Parvathamalai: గుడికి వెళ్లాలి అంటే ఎవరైనా పసుపు, కుంకుమ, పూలు, కొబ్బరికాయ లాంటి వాటిని వెంట తీసుకెళ్తారు. కానీ, తమిళనాడులో ఉన్న ఓ గుడి వెళ్లాలంటే మాత్రం వీటితో పాటు గట్టిగా ఉండే షూస్, రోప్ వంటి వాటిని కూడా తీసుకెళ్లాలి. ఎందుకంటే ఆ ఆలయం అంత ఎత్తులో ఉంటుంది మరి. గుడిలో ఉన్న శివయ్యను దర్శించుకోవాలంటే పెద్ద సాహసమే చేయాలి.
కొండ మీద ఆలయం
తమిళనాడులోని తిరువణ్ణామలై దగ్గర ఉన్న అన్నామలైయార్ కొండల్లో ఉండే అన్నామలై ఆలయం ప్రకృతి ప్రేమికులను కూడా ఆకట్టుకుంటుంది. ఎత్తైన కొండ మీద ఈ ఆలయం ఉంటుంది. చుట్టూ ఉన్న కొండలు, పచ్చని అడవులు చాలా అద్భుతంగా ఉంటాయి. గర్భగుడిలో శివలింగం ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో కొన్ని చిన్న గుడులు, శాసనాలు కనిపిస్తాయి. కార్తీగై దీపం ఉత్సవం ఇక్కడ ఘనంగా జరుగుతుంది. ఈ సమయంలో వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఉత్సవంలో కొండపై దీపం వెలిగించడం అనాదిగా వస్తున్న ఆచారం.
జ్వాల రూపంలో శివుడు..!
దాదాపు 2,000 ఏళ్ల క్రితమే ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ఈ పురాతన ఆలయాన్ని శివుడికి అంకితం ఇచ్చారట. ఈ ఆలయం అన్నామలై కొండలలో ఒక భాగమైన పర్వతమలైపై ఉంది. తొమ్మిదవ శతాబ్దంలో చోళులు, పల్లవులు ఈ ఆలయాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది. హిందూ పురాణాల ప్రకారం, శివుడు ఇక్కడ అగ్నిస్తంభంగా ఆవిర్భవించాడని నమ్ముతారు. ఒకసారి విష్ణువు, బ్రహ్మల మధ్య ఆధిపత్యం కోసం పోటీ జరిగిందట. శివుడు జ్వాల రూపంలో కనిపించి, వారిని సవాలు చేశాడని అక్కడ ఉండే వారు చెబుతారు.
ALSO READ: ఆ గుడిలో ఉన్న నంది విగ్రహం పెరుగుతుందంటే నమ్ముతారా?
అద్భుతమైన ప్రకృతి..
కొండపై ఉన్న ఈ ఆలయం నుండి సూర్యోదయం, సూర్యాస్తమయం చూస్తుంటే చాలా అద్భుతమైన అనుభం కలుగుతుంది. కొండపై ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. దీంతో భక్తులు ఇక్కడ ధ్యానం కూడా చేసుకుంటారు. అయితే ఈ ఆలయానికి వెళ్లాలంటే ఐదున్నర కిలోమీటర్లు కొండపైకి ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఉంటే ట్రిప్‌కు కాస్త అడ్వెంచర్ కూడా యాడ్ చేయాలి అనుకునే వారు తిరువణ్ణామలైలో కొండ మీద ఉండే అన్నామలై ఆలయానికి టూర్ ప్లాన్ చేయొచ్చు. ట్రెక్ చేయడం కష్టం అనుకునే వారి కోసం నడక మార్గం కూడా ఉంటుంది.
తిరువణ్ణామలై పురపాలక సంఘం యాత్రికుల సౌకర్యం కోసం అనేక సౌకర్యాలను కల్పిస్తోంది. ఆలయానికి చేరుకోవడానికి తిరువణ్ణామలై నుంచి బస్సు, రైలు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.బస చేయాలి అనుకునే వారి కోసం తిరువణ్ణామలైలో హోటళ్లు, వసతి గృహాలు, రెస్టారెంట్లు కూడా అందుబాటులో ఉంటాయి.