Indian Railways: దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లను అత్యాధునిక సదుపాయతో అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో భాగంగా రాష్ట్రంలో పలు రైల్వే స్టేషన్లను పునర్నిర్మిస్తున్నారు. కేంద్రం నిధులతో తాజాగా నిర్మించిన బేగంపేట, కరీంనగర్ రైల్వే స్టేషన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 22న దేశవ్యాప్తంగా ABSS కింద పునర్నిర్మించిన 102 రైల్వే స్టేషన్లను వర్చువల్ మోడ్‌లో ప్రారంభించనున్నారు. అందులో భాగంగానే తెలంగాణలోని బేగంపేట, కరీంనగర్ రైల్వే స్టేషన్లను ఢిల్లీ నుంచి వర్చువల్ గా అందుబాటులోకి తీసుకురానున్నారు.
రూ. 26.55 కోట్లతో బేగంపేట రైల్వే స్టేషన్ నిర్మాణం
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా తెలంగాణ గొప్ప వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ బేగంపేట రైల్వే స్టేషన్‌ను ఆధునిక ట్రాన్సిట్ హబ్ గా పునర్నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం కోసం కేంద్రం రూ. 26.55 కోట్లు కేటాయించింది. ఈ స్టేషన్ ను అత్యాధునిక సదుపాయాలతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఎస్కలేటర్లు, లిఫ్ట్ లు, విశాలమైన వెయిటింగ్ హాళ్లు, ఆధునిక టాయిలెట్లు, వికలాంగులైన ప్రయాణీకుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టను రైల్వే స్టేషన్ లో హైలెట్ గా తీర్చి దిద్దారు. స్టేషన్ పరిసరాలు పచ్చదనంతో ఆకట్టుకోనున్నాయి. ప్రకాశవంతమైన లైటింగ్, ప్రకృతి దృశ్యాలతో అలంకరించబడిన పచ్చదనం, వాటర్ ఫౌంటేన్లు ఏర్పాటు చేశారు. ఈ రైల్వే స్టేషన్ నుంచి రోజూ 15 వేలకు పైగా ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. బేగంపేట రైల్వే స్టేషన్.. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ తర్వాత భాగ్యనగరంలో అత్యంత రద్దీగా ఉండే సబర్బన్ స్టేషన్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది.
అత్యాధునిక సౌకర్యాలతో కరీంనగర్, వరంగల్ స్టేషన్లు రెడీ
అటు కరీంనగర్ రైల్వే స్టేషన్ ను కూడా ఈ నెల 22న ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కరీంనగర్ రైల్వే స్టేషన్ ను ఆధునీకరించారు. ఇందుకోసం రూ. 33.3 కోట్లు ఖర్చు చేశారు. రెండు MMTS ప్లాట్‌ఫారమ్‌లు, ఎస్కలేటర్లు, ఫుట్-ఓవర్-బ్రిడ్జిలు, AC వెయిటింగ్ హాళ్లు, ఫుడ్ కోర్టులు, ఇతర సౌకర్యాలను ABSS కింద అభివృద్ధి చేశారు. మరోవైపు వరంగల్ రైల్వే స్టేషన్ సుమారు రూ. 25 కోట్ల వ్యయంతో పునర్నిర్మాణం జరుపుకుంది. ఈ స్టేషన్ ను కూడా ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.
Read Also: విజయవాడ-బెంగళూరు రూట్ లో వందేభారత్, ఇది కదా క్రేజీ న్యూస్ అంటే!
40 స్టేషన్లు.. రూ. 2 వేల కోట్లతో పునర్నిర్మాణం
తెలంగాణలోని 40 రైల్వే స్టేషన్లలో రూ. 2,000 కోట్ల వ్యయంతో ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి రూ. 32,940 కోట్లకు పైగా ఖర్చు చేసింది. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లను రూ.750 కోట్లు, రూ. 350 కోట్ల అంచనా వ్యయంతో పునరాభివృద్ధి చేస్తోంది. కొద్ది నెలల క్రితమే రూ. 740 కోట్ల వ్యయంతో నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ ను ప్రధాని మోడీ ప్రారంభించారు.
Read Also: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే 10 శాతం రాయితీ, ఎప్పటి నుంచంటే?