Tamil Nadu Bus Tickets Scheme: పబ్లిక్ బస్సులను ఉపయోగించేలా ప్రయాణీకులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. ప్రభుత్వ బస్సుల టికెట్లను ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి బంఫర్ ఆఫర్లను ప్రకటించింది. నవంబర్ 21 నుంచి జనవరి 20 మధ్య టికెట్లు బుక్ చేసుకున్న వారిలో ముగ్గురు విజేతలను సెలెక్ట్ చేస్తామని అధికారులు తెలిపారు. వారికి టూ వీలర్, స్మార్ట్ టీవీ, రిఫ్రిజిరేటర్ అందిస్తామని వెల్లడించారు. అయితే, ఈ ఆఫర్ మన తెలుగు రాష్ట్రాల్లో కాదు.. తమిళనాడులో!
ఇంతకీ అసలు విషయం ఏంటంటే?
గత కొంత కాలంగా తమిళనాడులో పబ్లిక్ బస్సులను ప్రజలు తక్కువగా వినియోగించుకుంటున్నారు. ఇతర వాహనాల ద్వారా తమ ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా ప్రభుత్వ బస్సులలో ప్రయాణీకులు వెళ్లేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే బంఫర్ ఆఫర్లను ప్రకటించింది. చెన్నై నగరంలో నడుస్తున్న MTC బస్సులు, అంతర్ రాష్ట్ర సర్వీసులను అందించే SETC బస్సులతో సహా రాష్ట్ర రవాణా సంస్థ బస్సులలో ప్రయాణించేందుకు ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి ఈ పథకం వర్తిస్తుంది.
నెల రోజుల పాటు స్పెషల్ స్కీమ్
ఈ బంఫర్ ఆఫర్ల స్కీమ్ నెల రోజుల పాటు అందుబాటులో ఉంటుందని తమిళనాడు రోడ్డు రవాణా సంస్థ వెల్లడించింది. నవంబర్ 21 నుంచి జనవరి 20 మధ్య ప్రయాణానికి టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకుల జాబితా నుండి ముగ్గురు విజేతలను ఎంపిక చేస్తారు. వారిలో మొదటి బహుమతి ద్విచక్ర వాహనం, రెండవ బహుమతి స్మార్ట్ TV, మూడవ బహుమతి రిఫ్రిజిరేటర్ అందిస్తారు. అంతేకాదు, అదనంగా, నెలవారీ నగదు బహుమతులు కూడా ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.
జూన్ నుంచి నెలవారీ బహుమతులు
తమిళనాడు ప్రభుత్వం నెలవారీ బహుమతుల పథకాన్ని గత జూన్ నుంచి అమలులోకి తీసుకొచ్చింది. రానున్న సంక్రాంతి నేపథ్యంలో ప్రభుత్వం కొత్త బహుమతులను ప్రకటిస్తోంది. ఆన్ లైన్ ద్వారా ఆర్టీసీ టికెట్లు బుక్ చేసుకున్న వారిలో ప్రతి నెలా, 13 మంది విజేతలను ఎంపిక చేస్తారు. వారిలో మొదటి ముగ్గురికి ఒక్కొక్కరికి రూ. 10,000, మిగిలిన విజేతలకు ఒక్కొక్కరికి రూ. 2,000 నగదు బహుమతి అందజేస్తారు.
తక్కువ ఛార్జీలు ఉన్నా ఆర్టీసీ బస్సులకు దూరం
తమిళనాడులో ప్రైవేట్ బస్సులతో పోలిస్తే ప్రభుత్వ బస్సులలో తక్కువ ఛార్జీలు ఉన్నాయి. అయినప్పటికీ, సర్వీస్ క్వాలిటీపై ఉన్న అపోహలతో చాలా మంది ప్రభుత్వ బస్సులను వినియోగించేందుకు ముందుకురావడం లేదు. ఈ నేపథ్యంలో ఎలాగాగైనా ప్రజలను ప్రభుత్వ బస్సులు ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలని ఆ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రభుత్వ సహకారంతో ప్రత్యేక బహుమతులను ప్రకటిస్తున్నది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ స్కీమ్ ద్వారా ప్రజలు ఆర్టీసీ బస్సులు ఎక్కేందుకు కాస్త ఆసక్తి చూపిస్తున్నారు. తమ ప్రయత్నం ఫలిస్తున్నదని ఆర్టీసీ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సైతం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది.
Read Also:రైలు టికెట్లపై కేంద్రం సబ్సిడీ, బాబోయ్.. అంత శాతం ఇస్తుందా?