Smit Machchhar: ఫ్లై దుబాయ్ విమాన ఘటనతో భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ పేరు ఇప్పుడు అంతర్జాతీయంగా మార్మోగుతోంది. దాడిలో గాయపడినప్పటికీ కాక్‌పిట్ తలుపు తెరిచి, సిబ్బంది, ప్రయాణికులు జోక్యం చేసుకునేలా చేసిన ఆయన చర్యపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సెప్టెంబరు 30న జరిగిన ఈ ఘటన తర్వాత.. కొన్ని నెలల క్రితం ఆయన పాల్గొన్న ‘Bonafide Banter’ పాడ్ కాస్ట్ లో చెప్పిన విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో ఆయన ఏం చెప్పారంటే..
పైలట్ బాధ్యతల గురించి మాట్లాడిన మచ్చర్.. కాక్ పిట్‌లో ఏకాగ్రత ఎంత ముఖ్యమో వివరించారు. పైలట్ విమానాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని, అవసరం లేని చర్చలు దృష్టిని మరల్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అత్యవసర పరిస్థితుల్లో పైలట్లు ప్రశాంతంగా ఉండటం, పరిస్థితిని అంచనా వేసి నిర్ణయం తీసుకోవడం కీలకమన్నారు. కాక్ పిట్‌లో నిశ్శబ్దంగా ఉండటం అంటే భయపడటం కాదని.. క్లిష్ట పరిస్థితుల్లో పూర్తి దృష్టిని పనిపైనే ఉంచడమని చెప్పారు.
సెప్టెంబరు 30న ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఘటనలో మచ్చర్‌పై కో పైలట్ దాడి చేసినట్లు అధికారులు వెల్లడించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ ఆయన కాక్‌పిట్ తలుపు తెరవడంతో సిబ్బంది, ప్రయాణికులు లోపలికి చేరి దాడిచేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంలో సహకరించారు. అనంతరం విమానం సౌదీ అరేబియాలోని తబూక్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలోని 174 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. స్మిత్ చూపించిన ధైర్యానికి యావత్ ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోంది.
చిన్నప్పటి నుంచే పైలట్ కావాలనే కల తనకు లేదని మచ్చర్ ఆ పాడ్ కాస్ట్ లో చెప్పుకొచ్చారు. కుటుంబానికి వస్త్ర వ్యాపారం ఉండటంతో అదే రంగంలోకి వెళ్లాలని భావించారు. అందుకే టెక్స్ టైల్ ఇంజినీరింగ్ చదివి, ఆ తర్వాత మేనేజ్‌మెంట్ కోర్సు కూడా పూర్తి చేశారు. అయితే, 19 ఏళ్ల వయసులో ఓ ఏవియేషన్ సెమినార్ ఆయన ఆలోచనను పూర్తిగా మార్చింది. విమానయాన రంగంపై ఆసక్తి పెరగడంతో పైలట్ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం తల్లిని ఆందోళనకు గురిచేసినా.. తండ్రి మాత్రం తనకు సపోర్టుగా నిలిచారని మచ్చర్ గుర్తుచేసుకున్నారు. న్యూజిలాండ్‌లో కమర్షియల్ పైలట్‌గా శిక్షణ తీసుకున్న ఆయన తర్వాత స్పైస్‌జెట్‌లో సుమారు 11 ఏళ్లు పనిచేశారు. 2022లో ఫ్లైదుబాయ్‌లో చేరి బోయింగ్ 737 విమానాలను నడిపే కెప్టెన్‌గా కొనసాగుతున్నారు. ఆయనకు దాదాపు 10 వేల గంటల విమాన ప్రయాణ అనుభవం ఉంది.
ఏళ్ల క్రితం పైలట్ అవుతానని కూడా అనుకోని యువకుడు.. ఒక సెమినార్ తో తన జీవితాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు అదే విమానయాన రంగంలో అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొని ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. ఆయన గతంలో చెప్పిన మాటలు.. ఈ ఘటన తర్వాత మరోసారి చర్చకు రావడానికి ఇదే కారణంగా చెప్పుకోవచ్చు.
Read Also: ఇప్పుడు స్మిత్.. అప్పుడు నీర్జా.. తూటాలకు ఎదురొడ్డి వందల మంది ప్రాణాలు కాపాడిన వీరవనిత!