భారతీయ రైల్వే రోజు రోజుకు తన పరిధిని విస్తరిస్తోంది. ఇప్పటి వరకు రైల్వే కనెక్టివిటీ లేని ప్రాంతాలకు కొత్త రైల్వే లైన్లు అందుబాటులోకి తీసుకొస్తుంది. స్వతంత్ర భారతంలో మొదటిసారిగా మిజోరాంను రైలు తాకబోతోంది. రాజధాని ఐజ్వాల్ ను దేశంలోని అన్ని ప్రాంతాలతో అనుసంధానం చేయబోతోంది. ఈ రైలు ప్రారంభంలో ఐజ్వాల్ ను అస్సాంలోని సిల్చార్ కు కలుపుతుంది. తర్వాత అక్కడి నుంచి మొత్తం దేశంతో అనుసంధానించబడుతుంది. ఈ రైలును శనివారం నాడు ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభిస్తారు. సెప్టెంబర్ 19 నుంచి వీకెండ్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ- మిజోరం మధ్య ప్రత్యక్ష కనెక్టివిటీని అందించే ఈ రైలు గంటకు సగటున 57.81 కి.మీ వేగంతో నడుస్తుంది. మొత్తం 43 గంటల 25 నిమిషాల్లో 2,510 కి.మీ ప్రయాణిస్తుందని ఈశాన్య సరిహద్దు రైల్వే అధికారులు వెల్లడించారు.
సెప్టెంబర్ 13 ప్రారంభోత్సవం రోజున, 20 కోచ్‌ల రైలు తాత్కాలికంగా ఉదయం 10 గంటలకు మిజోరం రాజధాని ఐజ్వాల్ నుంచి 22 కి.మీ దూరంలో ఉన్న సైరంగ్ స్టేషన్ నుండి ప్రారంభం అవుతుంది. సోమవారం ఉదయం 7:30 గంటలకు ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. అయితే, నోటి ఫై చేసిన రైలు(రైలు నంబర్ 20597) సాధారణ సేవలు సెప్టెంబర్ 19 నుంచి సాయంత్రం 4:30 గంటలకు సైరంగ్ నుంచి ప్రారంభమవుతాయి. ఇది సెప్టెంబర్ 21న ఉదయం 10:50 గంటలకు ఆనంద్ విహార్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో, అదే రోజు(రైలు నంబర్ 20598) సాయంత్రం 7:50 గంటలకు ఆనంద్ విహార్ నుంచి బయల్దేరుతుంది. మంగళవారం (సెప్టెంబర్ 23) మధ్యాహ్నం 3:15 గంటలకు సైరంగ్ చేరుకుంటుందని అధికారులు తెలిపారు.
సైరంగ్, ఆనంద్ విహార్ మినహా ఈ రైలు 21 స్టేషన్లలో ఆగుతుంది. గౌహతి, న్యూ కూచ్ బెహార్, న్యూ జల్పైగురి, మాల్డా టౌన్, భాగల్పూర్, పాట్నా, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్, కాన్పూర్ సహా మొత్తం 21 స్టేషన్లలో హాల్టింగ్ తీసుకుంటుంది. “బైరబి నుండి సైరంగ్ వరకు కొత్త లైన్ ఇంకా విద్యుదీకరించబడనందున బైరబి నుంచి గౌహతికి డీజిల్ లోకోమోటివ్ ఉపయోగించబడుతుంది. గౌహతిలో డీజిల్ లోకోమోటివ్ స్థానంలో ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వస్తుంది. అక్కడి నుంచి ఆనంద్ విహార్ వరకు ఎలక్ట్రిక్ లోకో మోటివ్ రైలును తీసుకెళ్తుందని అధికారులు తెలిపారు.
Read Also: వీకెండ్‌లో హైదరాబాద్ నుంచి గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ రైళ్లలో నేరుగా వెళ్లిపోవచ్చు!
సైరంగ్-ఆనంద్ విహార్ వీక్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ తో పాటు, ప్రధానమంత్రి మోడీ మరో రెండు రైళ్లను కూడా జెండా ఊపి ప్రారంభిస్తారు. సైరంగ్-గౌహతి మధ్య రోజువారీ ఎక్స్ ప్రెస్ రైలు, సైరంగ్- కోల్ కతా మధ్య మూడు వారాల రైలును ఆయన ప్రారంభించనున్నారు.
Read Also: ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే 10 రైళ్లు ఇవే.. స్పీడ్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!