హైదరాబాద్ అంటేనే ఉరుకుల పరుగుల జీవితం. పొద్దున లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు జీవితం అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ లో ముందుకు సాగుతుంది. ఈ గజిబిజి జీవితంలో కాస్త రిలాక్స్ కావాలనుందా? హిల్ స్టేషన్ లో జాలీగా ఎంజాయ్ చేయాలనుందా? అయితే, హైదరాబాద్ నుంచి నేరుగా హిల్ స్టేషన్లకు ప్రత్యక్ష రైళ్లు సదుపాయాలు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి రైలులో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ హిల్ స్టేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ అరకు లోయ: తూర్పు కనుమలలో ఉన్న అరకు లోయ విశాఖపట్నం నుండి 115 కి.మీ దూరంలో ఉంటుంది. కాఫీ తోటలు, గిరిజన సంస్కృతి, ప్రకృతి అందాలకు ప్రసిద్ది. హైదరాబాద్ నుంచి వీకెండ్ టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నుండి విశాఖపట్నం వరకు.. హైదరాబాద్ లేదంటే సికింద్రాబాద్ జంక్షన్ నుండి ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ (18645), ఫలక్ నుమా ఎక్స్‌ప్రెస్ (12703) లాంటి రైళ్లు అందుబాటులో ఉన్నాయి. సుమారు 700 కి. మీ దూరం వెళ్లేందుకు 12 గంటల ప్రయాణ సమయం పడుతుంది. విశాఖపట్నం నుంచి అరకు వరకు.. విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్ (08551)లో 3 గంటల్లో వెళ్లొచ్చు. బొర్రా గుహలతో సహా 58 సొరంగాల గుండా ఈ రైలు వెళ్తుంది. తూర్పు కనుమల అందాలు ఆకట్టకుంటాయి. అక్టోబర్ నుంచి మార్చి వరకు వెళ్తే చాలా బాగుంటుంది.
⦿ లోనావాలా: ఇది ముంబై సమీపంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి 625 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. జలపాతాలు, కోటలు ఆకట్టుకుంటాయి. హైదరాబాద్ నుంచి నేరుగా రైల్వే కనెక్టివిటీ ఉంది. హైదరాబాద్ నుండి లోనావాలాకు.. హుస్సేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్ (12701), హైదరాబాద్-ముంబై ఎక్స్‌ప్రెస్ (17031) లాంటి రైళ్లలో వెళ్లొచ్చు. సుమారు 14 గంటల ప్రయాణ సమయం పడుతుంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు చాలా బాగుటుంది. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు కూడా వెళ్లొచ్చు. భూషి ఆనకట్ట, టైగర్స్ లీప్, రాజ్ మాచి కోట, కార్లా గుహలను చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.
⦿ మాథెరాన్: పశ్చిమ కనుమలలో ఉన్న అందమైన హిల్ స్టేషన్ ఇది. హైదరాబాద్ నుండి 800 కి.మీ దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి పూణే వరకు.. హైదరాబాద్-పూణే ఎక్స్‌ప్రెస్ (17013), కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11019) లో సుమారు 12 గంటల్లో ప్రయాణించవచ్చు. పూణే నుంచి నేరల్ వరకు స్థానిక రైలు లేదంటే క్యాబ్ ద్వారా 2 గంటల్లో ప్రయాణం చెయ్యవచ్చు. నేరల్ నుంచి మాథెరాన్ వరకు.. నేరల్-మథేరన్ టాయ్ ట్రైన్ ద్వారా 2 గంటల్లో సుందరమైన ప్రయాణాన్ని అందిస్తుంది. అక్టోబర్ నుండి మే వరకు ప్రయాణం బాగుటుంది. షార్లెట్ లేక్, పనోరమా పాయింట్, గార్బెట్ పీఠభూమి వంటి ట్రెక్కింగ్ ట్రైల్స్ వెయ్యొచ్చు.
⦿ ఊటీ: తమిళనాడులోని నీలగిరి కొండలలోని ఊటీ ప్రకృతి అందాలకు నెలవు. హైదరాబాద్ నుంచి 850 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. టీ ఎస్టేట్ లు, సరస్సులతో కూడిన క్లాసిక్ హిల్ స్టేషన్. హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ వరకు.. శబరి ఎక్స్‌ప్రెస్ (17230), కాచిగూడ-కోయంబత్తూర్ ఎక్స్‌ప్రెస్ లో సుమారు 16 గంటల్లో వెళ్లొచ్చు. కోయంబత్తూర్ నుంచి మెట్టుపాళయం వరకు క్యాబ్ లేదంటే స్థానిక రైలులో గంట ప్రయాణం చేయాలి. మెట్టుపాళయం నుంచి ఊటీ వరకు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన నీలగిరి పర్వత రైల్వే టాయ్ ట్రైన్ లో వెళ్లొచ్చు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు, సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ప్రయాణం బాగుటుంది. ఊటీ సరస్సు, దొడ్డబెట్ట శిఖరం, బొటానికల్ గార్డెన్లు, టీ ఫ్యాక్టరీలు ఆకట్టుకుంటాయి.
⦿ హార్స్‌లీ హిల్స్: మదనపల్లె సమీపంలోని హార్స్ లీ హిల్స్ హైదరాబాద్ నుంచి 550 కి.మీ దూరంలో ఉంటుంది. దట్టమైన అడవులు, ప్రశాంతంమైన ప్రదేశాలు ఆకట్టుకుంటాయి. హైదరాబాద్ నుంచి మదనపల్లెకు.. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (17429)లో సుమారు 12 గంటల్లో వెళ్లొచ్చు. మదనపల్లె నుంచి హార్స్‌లీ హిల్స్‌కు.. క్యాబ్ లేదంటే బస్సులో వెళ్లొచ్చు. సెప్టెంబర్ నుంచి మార్చి వరకు వెళ్తే బాగుంటుంది. గవర్నర్ బంగ్లా, వ్యూ పాయింట్, ప్రకృతి అందాలు అలరిస్తాయి.
Read Also: హైదరాబాద్ మీదుగా మరో వందే భారత్ రైలు.. ఎక్కడి నుంచి ఎక్కడికంటే?