Cherlapalli Railway Terminal:హైదరాబాద్ లో నూతనంగా ప్రారంభమైన చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ నుంచి నడిచే పలు రైళ్లను చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి నడిపిస్తున్నారు. ఇక్కడి నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి. సంక్రాంతి నేపథ్యంలో చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు పలు ప్రత్యేక రైళ్లను ఇక్కడి నుంచి నడిపిస్తున్నారు. అయితే, ఈ రైల్వే స్టేషన్ కు వచ్చేందుకు కనెక్టింగ్ రోడ్లు సరిగా లేకపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే, కనెక్టింగ్ రోడ్లను విస్తరించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
కనెక్టింగ్ రోడ్లను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి
FCI గో డౌన్స్ వైపు కొత్తగా ప్రారంభించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ కోసం కనెక్టింగ్ రోడ్డును విస్తరించాని రైల్వే అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిన కోరారు. ప్రయాణీకుల ప్రయోజనం కోసం TSIIC పక్కనే ఉన్న ఖాళీ స్థలం నుంచి కొత్త రోడ్డును వేయడానికి చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. అటు నార్త్ వైపు నుంఇ వచ్చే ప్రయాణీకులకు అనుగుణంగా ఉత్తరం వైపున ఉన్న మహాలక్ష్మి నగర్ కాలనీ రోడ్డును కూడా విస్తరించాలని కోరారు. చర్లపల్లి టెర్మినల్ కు కొత్త రోడ్లు, ఇతర రవాణా సేవలను అందించడం గురించి ప్రభుత్వ అధికారులతో తాజాగా సమన్వయ సమావేశం జరిగినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. వీలైనంత త్వరగా ఈ రోడ్ల విస్తరణ పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు.
రోడ్ల విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ లో ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్ల మీద భారతం తగ్గించేందుకు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను నిర్మించారు. ఈ స్టేషన్ రోడ్డు కనెక్టివిటీకి సరిగా లేదు. ఈ రోడ్లను విస్తరించాలని ఇప్పటికే రైల్వే అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు ఈ రోడ్ల అభివృద్ధి పనులకు జీహెచ్‌ఎంసీ అంగీకారం తెలిపింది. భూసేకరణకు అడ్డంకులు తొలగటంతో సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ ముందు మూడు ప్రధాన ఎంట్రెన్స్ లను నిర్మించాలని జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు రచిస్తోంది. 100 ఫీట్ల వెడల్పుతో రెండు, 80 ఫీట్లల రోడ్డుతో మరో ఎంట్రెన్స్ నిర్మించనున్నారు. ఈ ఎంట్రెన్స్ లు 100 ఫీట్ల అడుగుల రోడ్డుతో కనెక్ట్ చేయనున్నారు. ఈ రోడ్లను నెల రోజుల వ్యవధిలోనే నిర్మించాలని అధికారులకు సీఎం రేవంత్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.
ఇక రోడ్డుకు సమీపంలో పార్కింగ్ కేంద్రాలు, బస్టాండు, ఆటో స్టాండ్‌ల నిర్మాణానికి ఓపెన్ ఫ్లేస్ కూడా వదిలేస్తారు. 100 అడుగుల రోడ్డు కోసం ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ 3 ఎకరాల భూమిని జీహెచ్‌ఎంసీకి ఇవ్వనుంది. ఇతర రోడ్లకు పరిశ్రమలకు సంబంధించిన సుమారు 6 ఎకరాల భూమిని వాడుకోవాలని భావిస్తున్నారు. స్టేషన్ వెనకాలే కొన్ని నివాస సముదాయాలు ఉండగా.. వాటిని తొలగించి 80 ఫీట్ల అడుగుల రోడ్డు నిర్మించనున్నారు. మొత్తంగా రూ.35 కోట్ల అంచనా వ్యయంతో చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు కొత్త రోడ్లు నిర్మించనున్నారు. రోడ్లు పూర్తయ్యాక స్టేషన్ ముందు మరింత భూసేకరణ చేపట్టి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ మెరుగుపరించేదుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఇక ఎయిర్ పోర్టును తలదన్నేలా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను రీసెంట్ గా ప్రధాని మోడీ ప్రారంభించారు.
Read Also: ఊపందుకున్న పండుగ ప్రయాణాలు, రైల్వే స్టేషన్లలో జనజాతర, కిక్కిరిసిన ట్రైన్లు!