Indian Railways Food Hygiene: రైల్లో ప్రయాణించేటప్పుడు చాలామందికి ఎదురయ్యే సాధారణ సమస్యల్లో ఫుడ్ క్వాలిటీ ఒకటి. రైల్వే ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది? పరిశుభ్రంగా తయారు చేస్తున్నారా? ప్యాకింగ్ సరిగ్గా జరుగుతోందా? అనే డౌట్స్ ప్రయాణికులలో ఉంటాయి. ఇకపై ఇలాంటి విషయాలపై రైల్వే మరింత ఫోకస్ పెట్టనుంది. రైళ్లలో అందించే ఆహార నాణ్యత, పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు ప్యాంట్రీ కార్లు, బేస్ కిచెన్‌లలో AI ఆధారిత CCTV కెమెరాలను ఏర్పాటు చేయాలని రైల్వే నిర్ణయించింది.
కొత్తగా ఏర్పాటు చేయనున్న కెమెరాల ద్వారా కేవలం వీడియో రికార్డింగ్ చేయడం మాత్రమే కాదు.. ఆహారం తయారీ, ప్యాకింగ్, సరఫరా వంటి ప్రక్రియలను నిరంతరం పర్యవేక్షించేలా వ్యవస్థను రూపొందిస్తున్నారు. రోజుకు 24 గంటలు వీటి ద్వారా నిఘా ఉంచనున్నారు. ఆహారం తయారయ్యే ప్రదేశంలో పరిశుభ్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? ప్యాకింగ్‌లో నిబంధనలు పాటిస్తున్నారా? లాంటి అంశాలను పర్యవేక్షించనున్నారు.
ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలో ప్రస్తుతం మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లలో 73 ప్యాంట్రీ కార్లు, ట్రైన్ సైడ్ వెండింగ్ సేవలు ఉన్నాయి. వీటితో పాటు ప్రయాణికులకు ఆహారం సిద్ధం చేసి రైళ్లకు పంపించే 62 బేస్ కిచెన్‌లు ఉన్నాయి. పాట్నా జంక్షన్, రాజేంద్ర నగర్ టెర్మినల్, దానాపూర్, పాట్లీపుత్ర లాంటి కీలక స్టేషన్లలో ఈ కిచెన్‌లు పనిచేస్తున్నాయి. సుదూర ప్రయాణాలు చేసే ప్రయాణికులకు ఇక్కడ తయారయ్యే భోజనం, అల్పాహారం రైళ్ల ద్వారా అందుతుంది.
ఈ నిర్ణయానికి రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ నిర్వహించిన రివ్యూ కూడా కారణం అయ్యింది. IRCTC వార్ రూమ్‌ను సందర్శించిన ఆయన క్యాటరింగ్ సేవలు, ప్రయాణికుల ఫిర్యాదులు, కిచెన్ మానిటరింగ్ వ్యవస్థలను పరిశీలించారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో మరింత కఠినమైన పర్యవేక్షణ అవసరమని అధికారులను ఆదేశించారు.
AI ఆధారిత నిఘా వల్ల ఏదైనా లోపం కనిపించినప్పుడు అధికారులు దానిని గుర్తించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే.. ప్రయాణికుడి నుంచి ఫిర్యాదు వచ్చే వరకు వేచి ఉండకుండా సమస్యను ముందుగానే గుర్తించే విధానం అందుబాటులోకి రానుంది. రైల్వే ఇప్పటికే కొన్ని బేస్ కిచెన్‌లలో CCTV, AI ఆధారిత రియల్‌టైమ్ మానిటరింగ్ లాంటి సాంకేతికతలను ఉపయోగిస్తోంది. ఫుడ్ ప్యాకెట్లపై కిచెన్ పేరు, ప్యాకింగ్ తేదీ, గడువు లాంటి వివరాలను చూపించే QR కోడ్‌లను కూడా ప్రవేశపెట్టింది.
AI కెమెరాలు వచ్చినా ప్రయాణికుల ఫిర్యాదుల వ్యవస్థ కొనసాగుతుంది. రైల్లో ఆహారం నాణ్యతగా లేకపోయినా, పరిశుభ్రత లోపించినా రైల్ మద్ద(Rail Madad) ద్వారా సమస్యను నమోదు చేయవచ్చు. ప్రయాణికుల ఫీడ్ బ్యాక్ ను మరింత వేగంగా సంబంధిత విభాగాలకు చేరేలా వ్యవస్థను మెరుగుపరచాలని రైల్వే బోర్డు ఇప్పటికే సూచించింది. దసరా, దీపావళి పండుగలు సమీపిస్తున్న సమయంలో రైళ్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరగనుంది.
Read Also: పండుగ వేళ రైలు టికెట్లకు భారీ డిమాండ్.. బుకింగ్ మొదలైన వెంటనే సీట్లు మాయం!