Kashmir to Delhi Vande Bharat Express: జమ్మూకాశ్మీర్ లోని అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా నిర్మించిన రైల్వే లైన్ త్వరలో ప్రారంభానికి రెడీ అవుతోంది. ఉధంపూర్- శ్రీనగర్- బారాముల్లా రైలు లింక్(USBRL)లో కాశ్మీర్ నుంచి న్యూఢిల్లీని అనుసంధానం చేసే వందే భారత్ రైలును ప్రధాని జనవరిలో ప్రారంభించనున్నారు. తాజాగా చీనాబ్ రైల్వే బ్రిడ్జితో పాటు ఈ రైల్వే లైన్ పనులను రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్ నీత్ సింగ్ పరిశీలించారు. అనంతరం ఈ రైలు ప్రారంభం గురించి కీలక ప్రకటన చేశారు.
డిసెంబర్ నాటికి రైల్వే లైన్ నిర్మాణం పూర్తి
కేంద్ర ప్రభుత్వం USBRL ప్రాజెక్ట్ లో భాగంగా 272 కిలో మీటర్లలో కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి అనుమతించింది. ఇప్పటికే 255 కిలో మీటర్ల ట్రాక్ నిర్మాణం పూర్తయ్యింది. కత్రా- రియాసీ మధ్య కేవలం 17 కిలో మీటర్ల మేర నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ ట్రాక్ నిర్మాణానికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నారు. డిసెంబర్ నాటికి ఈ పనులు పూర్తవుతాయి. జనవరిలో ప్రధాని మోడీ ఈ రైల్వే లైన్ మీదుగా కాశ్మీర్-న్యూఢిల్లీని కలిపే వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించనున్నారు. శీతాకాలం సమయంలో ఈ రైలు జమ్మూకాశ్మీర్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనుంది. పర్యాటక, వ్యాపార రంగాలకు ఊతమివ్వనుంది. ఈ రైలు చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్టీల్ ఆర్చ్ బిడ్జి మీది నుంచి ఈ రైలు ప్రయాణించనుంది. చీనాబ్ నదీగర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది. 1.3 కిలో మీటర్లకు పొడవు ఉంటుంది. పలు టన్నెల్స్ ద్వారా ఈ రైలు ప్రయాణం కొనసాగించనుంది.
Read Also:టూరిస్టులకు గుడ్ న్యూస్, టాయ్ ట్రైన్ మళ్లీ ప్రారంభమైందోచ్!
కాశ్మీర్- న్యూఢిల్లీ వందేభారత్ రైలు టికెట్ ఛార్జీ ఎంత?
కాశ్మీర్ నుంచి ఢిల్లీకి వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో 11 ఎసి 3-టైర్ కోచ్‌లు, నాలుగు ఎసి 2-టైర్ కోచ్‌లు, ఒక ఫస్ట్ ఎసి కోచ్ ఉంటాయి. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు వందేభారత్ రైలు టికెట్ ఛార్జీ కేవలం రూ. 1,500 నుంచి రూ. 2100 మధ్యలో ఉంటుందని మంత్రి రవ్ నీత్ సింగ్ తెలిపారు. ఈ రైలు జమ్మూలోని మాతా వైష్ణో దేవి స్టేషన్ లో స్టాప్ ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్ట్ తో జమ్మూకాశ్మీర్ లోని పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ ప్రాంతం నుంచి తాజా పండ్లు, పూలు, కూరగాయలు ఢిల్లీకి వేగంగా చేరుకుంటాయన్నారు. స్థానిక వ్యాపారాలకు గణనీయమైన ప్రోత్సాహాన్ని అందిస్తుందని ఆయన వెల్లడించారు. కాశ్మీర్- న్యూఢిల్లీ వందేభారత్ రైలు ప్రారంభం తర్వాత పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. జమ్మూకాశ్మీర్ డెవలప్ మెంట్ కు ఈ రైలు ఊతం అవుతుందన్నారు.
Read Also: భారతీయ రైల్వేలో M1 కోచ్ వెరీ స్పెషల్, ఇంతకీ దీని ప్రత్యేక ఏంటో తెలుసా?