Indian Tatkaal Passport: కొన్నిసార్లు అప్పటికప్పుడు విదేశీ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అధికారిక పనులు, మెడికల్ ఎమర్జెన్సీతో పాటు కొన్ని సమయాల్లో వెంటనే వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో తత్కాల్ పాస్ పోర్ట్ ఉపయోగపడుతుంది. అకస్మాత్తుగా విదేశాలకు వెళ్లడానికి ఈ పాస్ పోర్టును అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. తత్కాల్ పాస్‌పోర్ట్ ప్రక్రియ సాధారణ పాస్ పోర్ట్ కంటే వేగంగా పూర్తవుతుంది. సాధారణ పాస్‌పోర్ట్ పొందడానికి 30 నుంచి 45 రోజులు పడుతుంది. అదే తత్కాల్ పాస్ పోర్టు కేవలం 3 రోజుల్లో ఇంటికి వస్తుంది. దీని కోసం ఎలాంటి గెజిట్ అధికారి వెరిఫికేషన్ సర్టిఫికేట్ అవసరం లేదు.
తత్కాల్ పాస్ పోర్టులు అవసరమైన పత్రాలు
తత్కాల్ పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు వీటిలో మూడు పత్రాలను అందజేయాల్సి ఉంటుంది.
⦿ ఆధార్ కార్డ్ లేదంటే ఇ-ఆధార్
⦿ ఓటరు ID
⦿ ప్రభుత్వ లేదంటే ప్రైవేట్ కంపెనీ సర్వీస్ ID
⦿కుల ధృవీకరణ పత్రం
⦿ పెన్షన్ సంబంధిత పత్రాలు
⦿ PAN కార్డ్
⦿చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్
తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం ఎంత ఫీజ్ చెల్లించాలంటే?
తత్కాల్ పాస్ పోర్టు పొందాలి అనుకునే వాళ్లు దాని వ్యాలిడిటీ సహా ఇతర విషయాలను పరిగణలోకి తీసుకుని ఛార్జ్ చేస్తారు.
⦿ 10 ఏళ్ల వ్యాలిడిటీ 36 పేజీలు కలిగిన కొత్తది లేదంటే తిరిగి జారీ చేసే తత్కాల్ పాస్ పోర్టుకు రూ.3,500 చెల్లించాల్సి ఉంటుంది.
⦿ 10 ఏళ్ల వ్యాలిడిటీ 60 పేజీలు కలిగిన కొత్తది లేదంటే తిరిగి జారీ చేసే తత్కాల్ పాస్ పోర్టుకు రూ. 4,000 చెల్లించాల్సి ఉంటుంది.
⦿ పోగొట్టుకున్న లేదంటే పాడైన 36 పేజల పాస్ పోర్టు కోసం రూ. 5000 చెల్లించాల్సి ఉంటుంది.
తత్కాల్ పాస్ పోర్టు పొందేందుకు ఎంత సమయం పడుతుంది?
తత్కాల్ పాస్ పోర్టుకు సంబంధించి దరఖాస్తు అందించిన తర్వాత దాని స్టేటస్ ‘గ్రాంటెడ్’గా కనిపిస్తుంది. దీని తర్వాత, దరఖాస్తు సమర్పించిన తేదీ మినహాయించి, మూడు వర్కింగ్ డేస్ లో పాస్ పోర్ట్ పంపబడుతుంది. ఈ పాస్ పోర్టుకు పోలీస్ వెరిఫికేషన్ ఉండదు.
Read Also: విమానంలో ఇంధన ట్యాంక్ ఎక్కడ ఉంటుంది? ఎమర్జెన్సీ టైమ్ లో ఏం చేస్తారు?
తత్కాల్ పాస్‌పోర్ట్ ఎవరికి లభించదు?
⦿ విదేశాల్లో పుట్టిన భారతీయ తల్లిదండ్రుల పిల్లలకు లభించదు.
⦿ హోం మంత్రిత్వ శాఖ (MHA) ద్వారా పౌరసత్వం పొందిన వ్యక్తులకు ఇవ్వరు.
⦿ జమ్మూ కాశ్మీర్ నివాసితులకు ఇవ్వరు.
⦿ భారతీయ, విదేశీ తల్లిదండ్రులు దత్తత తీసుకున్న పిల్లలు.
⦿ విడిపోయినప్పటికీ విడాకులు తీసుకోని తల్లిదండ్రుల పిల్లలకు ఇవ్వరు.
వీరికి మినహా మిగతా వారందరికీ తత్కాల్ పాస్ పోర్టును అందిస్తారు. ఎక్కువగా అత్యవసర అధికారిక పనులు, మెడికల్ ఎమర్జెన్సీ, విదేశాల్లో చనిపోయిన కుటుంబ సభ్యుల బంధువులు అక్కడికి వెళ్లేందుకు ఈ రకమైన పాస్ పోర్టును తీసుకుంటారు.