అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖపట్నం సిద్దం అవుతోంది. ఈ నెల 21న సుమారు 5 లక్షల మంది పాల్గొనే ఈ వేడుకల్లో ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. విశాఖ బీచ్ రోడ్డు యోగా డే వేడుకల కోసం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖను తాత్కాలిక రెడ్ జోన్ గా ప్రకటించారు. ఇప్పటికే బీచ్ రోడ్డును మూసివేశారు. విశాఖలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కేంద్ర భద్రతా బలగాలు వైజాగ్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. చాలా చోట్ల ట్రాఫిక్ ఆంక్షలతో పాటు మళ్లింపు చేస్తున్నారు.
ప్రధాని మోడీ యోగా డే షెడ్యూల్ ఇదే!
యోగా డే వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ ఇవాళ సాయంత్రం భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకుంటారు. నేవీ గెస్ట్ హౌస్ లో ప్రధాని రాత్రి బస చేస్తారు. శనివారం ఉదయం 6.30 గంటలకు బీచ్ రోడ్డుకు చేరుకుంటారు. 7:45 గంటల వరకు యోగా వేడుకల్లో పాల్గొంటారు. కాసేపు ప్రజలతో కలిసి యోగాసనాలు వేస్తారు. అనంతరం ఆయన ప్రసంగిస్తారు. ఆ తర్వాత కార్యక్రమం పూర్తి అవుతుంది.
పాఠశాలలకు వరుసగా మూడు రోజులు సెలవులు
విశాఖపట్నంలో 21న యోగా డే వేడుకలు జరగనున్న నేపథ్యంలో నగరంలో అన్ని పాఠశాలలకు 20,21 తేదీల్లో సెలవు ప్రకటించారు. ఈ మేరకు డీఈవో అన్ని పాఠశాలలకు సర్కులర్ జారీ చేశారు. మొత్తంగా మూడు రోజుల పాటు విద్యార్థులకు సెలవులు వచ్చాయి. మరోవైపు ఇప్పటికే విశాఖ ఆర్కే బీచ్ లో యోగా డే సన్నాహక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
యోగా డే బాధ్యతలు నలుగురు ఐఏఎస్ అధికారులకు అప్పగింత
విశాఖ లో జరిగే యోగా డే వేడుకలకు సంబంధించి నిర్వహణ బాధ్యతలను నలుగురు ఐఏఎస్ అధికారులకు అప్పగించింది ప్రభుత్వం. ఇప్పటికే నోడల్ ఆఫీస్ గా మల్లికార్జున ఉన్నారు. ఆయనకు సాయం చేసేందుకు నలుగురు ఐఏఎస్ అధికారులను నియమించింది. రామ సుందర్ రెడ్డి, రోణంకి కూర్మనాథ్, గోవిందరావు, రోణంకి గోపాలకృష్ణకు బాధ్యతలు అప్పగించారు. అటు 12,000 మంది పోలీసులతో యోగా డేకు భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే విశాఖ నగరంలో ఐదు కిలోమీటర్ల పరిధిని నో డ్రోన్ జోన్ గా ప్రకటించారు.
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
విశాఖలో ట్రాఫిక్ ఆంక్షల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ బీచ్ రోడ్డును మూసి వేయడంతో ఇతర మార్గాల్లో వాహనాల రద్దీ పెరిగింది. మధురవాడ నుంచి సిటీలోకి వచ్చే జాతీయ రహదారి రెండు వైపులా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విశాఖ పోర్ట్ ఏరియా నుంచి ఆర్కే బీచ్, కైలాశగిరి, భిమిలి వరకు రోడ్డు మొత్తం బ్లాక్ చేశారు. అలాగే సిటీ, హైవే నుంచి బీచ్ రోడ్డుకు వెళ్లే షార్ట్ కట్స్ కూడా క్లోజ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అటువైపు వెళ్లకూడదని పోలీసులు సూచించారు. అలాగే మార్నింగ్ ఎయిర్ పోర్ట్ నుంచి బీచ్ రోడ్డు వరకు హైవేపై కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. మోడీ వెళ్లే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి. ఉదయమే యోగా కార్యక్రమం అయినోయినా, ఆ రోడ్లు అందుబాటులోకి తేవడానికి సమయం పట్టే అవకాశం ఉంది. వీకెండ్ లో విశాఖలో పర్యాటకుల తాకిడి ఎక్కువ కాబట్టి.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
Read Also: హైదరాబాద్ మెట్రో క్రెడిట్ ఆ ముఖ్యమంత్రిదేనా? పునాది వేసింది ఎవరు?