BIG TV LIVE Originals: సౌత్ ఇండియాలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సుమారు శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న ఈ స్టేషన్ ను అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అద్భుతంగా తీర్చి దిద్దుతోంది. సుమారు రూ. 700 కోట్ల రూపాయలతో ఈ స్టేషన్ ను పునర్నిర్మిస్తోంది. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఈ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంటోంది. త్వరలో ఈ స్టేషన్ కు సంబంధించి అన్ని ప్లాట్ ఫారమ్ లు మూసివేయనున్నారు అధికారులు. స్టేషన్ కు సంబంధించిన పనులు, ప్లాట్ ఫారమ్ ల మూసివేత, మళ్లీ ప్రారంభానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ప్లాట్ ఫారమ్ లు ఎప్పుడు మూసివేస్తారు?
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫారమ్ ల మూసివేత ఏప్రిల్ 2025 నుంచి ప్రారంభం అయ్యింది. ఈ మూసివేత సుమారు 100 నుంచి 130 రోజులు అంటే సుమారు 3.5 నుంచి 4.5 నెలల వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. జులై లేదంటే ఆగష్టు వరకు పూర్తి ప్లాట్ ఫారమ్ లు మూసివేసే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ లో ఓవర్ హెడ్ కవర్లను కూల్చివేసి, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, కొత్త ఎయిర్ కాన్ కోర్స్ కోసం గుంతలు తవ్వడానికి ప్లాట్ ఫారమ్ లు 5, 6 ను సుమారు 10 రోజుల పాటు మూసివేస్తారు. మొదటి 13 రోజులు, 5, 6 ప్లాట్ ఫారమ్ లలో పనులు చేస్తారు. ఆ తర్వాత 50 రోజులు, 4 లేదంటే 5 ప్లాట్ ఫారమ్ లు ఓపెన్ లో ఉంటాయి. మిగిలినవి పునర్నిర్మాణ పనుల కోసం మూసివేయబడతాయి. 10 ప్లాట్ ఫారమ్ లలో 8 ప్లాట్ ఫారమ్ లు ఏ టైమ్ లోనైనా పని చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ప్లాట్ ఫారమ్ లు ఎందుకు మూసివేస్తున్నారు?
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను విమానాశ్రయం మాదిరిగా నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనులకు ఆటంకం కలగకుండా ప్లాట్ ఫారమ్ లను మూసి వేస్తున్నారు. ఇక రైల్వే స్టేషన్ నిర్మాణ పనులలో భాగంగా ఫుడ్ కోర్టులు, రిటైల్ అవుట్ లెట్‌లు, ఎంటర్ టైన్ మెంట్ జోన్ లు నిర్మిస్తున్నారు. ప్రయాణీకుల యాక్సెసిబిలిటీని మెరుగుపరచడానికి 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, 2 ట్రావెలేటర్లు, పొడవైన రైళ్ల కోసం ప్లాట్‌ఫామ్ పొడిగింపులను చేపడుతున్నారు. వెయిటింగ్ హాళ్లు, టికెటింగ్ కౌంటర్లతో నార్త్, సౌత్ వైపు స్టేషన్ భవనాలు నిర్మిస్తున్నారు. ఇక రైల్వే స్టేషన్ అంతా కవర్ అయ్యేలా సీసీటీవీలు, వైఫై సౌకర్యంతో పాటు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నారు. స్టేషన్ ఏటా 20 మిలియన్లకు పైగా ప్రయాణీకులను రాకపోకలకు అనుగుణంగా రూపొందిస్తున్నారు. ఇక రైల్వే ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా హైదరాబాద్ మెట్రో, బస్ స్టేషన్‌లతో అనుసంధానం చేయనున్నారు.
ప్రయాణీకులు ఎలా ప్రభావితం చేస్తుంది?
సికింద్రాబాద్ లో ప్లాట్ ఫారమ్ ల మూసివేత కారణంగా ప్రయాణీకులు కొద్ది రోజుల పాటు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ స్టేషన్ నుంచి రాకపోకలు కొనసాగించే రైళ్లను ఇతర రైల్వే స్టేషన్లు తరలించారు. సుమారు 60–70 రైళ్లను చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి, మల్కాజ్ గిరి లాంటి సమీప స్టేషన్లకు తరలించారు.
రైల్వే స్టేషన్ పనులు ఎప్పుడు పూర్తి అవుతాయంటే?
ఇక ఈ రైల్వే స్టేషన్ కు సంబంధించిన పునర్నిర్మాణ పనులు 2025 చివరి నాటికి పూర్తవుతాయని భావిస్తున్నారు. లేదంటే 2026 ప్రారంభంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నారు.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.
Read Also: ఇండియాలో పట్టాలెక్కిన మొదటి రైలు ఇదే.. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించిందంటే?