Railway project failures 2025: ఇండియన్ రైల్వేలో భారీ ఆర్థిక అవకతవకలు, పనితీరు లోపాలను ప్రధాన నియంత్రణ, తనిఖీ సంస్థ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) వెల్లడించింది. 2025లో లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆడిట్ నివేదిక ప్రకారం, రైల్వే శాఖలో రూ. 573 కోట్లకు పైగా నష్టాలు, అలసత్వం, అమలు లోపాల వల్ల ప్రభుత్వ ఖజానాకు గండి పడిందని ఈ నివేదిక సారాంశం.
ఈ నివేదిక 2023 ఆర్థిక సంవత్సరానికి జరిగిన పరీక్షల ఆధారంగా తయారైంది.
ఇందులో మొత్తం 25 కీలక తప్పిదాలను వివరించారు. ఒకవైపు రైల్వే శాఖ ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షిస్తూ, ఆధునికీకరణ దిశగా వేగంగా పయనిస్తున్నట్టు చెబుతోంది. కానీ వాస్తవానికి క్షేత్ర స్థాయిలో అమలు లోపాలు, ఆదాయ వసూళ్లలో విఫలమవుతూ ఉందన్న వాదన నివేదికలో వెలువడింది. కాగ్ సమర్పించిన నివేదిక ఆధారంగా..!
ఆదాయం వచ్చిందే లేదు.. వసూలు కోల్పోయిన నష్టాలు
నార్తర్న్ రైల్వే పరిధిలో 5 ప్రభుత్వ అనుబంధ పాఠశాలల నుంచి లైసెన్స్ ఫీజు రూపంలో వసూలు కావలసిన రూ. 148.61 కోట్లు మిస్ అయ్యాయట. రైల్వే బోర్డు మార్గదర్శకాలను పాటించకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఇక తొమ్మిది రైల్వే జోన్‌లు డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (DMF) కంట్రిబ్యూషన్‌ను సేకరించలేకపోయాయి. దీనితో మొత్తం రూ. 55.51 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు నివేదికలో పొందుపరిచారు.
ఈస్ట్ సెంట్రల్ రైల్వే, బినా సైడింగ్ వద్ద షంటింగ్ చార్జీలు వేయకపోవడం వల్ల రూ. 50.77 కోట్ల ఆదాయం పోయింది. దక్షిణ మధ్య రైల్వే, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేలు డిపాజిట్ వర్క్స్ కోసం రూ. 25.48 కోట్లు వసూలు చేయలేకపోయాయి. రేడియో కమ్యూనికేషన్ (VHF సెట్) లైసెన్స్‌లను పునరుద్ధరించడంలో ఆలస్యం వల్ల మరో రూ. 23.16 కోట్ల నష్టం ఎదురైంది.
ప్రయాణికులు లేని రైలు.. ఆరేళ్లుగా నష్టమే
సత్యసాయి ప్రసాంతి నిలయం – బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ఆరేళ్లపాటు నడపడం వల్ల దక్షిణ పశ్చిమ రైల్వేకు రూ. 17.47 కోట్ల నష్టం ఏర్పడింది. పలు రూట్లను హైయర్ అక్సిల్ లోడ్‌కు మార్చడంలో విఫలమవడం వల్ల వెస్టర్న్ రైల్వే రూ. 12.62 కోట్లు, సదర్న్ రైల్వే రూ. 5.43 కోట్లు కోల్పోయాయి.
నిర్మాణం జరిగింది.. కానీ ఉపయోగంలో లేదు
దక్షిణ పశ్చిమ రైల్వే నిర్మించిన రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఐదేళ్లుగా వాడుకలోకి రాలేదు. ఇది కర్ణాటక ప్రభుత్వం సమన్వయం లేకపోవడమే కారణమట. దీనిపై రూ.11.81 కోట్లు ఖర్చయింది. న్యూజల్పైగురిలో కొత్త ట్రిప్ షెడ్ నిర్మించి కూడా పనిచేయకపోవడం వల్ల రూ. 9.33 కోట్లు వృథాగా ఉండి పోయాయి. ఇక న్యూగరియాలో ప్లాన్ సరిగా లేకపోవడంతో టెర్మినల్ స్టేషన్‌కు రూ. 7.62 కోట్ల బూడిద అయిందని లెక్క.
Also Read: Amrit Bharat Express in AP: విజయవాడ to విశాఖ అమృత్ భారత్ ట్రైన్.. ఏయే స్టేషన్లో ఆగనుందంటే?
కాంట్రాక్టుల విషయంలోనూ ఇబ్బందులే
నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే అధిక ధరలకే కాంట్రాక్టులు ఇచ్చి కాంట్రాక్టర్లకు రూ. 9.4 కోట్ల లాభం కలిగించింది. ఈస్టర్న్ రైల్వే రూ. 6.45 కోట్ల GST ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను క్లెయిమ్ చేయలేకపోయింది. లిలూవాలో కోచ్ షాట్ బ్లాస్టింగ్ ప్లాంట్ కోసం రూ. 12.66 కోట్లు వెచ్చించడంతోపాటు, పనిని ఔట్‌సోర్స్ చేయడంతో అది వాడకంలోకి రాలేదు.
వాడని కోచ్‌లు.. వృథా అయిన పెట్టుబడులు
నీలగిరి మౌంటెన్ రైల్వే కోచ్‌లు మొత్తం 28 Southern Railway, ICF తయారుచేసినా వాటిని వాడకపోవడం వల్ల భారీ నష్టం జరిగింది. ఈ స్థాయి పెట్టుబడులను తీసుకోగానే వాటిని వాడే ప్లాన్ లేకపోవడం అసలు సమస్య. STS రేట్ల పేరుతో ఓ కంపెనీకి రూ. 11.02 కోట్ల రాయితీ ఇచ్చిన Southern Railway పై ప్రశ్నలు రావడమేగాక, వాడని కోచ్ షాట్ బ్లాస్టింగ్ ప్లాంట్, నిల్గిరి కోచ్‌లు కలిపి రూ. 27.91 కోట్ల వృథా ఖర్చు నెత్తిన వేసినట్టు కాగ్ ఆడిట్ స్పష్టం చేసింది.
ప్రాజెక్టుల ప్రణాళికలో దృష్టి లేకపోవడం, టెక్నికల్ బాడీలతో సలహా తీసుకోకుండా కొనుగోళ్లు చేయడం, అవసరం లేని సామగ్రిని పొందడం వంటి అంశాల్లో రైల్వేలు అనేక తప్పిదాలు చేస్తున్నట్టు ఆడిట్ లో తేలింది. ఓవైపు ఇండియన్ రైల్వే ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంటుండగా, కాగ్ ఇచ్చిన నివేదికతో ఇంకా అక్కడక్కడ లోటుపాట్లు ఉన్నట్లు ఇండియన్ రైల్వే గుర్తించింది. భవిష్యత్తులో ఇటువంటి లోటుపాట్లు జరగకుండా ప్రత్యేక ప్రణాళికతో భారతీయ రైల్వే శాఖను విజయవంతం చేసేందుకు కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పవచ్చు.