Seaplane Services In Andhrapradesh: ఏపీ టూరిజంలో మరో కీలక అధ్యాయం మొదలుకాబోతోంది. ఇప్పటి వరకు పర్యాటకులు లాంచీ ప్రయాణాలు చేయగా, ఇకపై సీ ప్లేన్ లో నీళ్లలో నుంచి నింగిలోకి ఎగిరిపోనున్నారు. విజయవాడ లోని ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం జలాశయం వరకు సీప్లేన్ ట్రయల్ రన్ ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశలో భాగంగా అమరావతి నుంచి తిరుపతి, గండికోటకు సీ ప్లేన్ సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది.
8 పర్యాటక ప్రదేశాలకు సీ ప్లేన్ సేవలు
ఏపీలో పర్యాటకాన్ని మరింతగా ప్రోత్సహించేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం సీ ప్లేన్ సేవలను ప్రారంభించడానికి పలు ప్రాంతాలను పరిశీలించింది. ఇందులో భాగంగా 8 ప్రదేశాలను ఫైనలైజ్ చేసింది. వాటిలో అమరావతి, తిరుపతి, గండికోట, అరకు, లంబసింగి, కోనసీమ, శ్రీశైలం, రుషికొండ ఉన్నాయి. ఎంపిక చేయబడిన 8 ప్రదేశాలలో తొలి విడుతగా అమరావతి నుంచి తిరుపతి, గండికోట ప్రాంతాలను కలుపుతూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతోంది. అమరావతిలోని ప్రకాశం బ్యారేజ్, తిరుపతిలోని కల్యాణి ఆనకట్ట, గండికోట రిజర్వాయర్ లో సీ ఎయిర్ పోర్టులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత నవంబర్ 9, 2024న, కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం వరకు జరిగిన టెస్ట్ ఫ్లైట్‌లో ప్రయాణించారు.
తొలి దశలో 3 ప్రాంతాల్లో సీ ప్లేన్ సర్వీసులు
సీ ప్లేస్ సర్వీసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APADCL) టెక్నో-ఫీజిబిలిటీ స్టడీస్ నిర్వహించడానికి, DPRలు తయారు చేయడానికి బిడ్‌లను ఆహ్వానించింది. ప్రభుత్వం ఎనిమిది ప్రదేశాలకు బిడ్‌లను పిలిచినప్పటికీ, మొదటి దశలో మూడు ప్రదేశాలకు DPRలను సిద్ధం చేయాలని నిర్ణయించింది. అమరావతి, గండికోట కోసం DPR పనులను రైట్స్ దక్కించుకోగా, ఫీడ్‌బ్యాక్ హైవేస్‌కు తిరుపతి వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్ట్ పనులను కేటాయించారు.
Read Also: ఫ్లైట్ లోకి కంగారూ.. ప్యాసింజర్ల పరేషాన్, నెట్టింట వీడియో వైరల్!
ఉడాన్ పథకంలో భాగంగా సీ ప్లేన్ సర్వీసులు
కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం కింద సీప్లేన్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా 56 సీ ప్లేన్ మార్గాలను గుర్తించింది. వాటిలో 32 మార్గాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఇందుకు కావాల్సిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కీలకం కాబట్టి, దశలవారీగా నీటి ఏరోడ్రోమ్‌లను నిర్మించడానికి 8 ప్రదేశాలను గుర్తించారు. ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను కలుపుతూ ఈ సీ ప్లేన్ సర్వీసులను విస్తరించేలా ఏపీ సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే మొదట మూడు ప్రాంతాల్లో ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. వీటి ద్వారా ఏపీ టూరిజాన్ని మరింత డెవలప్ చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
Read Also: దేశంలో అతిపెద్ద మెట్రో వ్యవస్థలు, హైదరాబాద్ ఏ స్థానంలో ఉందంటే?
Read Also: విజయవాడ To అయోధ్య, పరుగులు తీయనున్న వందేభారత్ స్లీపర్!