Place With Beach And Mountains: కొంతమందికి కొండ ప్రాంతాలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. మరికొందరు సముద్ర తీరాలు ఇష్టపడతారు. తమ సెలవులను హిల్ స్టేషన్‌లో గడపాలని ఇంకొందరు కలలు కంటారు. బీచ్‌లో సూర్యాస్తమయాన్ని చూస్తే మనస్సు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మరి సముద్రం, కొండలు.. రెండూ ఒకే చోట ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది.
మీరు ఈ రెండింటినీ కలిపి ఉన్న అనేక ప్రదేశాలను చూడవచ్చు. భారతదేశంలో బీచ్‌లు , పర్వతాలు కలిసి ఉండే ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఈ ప్రదేశాలలో.. మీరు పచ్చని పర్వతాలతో పాటు నీలిరంగు సముద్రపు నీటి అందాలను ఒకే చోట ఆస్వాదించవచ్చు. సముద్రానికి దగ్గరగా పర్వతాలు ఉన్న ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గోవాలోని కనకోనా:
దక్షిణ గోవాలో కనకోనా అనే అందమైన ప్రదేశం ఉంది. ఇక్కడ అగోంధా బీచ్, బటర్‌ఫ్లై బీచ్ , పలోలెం బీచ్ వంటి అద్భుతమైన బీచ్‌లు కూడా ఉన్నాయి. ఈ బీచ్‌లు అద్భుతమైన, దట్టమైన పచ్చని పర్వతాలతో చుట్టి ఉన్నాయి. బీచ్ కి ఒక వైపు ఇసుక , పొడవైన తాటి చెట్లు ఉంటాయి. మరోవైపు దూరం వరకు సముద్రపు నీరు, కొండలు ఉంటాయి. ఈ ప్రదేశం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అంతే కాకుండా మనస్సుకు కూడా మంచి అనుభూతిని కలిగిస్తుంది.
కర్ణాటకలోని గోకర్ణ:
మీరు ప్రశాంతంగా సెలవులను గడపాలని చూస్తున్నట్లయితే.. మీ బిజీ లైఫ్ స్టైల్‌కి దూరంగా ప్రకృతికి దగ్గరగా ఉండటానికి కర్ణాటకలోని గోకర్ణను సందర్శించండి. గోకర్ణ భారతదేశంలో అత్యంత ఆకర్షణీయమైన బీచ్‌లలో ఒకటి. ఇక్కడ ఓం బీచ్, కుడ్లే బీచ్, పారడైజ్ బీచ్, నిర్వాణ బీచ్ ,హాఫ్ మూన్ బీచ్ వంటి కొన్ని అందమైన బీచ్‌లు ఉన్నాయి. కానీ పర్యాటకులను ఆకర్షించేది బీచ్‌లు మాత్రమే కాదు.. గోకర్ణలోని అందమైన పర్వతాలు, అడవులు కూడా . ఈ ప్రదేశాలనికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి టూరిస్టులు నిత్యం వస్తుంటారు.
ఏపీలోని యార్డా:
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుండి 15 కి.మీ దూరంలో ఉన్న యార్డా బీచ్, బంగాళఖాతం పశ్చిమ తీరంలో ఉన్న ఒక స్వచ్ఛమైన బీచ్. యార్డా బీచ్ మూడు వైపులా అందమైన పర్వతాలతో చుట్టు ముట్టబడి ఉంది. బీచ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో డాల్ఫిన్స్ నోస్ అనే కొండ ఉంది. అది నిజానికి డాల్ఫిన్ ముక్కులా కనిపిస్తుంది. అందుకే ఈ ప్రదేశాన్ని చూడటానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు.
Also Read: మాల్దీవులను మరపించే అందాలు, ఒక్కసారైనా చూసి తీరాలి !
అండమాన్‌లోని ఎలిఫెంట్ బీచ్ :
అండమాన్‌లోని హేవ్‌లాక్ ద్వీపంలో కలలు కనే అందమైన ప్రదేశం ఉంది. దీని పేరు ఎలిఫెంట్ బీచ్. దీనిని పడవ ద్వారా లేదా రాతి అడవుల గుండా ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవచ్చు. అడవులు, పొడవైన చెట్లు, పచ్చని పర్వతాల మధ్య ఉన్న ప్రశాంతమైన తెల్లని ఇసుక బీచ్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ ప్రదేశాలన్ని చూడటానికి నిత్యం చాలా మంది టూరిస్టులు కూడా వస్తుంటారు.