Indian Railways: రైళ్లలో భద్రతను మరింత పెంచే దిశగా రైల్వే అధికారులు జాగ్రత్తలు చేపడుతున్నారు. భద్రతతో పాటు పర్యవేక్షణ పెంచబోతున్నారు. అందులో భాగంగానే తొలిసారి ముంబైలోని లోకల్ రైళ్లలో ఏఐ ఆధారిత సీసీ కెమెరాలు, వాయిస్ రికార్డింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం 250 రైళ్లలో వీటిని అమర్చుతున్నారు. ప్రతి రైలులో రెండు మోటార్ క్యాబ్ లు ఉంటాయి. ఒకటి మోటార్ మ్యాన్ కోసం ముందు భాగంలో, మరొకటి రైలు మేనేజర్ కోసం వెనుక భాగంలో ఉంటుంది. ప్రతి మోటార్ క్యాబ్‌లో ఆరు CCTV కెమెరాలు, ఆడియో రికార్డింగ్ పరికరాలు అమర్చబడతాయి.
180 డిగ్రీల కెమెరాలు ఏర్పాటు
కెమెరా సెటప్ లో ట్రాక్ విజువల్స్ ను సంగ్రహించడానికి రెండు వైపు విజువల్స్ క్యాప్చర్ చేసే కెమెరాలు, క్యాబ్ లోపల సిబ్బందిని పర్యవేక్షించే రెండు కెమెరాలు, ట్రాక్ రెండు వైపులా కవర్ చేసే రెండు 180-డిగ్రీ కెమెరాలు ఉన్నాయి. మోటార్‌మ్యాన్, రైలు మేనేజర్ ను ఈ కెమెరాలు ఫోకస్ చేస్తాయి. అవాంఛనీయ సంఘటనల సమయంలో భద్రతా ప్రోటోకాల్‌లను పాటించారా? లేదా? అని కన్ఫర్మ్ చేయడంలో సాయపడుతాయని అధికారులు తెలిపారు. అటు సూచించిన కలర్ కోడ్ సిస్టమ్ ను ఉపయోగించి భద్రతా హెచ్చరికలు సరిగ్గా తెలియజేయబడ్డాయో? లేదో? ఆడియో రికార్డింగ్స్ డాక్యుమెంట్ చేస్తాయి.
అటు అనధికార మొబైల్ వాడకంతో సహా మోటార్ మ్యాన్లలో పరధ్యానం, నిద్ర ముప్పు సంకేతాలను గుర్తించడానికి ఈ వ్యవస్థ AI సామర్థ్యాలను కలిగి ఉంది. భద్రతా ప్రమాదాల విషయంలో హెచ్చరికలు ఆటో మేటిక్ గా చేస్తాయి. రియల్ టైమ్ జోక్యం చేసుకుంటాయి. దీని వలన కార్యాచరణ నియంత్రణ మెరుగుపడటంతో పాటు ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు తెలిపారు. ప్రతి మోటార్ క్యాబ్ లో CVVRSని ఇన్ స్టాల్ చేయడానికి దాదాపు రూ. 1 నుంచి 1.25 లక్షలు ఖర్చవుతుందని అధికారులు తెలిపారు.
Read Also: వందేభారత్ స్లీపర్ కు ఎదురు దెబ్బ, ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టమే!
ప్రైవసీకి భగం కలిగే అవకాశం ఉందంటూ ఆందోళన
అయితే, సీసీ కెమెరాలు, వాయిస్ రికార్డర్ల ఏర్పాటు కారణంగా ప్రైవసీ దెబ్బతింటుందని రైల్వే సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ వ్యవస్థ సిబ్బంది దృష్టి మరల్చవచ్చని, క్రమశిక్షణా చర్యలకు దుర్వినియోగం కావచ్చని హెచ్చరించాయి. ఈ వ్యవస్థ భద్రతా ఆడిట్‌లు, సిబ్బంది మద్దతు కోసం ఉద్దేశించబడిందని రైల్వే అధికారులు తెలిపారు. శిక్షాత్మక చర్యలు కాదని రైల్వే పరిపాలన హామీ ఇచ్చింది. ముంబై లోకల్ రైళ్లతో పాటు, వెస్ట్రన్ రైల్వే తన 978 లోకోమోటివ్ లలో CCTVలను ఏర్పాటు చేస్తోంది. RDSO స్పెసిఫికేషన్ల ప్రకారం యూనిట్ కు రూ. 8–10 లక్షల ఖర్చుతో వీటిని ఏర్పాటు చేస్తుంది.
Read Also: బుల్లెట్ రైలు కారిడార్ లో మరో మైల్ స్టోన్, కీలక వంతెన పూర్తి!