Puttur Moola Kona Waterfall: తిరుపతి పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్య ఆలయం. నిత్యం ఎంతో మంది శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. తిరుమలకు వచ్చే భక్తులు చాలా మంది తిరుపతి సమీపంలోని ఎన్నో ఆలయాలు, జలపాతాలు, ప్రకృతి అందాలను చూసి ఎంజాయ్ చేస్తుంటారు. కానీ, ఆ తిరుమల కొండల మాటున దాగిన ఎన్నో సహజసిద్ధ ప్రకృతి అందాల గురించి తెలియదు. వర్షాకాలంలో అక్కడి ప్రాంతమంతా జలపాతాల పరవళ్లతో పర్యాటకులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. తిరుపతికి దగ్గరగా ఉన్న ఓ రహస్య ప్రాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
తిరుమలలో అద్భుతమైన రహస్య నీటి కొలను
తిరుమలలో ఉన్న ఎన్నో అద్భుతమైన రహస్య నీటి కొలనులలో ఒకటి మూలకోన. ఈ ప్రాంతం తిరుపతికి సుమారు 40 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. పుత్తూరు మండలంలో ఉంటుంది. తిరుచానూరులో వెళ్తే వడమాలపేట వస్తుంది. అక్కడి నుంచి సుమారు 23 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. నేషనూరు పంచాయతీ పరిధిలో ఉన్న మూలకోన వరకు నేరుగా వెళ్లడానికి అవకాశం ఉండదు. మూలకోన చుట్టూ రాళ్లు, రప్పలు ఎక్కువగా ఉంటాయి. సుమారు రెండు కిలో మీటర్ల దూరం నుంచి కాలి నడకన వెళ్లాల్సి ఉంటుంది. దారిపొడవునా పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి. అచ్చంగా అవి సినిమాల్లో చూపించే చెట్ల మాదిరిగా కనిపిస్తాయి. కనుచూపు మేరా పచ్చదనం ఆవహించి ఉంటుంది. సిటీకి పరిమితం అయిన వాళ్లు ఈ ప్రాంతాన్ని చూసి తన్మయత్మానికి లోనుకావడం ఖాయం. ఆ చెట్లపై గుంపులుగా ఉన్న కోతులు రకరకాల స్టంట్స్ చేస్తుంటాయి.
ప్రకృతి ఒడిలో సంగీతంలా జలపాతం సవ్వడులు
మరికాస్త దగ్గరికి వెళ్తే నీటి పాయల శబ్దాలు సంగీతాన్ని వినిపిస్తున్నట్లు అనిపిస్తాయి. ఆ తర్వాత ఉవ్వెత్తున ఎగసిపడుతోన్న మూలకోన జలపాతం కనిపిస్తుంది. అక్కడే ఉన్న నీటి కొలను ఆహా అనిపిస్తుంది. చక్కగా అక్కడి నీటిలో జలకాలాడవచ్చు. మూలకోన నీటి కొలను సమీపంలోనే పురాతన శివలింగం ఉంటుంది. ఇక్కడ స్నానం చేసి ఆలయం వరకు వెళ్లవచ్చు. మూలకోన లోని నీటి ప్రవాహం చాలా స్వచ్ఛంగా కనిపిస్తుంది. అక్కడ స్నానం చేస్తే, ఏదో తెలియని మానసిక ప్రశాంత చేకూరుతుంది. కొత్త ఉత్సాహం వచ్చినట్లు అనిపిస్తుంది. ఈ జలపాతం దగ్గరికి వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్, మాంసాహారం, ఆల్కహాల్ అనుమతి ఉండదు.
మూలకోనలో అభివృద్ధి పనులు
అటు అటవీశాఖ అధికారులత చొరవ కారణంగా పుత్తూరు మండలంలోని మూలకోనలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ప్రకృతి అందాల మధ్యలో ఉన్న మూలకోనలో సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కమ్యూనిటీ బేస్‌డ్ ఎకో టూరిజం(సీబీఈటీ) కింద నిధులతో ఇక్కడ మౌళిక వసతులను కల్పిన్నారు. మూలకోనకు వచ్చే పర్యాటకులు సేదతీరేందుకు బెంచీలు ఏర్పాటు చేశారు. వ్యర్థాలు వేసేందుకు డస్ట్ బిన్లు ఏర్పాటు చేశారు. కోనేరును పూర్తిగా శుభ్రం చేశారు. మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ నీటి కొలను సమీపంలో అటవీశాఖ అక్కడ ఔట్ పోస్టు, చెక్ పోస్టును ఏర్పాటు చేసింది. పోలీసులు సైతం అక్కడ నిఘా పెంచారు.
Read Also: ఏకంగా పర్వతాలకే ఎస్కలేటర్లు.. చైనా వాళ్లు మామూలోళ్లు కాదండోయ్!