా కాలంగా పెద్దగా మార్పులు లేవని కేంద్రం చెబుతోంది. అందుకే తాజా పెట్రోలియం రంగం, వ్యాపార పరిమాణం, భద్రతా అవసరాలకు అనుగుణంగా నిబంధనలను మార్చాలని ప్రతిపాదించింది. మరోవైపు చిన్నపాటి లైసెన్సు నిబంధనల ఉల్లంఘనలను క్రిమినల్ కేసులుగా కాకుండా సివిల్ పెనాల్టీల పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదన కూడా ముసాయిదాలో ఉంది. అంటే చిన్న తప్పుకు జైలు.. పెద్ద ఉల్లంఘనకు జరిమానా అన్న ఒకే రూల్ కాకుండా, ఉల్లంఘన తీవ్రతను బట్టి శిక్ష ఉండేలా వ్యవస్థను మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ముసాయిదాపై ప్రజలు, పరిశ్రమలు, ఇతర భాగస్వాముల నుంచి అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలను కోరింది. అక్టోబర్ 30, 2026 వరకు అభిప్రాయాలను పంపేందుకు అవకాశం ఇచ్చింది. పెట్రోలియం రంగంలో భద్రతా ప్రమాణాలు, లైసెన్సింగ్, కీలక మౌలిక వసతుల రక్షణకు సంబంధించి నిబంధనలను మరింత కఠినతరం చేయడమే ఈ ముసాయిదా ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
Read Also: చారణా కోడికి బారణా మసాలా.. రూ. 70 వేల బైక్ మీద రూ. 10 లక్షల చలాన్లు!