Saraswati Pushkaralu: తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం. ఈ పుణ్యక్షేత్రం సరస్వతీ పుష్కరాలకు సిద్ధం అవుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి సరస్వతీ నది పుష్కరాలు అత్యంత వైభవంగా కొనసాగనున్నాయి. 26 వరకు పుష్కరాలు జరగనున్నట్లు పండితులు వెల్లడించారు. ఈ పుష్కరాల కోసం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. రోజూ సుమారు లక్ష మందికి పైగా భక్తులు పుష్కర స్నానం చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. సౌత్ ఇండియాలో కేవలం కాళేశ్వరంలోనే సరస్వతి పుష్కరాలు జరుగున్నాయి.
12 ఏండ్లు ఓసారి సరస్వతీ నది పుష్కరాలు
సరస్వతీ పుష్కరాలు అనేవి 12 ఏండ్లకు ఒకసారి జరుగుతాయి. సరస్వతీ నదిని త్రివేణి సంగమం దగ్గర ప్రవహించే అంతర్వాహినిగా పండితులు భావిస్తారు. బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు ఈ పుష్కరాలు జరుగుతుతాయి. ఈ నెల 14న రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కర కాలం మొదలవుతుంది. మరుసటి రోజు సూర్యోదయం తర్వాత నుంచి భక్తులు పుష్కర స్నానాలు ఆచరిస్తారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు పూర్తయినట్లు కాళేశ్వరం పుణ్యక్షేత్రం అర్చకులు, అధికారులు తెలిపారు.
10 అడుగుల సరస్వతీ విగ్రహం
ఇక నది ఒడ్డున 10 అడుగుల సరస్వతీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. ఈ విగ్రహం అరచేతుల్లో తాళపత్ర గ్రంథాలు పట్టుకుని అద్భుతంగా కనిపించనుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఒకే పానవట్టంపై కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి(రెండు శివలింగాలు) ఉన్న పుణ్యక్షేత్రం కాళేశ్వరం ఒక్కటే కావడం విశేషం. ఈ రెండు లింగాలను అభిషేకించే నీరు గోదావరి, ప్రాణహిత నదుల సంగమ స్థానంలో కలుస్తుంది. ఇక్కడి సరస్వతీ నదిని అంతర్వాహినిగా పిలుస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది.
ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ
ఇక సరస్వతీ నది పుష్కరాల నేపథ్యంలో భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇవాళ్టి(మే 14) నుంచి హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. జేబీఎస్, ఎంజీబీఎస్ల నుంచి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. అంతేకాదు, 40 మంది కాళేశ్వరం వెళ్లే భక్తులు ఉంటే, సదరు కాలనీకే వచ్చి బస్సులో ఎక్కించుకుని వెళ్తుందని అధికారులు తెలిపారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే సరస్వతీ పుష్కరాల్లో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించేందుకు హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. భక్తులు ఈ బస్సు సర్వీసులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఇతర జిల్లాల నుంచి కూడా ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.
Read Also: విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్ పొడిగింపు, ఇక ఆ స్టేషన్స్ వరకు పరుగు!