Teacher Misbehave: నెల్లూరు జిల్లాలో ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు ఓ టీచర్‌కు దేహశుద్ధి చేశారు. గ్రామానికి చెందిన వెంగయ్య అనే ఉపాధ్యాయుడు ఓ విద్యార్థినిని నెల్లూరు నగరంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లినట్టు ఆరోపణలు రావడంతో.. తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని.. వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగు గ్రామంలో చోటుచేసుకుంది.
ఈ విషయం తెలియగానే కొంతమంది యువకులు, పెద్దలు నెల్లూరులోని ఆ లాడ్జికి వెళ్లి బాలికను అక్కడి నుండి రక్షించి తీసుకువచ్చారు. అనంతరం బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థిని పేరెంట్స్, గ్రామస్తులు టీచర్‌ను నిలదీయగా.. మీకు చెప్పాల్సిన అవసరం లేదని సమాధానం చెప్పడంతో దేహశుద్ధి చేశారు.
దీంతో వెంగయ్య భయంతో అక్కడి నుండి తప్పించుకొని, సమీప గోడ దూకి పరారయ్యాడు. ప్రస్తుతం అతని ఆచూకీపై పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. గ్రామస్తుల నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. బాలికకు సముచిత వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నట్లు అధికారులు తెలిపారు.
గ్రామంలో ఈ ఘటనపై ఆందోళన వ్యక్తమవుతోంది. కొందరు ప్రజలు దేహశుద్ధిని తప్పుపడుతున్నప్పటికీ, మరికొందరు బాలికపై జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. “ఒక టీచర్ అయి ఉండి ఇలా ప్రవర్తించడం తలచుకుంటేనే దురదృష్టకరం. చదువు నేర్పే గురువు చేత కీచకత్వం ఎదురవడం బాధాకరం” అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పిల్లల భద్రతపై ప్రశ్నలు
ఈ ఘటన మరోసారి పాఠశాలల్లో పిల్లల భద్రతపై ప్రశ్నలు రేపుతోంది. టీచర్ అనే బాధ్యతాయుత పదవిలో ఉండి.. ఈ తరహా ప్రవర్తన చేయడం వల్ల, విద్యా వ్యవస్థపై నమ్మకం కోల్పోతున్నామని పలువురు తల్లిదండ్రులు చెబుతున్నారు. ముఖ్యంగా యువతిని తప్పుదోవ పట్టించడం, విద్యార్థులపై తప్పుగా వ్యవహిరించడం ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. జిల్లా విద్యాశాఖ కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి, వెంగయ్యపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. పోలీసులు, విద్యాశాఖ కలిసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: నీ కష్టం పగోడికి కూడా రాకూడదు అన్న.. కూతురికి వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య