Irumudi Bridge Collapses: భారీ వర్షాలతో పొల్లూరు జలపాతం ఉవ్వెత్తున ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జలపాతానికి వరద నీరు భారీగా చేరుతోంది. దీంతో అక్కడి నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. జలపాతం ఉగ్రరూపం దాల్చడంతో పర్యాటకుల భద్రతపై అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు పర్యాటకులు అటువైపు వెళ్లకుండా తాత్కాలికంగా ఆంక్షలు విధిస్తున్నారు.
సాధారణ రోజుల్లో ప్రశాంతంగా కనిపించే పొల్లూరు జలపాతం.. వర్షాకాలంలో మాత్రం మరో రూపాన్ని సంతరించుకుంటుంది. కొండ ప్రాంతాల నుంచి భారీగా నీరు వచ్చి చేరడంతో జలపాతం వద్ద ప్రవాహం తీవ్రంగా మారింది. ప్రవాహం ఉధృతంగా ఉన్న సమయంలో జలపాతం దగ్గరకు వెళ్లడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. నీటి మట్టం, ప్రవాహ వేగం ఎప్పుడు మారుతుందో అంచనా వేయడం కష్టంగా ఉండటంతో పర్యాటకుల రాకపోకలను నియంత్రిస్తున్నారు.
అటు పొల్లూరు ప్రాంతంలో పర్యాటకులను ఆకర్షిస్తున్న‘ఇరుముడి’ చెక్క వంతెన భారీ నీటి ప్రవాహానికి తట్టుకోలేక కూలిపోయింది. వరద ఉధృతి కారణంగా వంతెన నిర్మాణం దెబ్బతిని పూర్తిగా నేలమట్టం అయ్యింది. ‘ఇరుముడి’ చెక్క వంతెనకు సినిమా కారణంగా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. సినిమాలో ఈ వంతెన కనిపించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆ ప్రదేశంపై ఆసక్తి పెరిగింది. సినిమా విడుదలైన తర్వాత వంతెనను ప్రత్యక్షంగా చూసేందుకు, అక్కడ ఫొటోలు తీసుకునేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. దీంతో గతంలో స్థానికులకు మాత్రమే తెలిసిన ఈ ప్రాంతం క్రమంగా పర్యాటకుల దృష్టిని ఆకర్షించింది.
అయితే ప్రస్తుతం భారీ వర్షాలు, వరదల కారణంగా అక్కడి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నీటి ప్రవాహం పెరగడంతో వంతెన కూలిపోవడమే కాకుండా జలపాతం వద్దకు వెళ్లడం కూడా ప్రమాదకరంగా మారింది. ప్రకృతి అందాలను చూడటానికి వచ్చే పర్యాటకులు అత్యుత్సాహానికి వెళ్లకుండా స్థానిక అధికారులు సూచనలు పాటించాలని చెబుతున్నారు. ముఖ్యంగా నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో సెల్ఫీలు, ఫొటోల కోసం జలపాతం దగ్గరకు వెళ్లడం ప్రమాదంగా మారే అవకాశం ఉంది.
ప్రస్తుతం పొల్లూరు జలపాతాన్ని సందర్శించాలనుకునే పర్యాటకులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలు తగ్గి, వరద ప్రవాహం అదుపులోకి వచ్చి, పరిస్థితులు సురక్షితంగా మారిన తర్వాతే సందర్శనకు రావాలని చెబుతున్నారు. పర్యాటక ప్రాంతాల్లో ప్రకృతి అందాల కంటే ముందు భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. జలపాతం ఉగ్రరూపంలో ఉన్నప్పుడు అందాన్ని చూడాలనే ఆసక్తి కంటే.. ప్రాణాలను కాపాడుకోవడమే ముఖ్యమని భావించాలంటున్నారు.
Read Also: నదీ జలాలు.. సముద్రపు అలలు.. అడవి మధ్యలో బోటింగ్.. అంతర్వేది అందాలు చూస్తే మైమరచిపోతారు!