New Airports In Telangana: తెలంగాణలో విమానాశ్రయన నెట్ వర్క్ ను మరింతగా అందుబాటులోకి తీసుకురాబోతోంది. 2027 నాటికి తెలంగాణలో మూడు విమానాశ్రయల ద్వారా ప్రయాణీకులు రాకపోకలు కొనసాగించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సేవలు అందిస్తుండగా, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో కొత్త విమానాశ్రయాలను తీసుకురావాలని కేంద్రం ప్రభుత్వం భావిస్తోంది.
2025 నాటికి టెండర్లు పిలిచే అవకాశం
కొత్త విమానాశ్రయాలకు సంబంధించి 2025 చివరి నాటికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) టెండర్లు పిలిచే ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. టెండర్లు పూర్తి అయిన తర్వాత వెంటనే పనులు ప్రారంభించనున్నారు. ఈ విమానాశ్రయాలు బోయింగ్ 737, ఎయిర్ బస్ A320 లాంటి విమానాలను నిర్వహించేలా3,000 మీటర్ల పొడవైన రన్‌వేలు, నైట్ ల్యాండింగ్ మెకానిజమ్‌లతో సహా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించనున్నారు.
మామునూర్ స్థానంలో వరంగల్ విమానాశ్రయం
నిజాం కాలంలో నిర్మించిన పాత మామునూర్ ఎయిర్ స్ట్రిప్ స్థలంలో వరంగల్ విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న శిథిలమైన రన్ వేల స్థానంలో 1,000 ఎకరాలలో ఆధునిక సౌకర్యాలతో ఈ ఎయిర్ పోర్టును ఏర్పాటు చేయనున్నారు. అక్కడ AAI ఇప్పటికే 696 ఎకరాల భూమిని కలిగి ఉంది, మిగిలిన 280 ఎకరాలను సమకూర్చుకోనుంది. తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ కోసం ఇప్పటికే రూ. 200 కోట్లు విడుదల చేసింది. సమీపంలోని రెండు గ్రామాలను తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. బాధితులకు ప్రభుత్వ భూమిని పరిహారంగా అందిస్తున్నారు. విమానాశ్రయ మౌలిక సదుపాయాలకు అనుగుణంగా వరంగల్-ఖమ్మం మార్గంతో సహా రోడ్డు సర్దుబాట్లకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు.
IAF హెలిపోర్ట్ స్థలంలో ఆదిలాబాద్ విమానాశ్రయం
ఇక ప్రతిపాదిత ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని శాంతినగర్‌లో అభివృద్ధి చేస్తారు. ఇక్కడ గతంలో IAF హెలిపోర్ట్ ఉంది. ఈ ఎయిర్ స్ట్రిప్‌ను గతంలో నిజాం కాలంలో, ఆ తర్వాత భారత వైమానిక దళం ఉపయోగించింది. IAF ఇప్పుడు విమానాశ్రయ నిర్మాణానికి అనుమతిస్తూ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) జారీ చేసింది. ప్రస్తుతం, IAF ఆధ్వర్యంలో 369 ఎకరాల స్థలం ఉంది. పూర్తి స్థాయి విమానాశ్రయం కోసం అదనంగా 250 ఎకరాలను సేకరించనుంది. ఈ ప్రాజెక్ట్ కు 600 ఎకరాల భూమి అవసరం అవుతుంది. ఒకేసారి రెండు విమానాలను నిర్వహించగల సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు.
Read Also: రైల్వే ప్రయాణంలో ఆధార్ ధృవీకరణ, అనుమానం వస్తే అంతే సంగతులు!
ఉడాన్ కనెక్టివిటీలో భాగంగా నిర్మాణం
ఈ విమానాశ్రయాలను ఉడాన్ ప్రాంతీయ కనెక్టివిటీ పథకం కింద నిర్మించనున్నారు. నిర్వహణ ఖర్చులో 80% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, తెలంగాణ 20% భరిస్తుంది. ప్రతి విమానాశ్రయం ఒకేసారి 500 మంది ప్రయాణికులకు వసతి కల్పించగలదని భావిస్తున్నారు. AAI నిర్మాణం 24 నెలల్లో పూర్తవుతుందని ఆశిస్తున్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టులను 18 నెలల్లో పూర్తి చేయాలని అభ్యర్థించారు, 2027 మధ్య నాటికి రెండూ సిద్ధంగా ఉండవచ్చని సూచించారు. ప్రతి విమానాశ్రయానికి ₹500–₹600 కోట్లు ఖర్చు అవుతుందని భావిస్తున్నారు.
Read Also: విశాఖ నుంచి రైల్లో నేరుగా.. ఈ అందమైన ప్రాంతాలకు వెళ్లిపోవచ్చు.. ఈ 4 మిస్ కావద్దు!