Indian Railways: భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ లలో ఒకటిగా కొనసాగుతోంది. 7 వేలకు పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. 20 వేలకు పైగా రైళ్లు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. నిత్యం కోట్లాది మందిని గమ్యస్థానాలకు చేర్చుతోంది. అయితే, ఇండియన్ రైల్వేలోని వింతైన రైల్వే స్టేషన్లు, రైల్వే మార్గాలు, రైల్వే వంతెనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
భారతదేశంలో వింత రైల్వే స్టేషన్లు
⦿బెగుంకోదర్ రైల్వే స్టేషన్ (పశ్చిమ బెంగాల్): ఈ స్టేషన్ భారతదేశంలో అత్యంత భయానక రైల్వే స్టేషన్ లలో ఒకటి. ఇక్కడ రాత్రిపూట తెల్లటి చీరలో ఒక ఆడ దెయ్యం కనిపిస్తుందని, వింత శబ్దాలు, విచిత్ర ఆకారాలు కనిపిస్తాయని స్థానికులు చెప్తారు. ఈ స్టేషన్ 42 సంవత్సరాల పాటు మూసివేయబడింది. 2009లో తిరిగి తెరవబడింది.
⦿నైని జంక్షన్ రైల్వే స్టేషన్ (ఉత్తరప్రదేశ్): నైని జైలు సమీపంలో ఉన్న ఈ స్టేషన్‌లో స్వాతంత్ర్య సమరయోధుల ఆత్మలు తిరుగుతాయని స్థానికుల నమ్మకం. రాత్రిపూట ఏడుపు, అరుపుల శబ్దాలు వినిపిస్తాయని చెబుతారు.
⦿ములుంద్ స్టేషన్ (ముంబై): దేశంలోని పురాతన స్టేషన్లలో ఒకటైన ఈ స్టేషన్‌లో సాయంత్రం తర్వాత వింత అరుపులు, కేకలు వినిపిస్తాయని స్థానికులు చెప్తుంటారు.
⦿బరోగ్ రైల్వే స్టేషన్ (హిమాచల్ ప్రదేశ్): ఈ స్టేషన్ సమీపంలోని బరోగ్ సొరంగంలో కల్నల్ బరోగ్ అనే బ్రిటిష్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడని, అతడి ఆత్మ ఇక్కడ తిరుగుతుందని నమ్ముతారు.
వింత రైల్వే మార్గాలు
⦿ నీలగిరి మౌంటైన్ రైల్వే: యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందిన ఈ రైలు మార్గం మెట్టుపాలయం నుంచి ఊటీ వరకు సాగుతుంది. పచ్చని నీలగిరి కొండలు, 16 సొరంగాలు, 250 వంతెనల గుండా ప్రయాణిస్తూ ప్రకృతి సౌందర్యాన్ని అందిస్తుంది.
⦿ పంబన్ రైలు మార్గం (మండపం నుంచి రామేశ్వరం): సముద్రం మధ్యలో నిర్మించిన పంబన్ వంతెన ఈ మార్గంలో ప్రధాన ఆకర్షణ. ఈ రైలు ప్రయాణం ఆధ్యాత్మికత మరియు సహజ సౌందర్యాన్ని కలిపి అందిస్తుంది.
⦿ కొంకణ్ రైల్వే (ముంబై నుంచి గోవా): సహ్యాద్రి కొండలు, దుధ్‌సాగర్ జలపాతం, అరేబియా సముద్ర తీరం లాంటి అద్భుత దృశ్యాలను ఈ రూట్ లో చూసే అవకాశం ఉంటుంది.
వింత రైల్వే వంతెన
⦿ భోపాల్‌లో 90 డిగ్రీల మలుపు గల వంతెన: భోపాల్ లోని ఐష్ బాగ్ స్టేడియం సమీపంలో నిర్మించిన ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి 90 డిగ్రీల మలుపును కలిగి ఉంది. ఇది అసాధారణ డిజైన్‌గా పరిగణించబడుతుంది. ఈ మలుపు కారణంగా ప్రయాణీకులు భయంతో వణికిపోతారు.
ఇండియన్ రైల్వేలో ఆసక్తికర విషయాలు
⦿ ఒకే స్థలంలో రెండు స్టేషన్లు: అహ్మద్ నగర్ లో శ్రీరాంపూర్, బేలాపూర్ స్టేషన్లు ఒకే ప్రదేశంలో ట్రాక్ కు ఎదురెదురుగా ఉన్నాయి. దేశంలోనే ఇదో అరుదై రైల్వే విశేషంగా చెప్పుకుంటారు.
⦿ అతి పొడవైన గూడ్స్ రైలు: రుద్రాస్త్ర’ అనే గూడ్స్ రైలు దేశంలోనే అత్యంత పొడవైనదిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇది 4.5 కిలోమీటర్ల పొడవుతో, 354 వ్యాగన్లు, 7 ఇంజిన్లతో భారత రైల్వే చరిత్రలో అతి పొడవైన రైలుగా రికార్డు సృష్టించింది.
Read Also: రైల్లో ఏసీ ప్రాబ్లం, టెక్నీషియన్ వచ్చి చూసి షాక్..