South Central Railway: అదనపు MMTS రైల్వే సర్వీసుల గురించి దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సాంకేతిక, మౌలిక సదుపాయాల ఇబ్బందుల కారణంగా సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ నుంచి చర్లపల్లికి అదనపు MMTS సబర్బన్ రైలు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడం లేదని వెల్లడించింది. ఈ మార్గాల్లో MMTS సేవలను ప్రవేశపెట్టడానికి సాధ్యాసాధ్యాల కోసం సమగ్ర పరిశీలన అవసరమని చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శ్రీధర్ వెల్లడించారు. అయితే, సదరు టెక్నికల్, మౌలిక సదుపాయాలకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించలేదు.
చర్లపల్లిలో అప్రోచ్ రోడ్ల విస్తరణ
చర్లపల్లిలో ప్రస్తుతం అప్రోచ్ రోడ్లను విస్తరించాల్సి ఉందని శ్రీధర్ తెలిపారు. టెర్మినల్ కు వెళ్లే రెండు అప్రోచ్ రోడ్లు ప్లాట్ ఫారమ్ ఒకటి, తొమ్మిది వైపు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయన్నారు. వాటిని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఈ విషయంపై పలు సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. రెండు అప్రోచ్ రోడ్లను విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. మహాలక్ష్మీనగర్ సమీపంలోని పనికిరాని రైల్వే క్వార్టర్లను క్లియర్ చేయడం స్టేషన్ కు రోడ్డు కనెక్టివిటీని ఇవ్వాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించనున్నట్లు వెల్లడించారు.
ప్లాట్ ఫారమ్ లపై అనవసర వస్తువుల తొలగింపు
చర్లపల్లి రైల్వే స్టేషన్ లో సరిపడ లిఫ్టులు, ఎస్కలేటర్లు ఉన్నాయని, అన్ని ప్లాట్ ఫారమ్ లు ఫుట్ ఓవర్ బ్రిడ్జితో లింక్ చేయబడి ఉన్నట్ల CPRO శ్రీధర్ వివరించారు. కొత్త టెర్మినల్ భవనం దక్షిణం వైపున ఉన్న సర్క్యులేటింగ్ ప్రాంతంలో ర్యాంప్ కూడా అందుబాటులో ఉందన్నారు. ప్లాట్ ఫారమ్ లపై పనులు పూర్తయిన తర్వాత చెల్లాచెదురుగా ఉన్న వస్తువులను తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లోని చర్లపల్లి రైల్వే టెర్మినల్ లో రూఫ్ టాప్ నిర్మాణం ఇంకా కొనసాగుతోందన్నారు.
Read Also: రిజర్వేషన్ లేకున్నా స్లీపర్ జర్నీ చెయ్యొచ్చు.. ఎలాగంటే?
ప్లాట్‌ఫామ్ 4/5లో నో ప్లాట్‌ఫామ్ షెల్టర్
ప్లాట్‌ఫామ్ 4/5లో ప్లాట్ ఫామ్ షెల్టర్ అందుబాటులో లేదన్న శ్రీధర్.. ప్రస్తుతం దాని నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరు నాటికి పూర్తవుతుందన్నారు. ఆ తర్వాత ఈ ప్లాట్ ఫామ్ లో తగినంత సీటింగ్, డిజిటల్ డిస్ ప్లేలు అందించబడతాయన్నారు. మిగిలిన ప్లాట్ ఫామ్ లలో నిబంధనల ప్రకారం తగినంత డిజిటల్ డిస్‌ప్లే బోర్డులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ఆర్టీసీ చర్లపల్లి స్టేషన్ కు, తొమ్మిది మార్గాల్లో 380 బస్సు ట్రిప్పులు నడుపుతోందని ఆయన తెలిపారు. తెల్లవారుజామున సర్వీసులను నిర్వహించడానికి రాత్రిపూట 30 బస్సులను స్టేషన్ ప్రాంగణంలో పార్క్ చేయడానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. బస్సు సేవల సంఖ్యను పెంచడానికి TGSRTCని కూడా సంప్రదిస్తామని శ్రీధర్ వెల్లడించారు. త్వరలోనే సరిపడ మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్న ఆయన, ఆ తర్వాత MMTS సేవల విషయంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Read Also: కళ్లు చెదిరేలా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్, చూస్తే వావ్ అనాల్సిందే!