వందేభారత్ భారత్ రైళ్లలో ఎలాంటి న్యూసెన్స్ కు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని రైల్వే పోలీసులు హెచ్చరించారు. అత్యాధునికి సౌకర్యాలు, అత్యంత వేగం మాత్రమే కాదు, అత్యంత ఆహ్లాదకరంగా ప్రయాణాలు చేయాలనే రైల్వేశాఖ నిబంధనలకు అనుగుణంగా ప్యాసింజర్లు జర్నీ చేయాలన్నారు. తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించే ఎలాంటి చర్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. తాజాగా హజ్రత్ నిజాముద్దీన్ నుంచి రాణి కమలపతి స్టేషన్‌కు ప్రయాణిస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో తాగిన మత్తులో ఉన్న యువకుడు, మహిళ గొడవ చేశారు. ఆన్ బోర్డింగ్ సిబ్బందితో, తోటి ప్రయాణీకులతో అసభ్యకరంగా ప్రవర్తించారు. కంట్రోల్ రూమ్ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఆర్‌పీఎఫ్ సిబ్బంది ఆ యువకుడిని, మహిళను రైలు నుంచి దించి అరెస్ట్ చేశారు.
రైలు నుంచి దించి స్టేషన్ కు తరలించిన తర్వాత కూడా ఇద్దరు దురుసుగా ప్రవర్తించడం ఆపలేదు. సదరు యువతి తన పర్సులోంచి రూ. 500 నోట్లను తీసి, వాటిని ఆర్‌పిఎఫ్ సిబ్బందికి చూపించి, వారిపై అసభ్యకరమైన పదజాలంతో విరుచుకుపడింది. ఎంత సర్ది చెప్పినప్పటికీ వినకపోవడంతో వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి కేసు నమోదు చేశారు. పోలీసులు వివరాల ప్రకారం సదరు యువతీ యువకుడు బబ్లు, నేహా శుక్లాగా గుర్తించారు. వాళ్లు హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో సి-2 కోచ్ లోని 50, 51 సీట్లలో కూర్చున్నారు. రైలు ఎక్కడానికి ముందే వాళ్లు మద్యం సేవించారు. రైలు స్టేషన్ నుంచి బయల్దేరిన తర్వాత వారు గొడవ చేయడం మొదలుపెట్టారు. దీనివల్ల రైలులోని ప్రయాణీకులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. రైలు సిబ్బంది వారిని శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పుడు, వారి పైగా గొడవ చేశారు.
రైలు ఆగ్రా నుంచి బయలుదేరిన వెంటనే, కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదు అందింది. రైలు గ్వాలియర్ స్టేషన్‌కు చేరుకున్నప్పుడు, ఆర్‌పీఎఫ్ సిబ్బంది రైల్లోకి వచ్చి వారిని కిందికి దింపారు. రైల్లో నుంచి దింపడం పట్ల ఆర్‌పీఎఫ్ సిబ్బంది పైనా వాళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైలు నుంచి దింపిన తర్వాత ప్లాట్ ఫారమ మీద ప్రయాణీకులతో సిగరెట్టు ఇవ్వాలని రచ్చ చేశారు. వారి రచ్చ ఎక్కువ కావడంతో RPF సిబ్బంది ఆ యువతీ, యువకుడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. విచారణ సమయంలో, వారు తమను తాము భార్యాభర్తలుగా పరిచయం చేసుకున్నట్లు వెల్లడించారు. తమది భోపాల్ అని వెల్లడించారు. “కంట్రోల్ రూమ్ నుంచి మెసేజ్ వచ్చిన తర్వాత మద్యం మత్తులో ఉన్న యువతీ యువకుడిని వందేభారత్ నుంచి దింపి ప్రశ్నించినప్పుడు తమ సిబ్బందిపై న్యూసెన్స్ చేశారు. ఈ నేపథ్యంలో వారిపై కేసు నమోదు చేశాం” అని RPF అధికారులు తెలిపారు.
Read Also: చెంప మీద కొట్టి.. డబ్బులు లాక్కొని.. అమ్మాయితో టీసీ అనుచిత ప్రవర్తన, ట్విస్ట్ ఏమిటంటే?