Indian Railways: ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. అందులో భాగంగానే ఆగష్టులో ఏకంగా 9 రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కీలక ప్రకటన చేశారు. ఈ ప్రత్యేక రైళ్లు హైదరాబాద్-తిరుపతి మధ్య సర్వీసులు అందించనున్నట్లు వెల్లడించారు. ఈ రైళ్లుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ప్రతి శుక్ర, శనివారాల్లో చర్లపల్లి నుంచి తిరుపతికి..
ఆగష్టులో అందుబాటులోకి రానున్న ఈ ప్రత్యేక రైళ్లు ప్రతి శుక్ర, శనివారాల్లో చర్లపల్లి నుంచి తిరుపతి(070717)కి బయల్దేరుతాయి. ప్రతి సోమ, శనివారాల్లో తిరుపతి నుంచి చర్లపల్లికి(070718) రైళ్లు అందుబాటులో ఉంటాయి.
ఈ రైళ్లు ఏ రైల్వే స్టేషన్లలో ఆగుతాయంటే?
చర్లపల్లి-తిరుపతి-చర్లపల్లి మధ్య నడిచే ప్రత్యేక రైళ్లు పలు రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. మల్కాజిగిరి, కాచిగూడ, ఉందానగర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట స్టేషన్ లలో ఆగుతాయని రైల్వే అధికారులు తెలిపారు.
బుధ, గురువారాల్లోనూ రైళ్ల రాకపోకలు
అటు బుధ, గురువారాల్లో నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రతి బుధవారం చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు(07251) బయల్దేరుతాయి. ప్రతి గురువారం తిరుపతి నుంచి చర్లపల్లికి ఈ ప్రత్యేక రైలు(07252) నడపనున్నట్లు తెలిపారు.
Read Also: IRCTC అకౌంట్ ను రైల్ వన్ తో లింక్ చేసుకోవాలా? సింపుల్ గా ఇలా చేయండి!
ఈ రైళ్లు ఏ స్టేషన్లలో ఆగుతాయంటే?
ఈ ప్రత్యేక రైళ్లు జనగాం, కాజీపేట, వరంగల్, నెక్కొండ, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోల్, నెల్లూర్, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. ముఖ్యంగా చర్లపల్లి- తిరుపతి మధ్య రాకపోకలు కొనసాగించే ప్రయాణీకులు ఈ ప్రత్యేక రైళ్లను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను రైల్వే అధికారిక వెబ్ సైట్ ను చూడాలని సూచించారు.
Read Also: హైదరాబాద్ నుంచి నేరుగా హిల్ స్టేషన్స్ కు తీసుకెళ్లే రైళ్లు ఇవే.. ఘాట్ రోడ్డులో వెళ్లక్కర్లేదు!