Indian Railways: అత్యంత వేగం, అత్యాధునిక సౌకర్యాలతో మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి వందేభారత్ రైళ్లు. అయితే, ఈ రైళ్లలో సరఫరా చేసే ఆహారం విషయంలో ప్రయాణీకుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చినట్లు ఇండియన్ రైల్వే వెల్లడించింది. సరైన నిబంధనలు పాటించకుండా ఆహారం సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లకు రైల్వే అధికారులు.. పెద్ద మొత్తంలో జరిమానాలు విధించినట్లు తెలిపింది. ఈ సంవత్సరం జనవరి నుంచి ఏప్రిల్ మధ్య మంగళూరు – తిరువనంతపురం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కు సంబంధించి రైల్వే సంస్థ దాదాపు రూ. 15 లక్షల జరిమానాలు వసూలు చేసినట్లు ప్రకటించింది. కేరళలోని తిరువనంతపురం- కాసర్ గోడ్ ను కలిపే మరో వందే భారత్ సర్వీస్ నుంచి రూ.6,77,500 జరిమానాలు విధించినట్లు తెలిపింది.
‘రైల్వే మదద్’కు 319 ఫిర్యాదులు
నిజానికి వందేభారత్ రైళ్లలో క్యాటరింగ్ గురించి పెద్దగా ఫిర్యాదులు లేవని రైల్వే అధికారులు చెప్తున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. జూలై 2024, ఏప్రిల్ 2025 మధ్య దక్షిణ రైల్వే పరిధిలోని ఆరు వందే భారత్ రైళ్లలో అందించే ఆహారం నాణ్యత తక్కువగా ఉందని ‘రైల్ మదద్’ 319 కు ఫిర్యాదులు వచ్చాయని RTI కింద సమాధానం ఇచ్చింది. అయితే, సదరు క్యాటరింగ్ కాంట్రాక్టులను రద్దు చేయడంతో పాటు బ్లాక్ లిస్ట్ చేసే అవకాశం ఉన్నా, మరో అవకాశం ఇచ్చినట్లు తెలిపింది.
బేస్ కిచెన్లను మూసివేసిన రైల్వే అధికారుల బృందం
రైల్వే అధికారుల బృందం ఇటీవల కొచ్చిలోని వందే భారత్ రైళ్లకు ఆహారాన్ని సరఫరా చేసే సంస్థకు సంబంధించిన బేస్ కిచెన్‌ను తనిఖీ చేసింది. ఈ కిచెన్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నట్లు నివేదించింది. అపరిశుభ్రమైన పాత్రలలో ఆహారం తయారు చేస్తున్నట్లు గుర్తించింది. వంట కోసం ఉపయోగించే నీటిని నిల్వ చేయడానికి ఉపయోగించే ట్యాంక్ లు శుభ్రంగా లేవని తెలిపింది. వస్తువుల కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులు కూడా లేవని గుర్తించింది. అపరిశుభ్రమైన పరిస్థితులలో ఆహారం తయారు చేయబడిందని అధికారుల బృందం వెల్లడించింది. అంతేకాదు, బేస్ కిచెన్ లోని 24 మంది ఉద్యోగులలో కేవలం ఎనిమిది మంది మాత్రమే వైద్య ధృవీకరణ పత్రాలను కలిగి ఉన్నారని బృందం గుర్తించింది. తీవ్ర ఉల్లంఘనల నేపథ్యంలో కొచ్చి కార్పొరేషన్ బేస్ కిచెన్ ను సీల్ చేసింది. ఆ తర్వాత ఈ బేస్ కిచెన్ లో పని చేసే మరో ఏడుగురు ఉద్యోగులు వైద్య ధృవీకరణ పత్రాలను పొందారని వెల్లడించింది. కొచ్చిలోని బేస్ కిచెన్ లో ఇతర రైళ్లకు ఆహారం తయారు చేయబడుతున్నట్లు గుర్తించింది. కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినట్లు కూడా బృందం కనుగొంది. అటు కొచ్చిలోని బేస్ కిచెన్ ను మూసి వేసిన వెంటనే కాంట్రాక్టర్ షోరనూర్ లో కొత్త బేస్ కిచెన్ ను ప్రారంభించాడు. మరోవైపు రైల్వే బేస్ కిచెన్లను తరచుగా తనికీ చేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ప్రయాణీకులకు నాణ్యమైన ఫుడ్ అందించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
Read Also: రైల్వే కొత్త రూల్.. ఇక వెయిటింగ్ టికెట్స్ కూడా కష్టమే, కానీ..