దేశ వ్యాప్తంగా దసరా వేడుకులు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుగుతాయి. నవరాత్రి పదవ రోజున దసరా పండుగ జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి వేడుక చేసుకుంటారు. ఈ సంవత్సరం దసరా పండుగ అక్టోబర్ 2న వస్తుంది. లంకాధిపతి, రాక్షసరాజు రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయానికి, రాక్షసుడు మహిషాసురుడిపై దుర్గాదేవి విజయానికి గుర్తుగా ఈ పండుగ చేసుకుంటారు. దసరా రోజున, దుర్గా దేవీ ఊరేగింపులు నిర్వహిస్తారు. రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. మన దేశంలో, దసరా పండుగను అంగరంగ వైభవంగా జరపుకునే పలు ప్రదేశాలు ఉన్నాయి. మీరూ ఈ పండుగను జీవితంలో మర్చిపోలేని విధంగా పదిల పరుచుకోవాలంటే కొన్ని ప్రదేశాలను తప్పకుండా సందర్శించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. జీవితంలో ఒక్కసారైనా కోల్ కతాలో దసరా వేడుకలను చూడాలి. గంగా నది వైపు దుర్గాదేవికి సంబంధించి విగ్రహాల ఊరేగింపు నిర్వహిస్తారు. నిమజ్జనాన్ని చూడటానికి పడవలను అద్దెకు తీసుకొని వెళ్తారు.
⦿ కులు: దసరా సమయంలో హిమాచల్ ప్రదేశ్ లోని అన్ని ప్రముఖ ప్రాంతాల నుంచి దుర్గాదేవి విగ్రహాలు కులు మునిసిపాలిటీలో రఘునాథ స్వామి దగ్గరికి తీసుకొస్తారు. అక్కడ అమ్మవారి విగ్రహాలకు గౌరవ పూజలు నిర్వహిస్తారు. ఈ దృశ్యాలు ఎంతో అపురూపంగా ఉంటాయి.
⦿ మైసూర్: దసరా సమయంలో చాముండేశ్వరి దేవి(దుర్గా మాత) విగ్రహాన్ని కర్ణాటకలోని రాజ కుటుంబం అద్భుతమైన మైసూర్ ప్యాలెస్ లో తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహించి, ఆ రోజు ఊరేగింపుగా బయటకు తీసుకెళ్తారు. ఈ వేడుకలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు.
Read Also: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?
⦿ కోట: రాజస్థాన్ లోని కోట నగరంలో దసరా వేడుకలు ఎన్నో ఏళ్లుగా ఘనంగా జరుగుతాయి. పండుగ సమయంలో ఉదయం రాజభవనంలో మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత రాజు, రాజకుటుంబంలోని ఇతర సభ్యులు దుర్గాదేవి ఊరేగింపులో పాల్గొంటారు.
⦿ ఢిల్లీ రామ్‌లీలా: పాత ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగే దసరా వేడుకలు దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాయి. రామ్ లీలా సమయంలో రాక్షస రాజు రావణుడిపై రాముడు సాధించిన విజయ కథను నాటకాల ద్వారా చెబుతారు. రామ్ లీలా తర్వాత, రావణుడి దిష్టిబొమ్మను దహనం చేస్తారు. ప్రతి ఏటా ఓ సెలబ్రిటీ రావణ దహానాన్ని చేయడం ఆనవాయితీగా వస్తోంది.
⦿ గుజరాత్: ఇక గుజరాత్ తో దసరా సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గర్బా జానపద నృత్యాలు ప్రదర్శిస్తారు. ఈ పండుగను ప్రజలు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అందమైన సాంప్రదాయ దుస్తులు ధరించి, పలు రకాల రంగుల కర్రలతో నృత్యం చేస్తారు. ఈ నృత్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
Read Also: వావ్.. జపాన్ స్లీపర్ రైలు ఇలా ఉంటుందా? బెర్తులు భలే ఉన్నాయే!