Etihad Rail Dubai Launch: దుబాయ్‌లో రైలు ప్రయాణంలో మరో కొత్త అధ్యాయం మొదలుకానుంది. యూఏఈ నేషనల్ ప్యాసింజర్ రైలు నెట్ వర్క్ లో భాగంగా ఎతిహాద్ రైల్ దుబాయ్ సర్వీస్ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. దుబాయ్‌లోని అల్ యలాయిస్ స్టేషన్ నుంచి అబుదాబి, ఫుజైరా వైపు నేరుగా రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో యూఏఈలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణానికి రైలు మరో కీలక రవాణా మార్గంగా మారనుంది.
దుబాయ్‌లోని అల్ యలాయిస్ స్టేషన్, జుమైరా గోల్ఫ్ ఎస్టేట్స్ ప్రాంతంలో ఉంది. ఇక్కడి నుంచి అబుదాబిలోని మహమ్మద్ బిన్ జాయెద్ సిటీ స్టేషన్‌కు రైలు ప్రయాణం సుమారు 57 నిమిషాలు పడుతుంది. రోడ్డు మార్గంలో ఎక్కువ సమయం పట్టే ప్రయాణానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడనుంది. సెప్టెంబర్ 30 నుంచి దుబాయ్–అబుదాబి మార్గంలో రెండు వైపులా రోజుకు ఐదు సర్వీసులు నడపాలని షెడ్యూల్ చేశారు. దుబాయ్ నుంచి తొలి సర్వీస్ ఉదయం 6:14 గంటలకు బయలుదేరుతుంది. ఆ తర్వాత ఉదయం 7:14, మధ్యాహ్నం 1:14, సాయంత్రం 5:14, 6:14 గంటలకు సర్వీసులు ఉన్నాయి.
దుబాయ్ నుంచి ఫుజైరాకు కూడా నేరుగా రైలు ప్రయాణించే అవకాశం కల్పించారు. అందుబాటులో ఉన్న షెడ్యూల్ ప్రకారం దుబాయ్ నుంచి మధ్యాహ్నం 1:57 గంటలకు బయలుదేరే రైలు సుమారు 70 నిమిషాల్లో ఫుజైరా చేరుకుంటుంది. అబుదాబి–ఫుజైరా ప్యాసింజర్ సేవలు మాత్రం ఇప్పటికే జూన్ 30న ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 30న దుబాయ్, అల్ ధైద్ స్టేషన్లు నెట్‌వర్క్ లో చేరడంతో సేవలు మరింత విస్తరించనున్నాయి.
దుబాయ్ అల్ యలాయిస్ స్టేషన్ ప్రత్యేకతల్లో మెట్రో కనెక్టివిటీ కూడా ఒకటి. స్టేషన్ నుంచి జుమైరా గోల్ఫ్ ఎస్టేట్స్ మెట్రో స్టేషన్‌కు ప్రత్యేక ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. దీంతో ఎతిహాద్ రైల్ నుంచి దుబాయ్ మెట్రోకు సులభంగా మారే అవకాశం ఉంటుంది. నోల్ వ్యవస్థతోనూ రైలు, మెట్రో, ట్రామ్, బస్ ప్రయాణాలను ఒకే QR కోడ్ ద్వారా అనుసంధానించే సౌకర్యాన్ని కల్పించారు.
ఎతిహాద్ రైల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్‌తో పాటు స్టేషన్లలోని టికెట్ వెండింగ్ మెషీన్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. రైళ్లలో సీటు కేటాయింపు, ఉచిత వై ఫై, ఛార్జింగ్ సదుపాయాలు, లగేజీకి స్థలం వంటి సౌకర్యాలు ఉన్నాయి.
ఎతిహాద్ రైల్ నెట్ వర్క్ ను దశలవారీగా విస్తరిస్తున్నారు. దుబాయ్, అల్ ధైద్ తర్వాత అల్ ధఫ్రా స్టేషన్లు డిసెంబర్ 30, 2026న, షార్జా స్టేషన్ మార్చి 30, 2027న ప్రారంభం కానున్నాయి. దీంతో యూఏఈలోని నగరాలు, ఆర్థిక కేంద్రాలు, పర్యాటక ప్రాంతాల మధ్య రైలు కనెక్టివిటీ మరింత విస్తరించనుంది. దుబాయ్ రైలు సర్వీస్ ప్రారంభంతో రోడ్డు ప్రయాణానికి మరో ప్రత్యామ్నాయం అందుబాటులోకి వచ్చినట్లు అయ్యింది.
Read Also: LNG రైలు vs హైడ్రోజన్ రైలు.. రెండింటి మధ్య అసలు తేడా ఇదే!