Katra-Banihal Train Speed Increased: జమ్మూ కాశ్మీర్ లోని రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా-బనిహాల్ రైల్వే సెక్షన్‌లో రైళ్ల వేగాన్ని పెంచారు. ఇప్పటి వరకు గంటకు 75 కిలోమీటర్లుగా ఉన్న వేగాన్ని.. ఇప్పుడు 100 కిలోమీటర్లకు పెంచారు. దీంతో ఈ మార్గంలో రైళ్ల ప్రయాణ సమయం మరింత తగ్గే అవకాశం ఉంది. 111 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే మార్గం హిమాలయాల్లోని అత్యంత క్లిష్టమైన ప్రాంతాల గుండా వెళ్తుంది. భారీ కొండలు, లోతైన లోయలు, పొడవైన సొరంగాలు, ప్రత్యేకమైన వంతెనల మధ్య రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ అనేక సవాళ్లను ఎదుర్కొంది.
కత్రా-బనిహాల్ సెక్షన్ లో కొత్తగా నిర్ణయించిన గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని రైల్వే అధికారులు విజయవంతంగా పరీక్షించారు. దీంతో ఈ మార్గంలో వేగవంతమైన రైలు సేవలకు మార్గం సుగమమైంది. ఈ వేగం పెంపు USBRL ప్రాజెక్ట్ లో రైళ్ల రాకపోకలను మరింత సులభతరం చేయనుంది. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ మార్గంలో అత్యంత ఆసక్తికరమైన అంశం చీనాబ్ వంతెన. రియాసి జిల్లాలోని ఈ వంతెన చెనాబ్ నదికి సుమారు 359 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా గుర్తింపు పొందింది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఈ వంతెనను దాటడం ఈ ప్రాజెక్టులో మరో కీలక ఘట్టంగా నిలిచింది. ఇంత ఎత్తులో, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల మధ్య నిర్మించిన వంతెనపై వేగవంతమైన రైలు ప్రయాణం రైల్వే మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని చూపిస్తోంది.
కత్రా-బనిహాల్ మార్గంలో మరో ప్రత్యేకమైన నిర్మాణం అంజి వంతెన. ఇది దేశంలోనే తొలి కేబుల్ స్టేడ్ రైల్వే వంతెనగా గుర్తింపు పొందింది. రియాసి జిల్లాలోని లోతైన అంజి ఖాడ్ పై ఈ వంతెనను నిర్మించారు. సెంట్రల్ పైలాన్, కేబుల్ స్టే వ్యవస్థ ఆధారంగా రైల్వే డెక్ ను ఏర్పాటు చేశారు. కష్టతరమైన హిమాలయ ప్రాంతంలో రైలు మార్గాన్ని కొనసాగించేందుకు ఈ వంతెన కీలకంగా మారింది.
USBRL ప్రాజెక్టులో భాగమైన కత్రా-బనిహాల్ సెక్షన్‌లో వేగ పరిమితి పెరగడంతో రైళ్ల రాకపోకలు మరింత వేగవంతం కానున్నాయి. ముఖ్యంగా ఈ మార్గంలో ప్రయాణించే వారికి సమయం ఆదా కానుంది. వందే భారత్ లాంటి రైళ్లు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు అనుమతి లభించడం వల్ల భవిష్యత్తులో ఈ మార్గంలో వేగవంతమైన రైలు సేవలకు మరింత అవకాశం ఏర్పడుతుంది.
100 km/h over India’s engineering pride! 🇮🇳 pic.twitter.com/4GlR5QJTva
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 2, 2026
Read Also: బెంగళూరు నుంచి ముంబైకి స్లీపర్ వందే భారత్.. పట్టాలెక్కేది ఎప్పుడంటే?