భారత్ గత దశాబ్ద కాలంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోంది. అలాగే టూరిజంలోనూ దూసుకెళ్తోంది. అంతర్జాతీయ రాకపోకలలో 1.4 శాతం వాటాను కలిగి ఉంది. ఇండియన్ టూరిజం డేటా కాంపెండియం ప్రకారం ప్రయాణ, పర్యాటక అభివృద్ధి సూచి (TTDI) 2024లో భారత్ 39వ స్థానంలో నిలిచింది. 2023లో 18.89 మిలియన్ల మంది అంతర్జాతీయ పర్యాటకులు వచ్చారు. ఇక దేశీయంగా పలు రాష్ట్రాలు కూడా టూరిజం పరంగా బాగా డెవలప్ అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు ఎక్కువ మంది విదేశీ పర్యాటకులు వస్తున్నారు.
ఇక దేశంలో అత్యధిక మంది టూరిస్టులు వచ్చే రాష్ట్రంగా ఉత్తర ప్రదేశ్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది ప్రపంచ ప్రఖ్యాత మహా కుంభమేళాను నిర్వహించింది యూపీ ప్రభుత్వం. ఇది పర్యాటక పరంగా అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఇక యూపీలో ఎక్కువ మంది టూరిస్టులు వెళ్లే పర్యాటక ప్రాంతాల గురించి ఇప్పుడు చూద్దాం..
దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు ఎక్కువ మంది వెళ్లే ప్రాంతం తాజ్ మహల్. 2023లో ఇక్కడికి ఏకంగా 6.10 మిలియన్ల దేశీయ, 0.68 మిలియన్ల విదేశీ పర్యాటకులను ఆకర్షించింది. ఈ ఐకానిక్ స్మారక చిహ్నం భారతదేశ గొప్ప వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది.
ప్రపంచంలోని పురాతన ప్రదేశాలలో వారణాసి ఒకటి. ఇక్కడ యాత్రికులు గంగానదిలో స్నానం చేయడానికి, దశాశ్వమేధ ఘాట్ లోని ప్రసిద్ధ గంగా హారతికి వేడుకను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఆధ్యాత్మిక అన్వేషకులు, బ్యాక్ ప్యాకర్లు, ఫోటోగ్రాఫర్లు ఈ ప్రాంతాన్ని ఎంతో ఇష్టపడుతారు. వారణాసి ప్రతి సంవత్సరం లక్షలాది మంది సందర్శకులను ఆకర్షిస్తుంది. ఇది దేశంలో అత్యధికంగా సందర్శించే నగరాలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది.
రామమందిరం ప్రారంభమైన తర్వాత.. అయోధ్య ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్న ఆలయాన్ని చూడటానికి యాత్రికులు, పర్యాటకులు తరలివస్తున్నారు. ఈ నగరం రామాయణాన్ని పర్యాటకులకు పరిచయం చేస్తుంది. అయోధ్య యూపీలోని అత్యంత ముఖ్యమైన ప్రయాణ ప్రదేశాలలో ఒకటిగా మారుతోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద మహా కుంభమేళాకు ప్రయాగ్ రాజ్ వేదికగా మారింది. పవిత్ర త్రివేణి సంగమం యాత్రికులు, పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ నగరం వలసరాజ్యాల వాస్తుశిల్పం, గొప్ప సాహిత్య చరిత్రను కలిగి ఉంది. ఇది కేవలం మతపరమైన కేంద్రంగానే కాదు, అంతకు మించి ఉంటుంది.
Read Also: స్వర్గాన్ని తలపించే 10 రహస్య దీవులు, ఎక్కడో కాదు.. ఇండియాలోనే!
యూపీలో పర్యాటకులను ఎక్కువగా ఆకట్టుకునే మరో ప్రాంతం మధురలోని బృందావన్. సందర్శకులు కేవలం విశ్వాసం కోసం మాత్రమే కాదు, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ప్రదేశాలలో ఒకటిగా ఈ ప్రాంతాన్ని భావిస్తారు. అందుకే నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు.
Read Also: దసరా పండుగ వచ్చేస్తోంది, వీలుంటే కచ్చితంగా ఈ ప్లేసెస్ కు వెళ్లండి!