Mahesh Kumar Goud: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమకు అవసరమైన చోట ఓట్ల చోరీకి పాల్పడుతోందని సంచలన ఆరోపణలు చేశారు.
ఓట్ల తొలగింపుపై సందేహాలు, తీవ్ర ఆరోపణలు
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ ఎలా వస్తుంది? మరికొన్ని చోట్ల అసలు ఎందుకు రాదు? ఓట్లేసేది అంతటా ఒకే ప్రజలైనప్పుడు, బీజేపీ ఏ రాష్ట్రంలో గెలవాలనుకుంటే అక్కడ గెలవడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఈ ఓట్ల చోరీని సాంకేతికంగా లేదా యాంత్రికంగా రుజువు చేయలేకపోవచ్చు కానీ, క్షేత్రస్థాయిలో అక్రమాలు జరుగుతున్నది పచ్చి నిజమన్నారు. బీజేపీ తీసుకొచ్చిన ‘సర్’ ప్రక్రియ వల్ల దేశంలోని యువత తీవ్ర ఆందోళనకు గురవుతోందని, అందుకే ‘జెన్-జీ’ తరం నేడు రోడ్లపైకి వచ్చి పోరాడుతోందని పేర్కొన్నారు.
సిఈసికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యాచరణ..
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీకి అనుకూలంగా మారిపోయారని, ఆయనను ఆ పదవి నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్‌లో తాను దాదాపు పదిసార్లు ఓటేసినప్పటికీ, తన ఓటును సైతం కుట్రపూరితంగా తొలగించేందుకు ప్రయత్నిస్తూ నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా లౌకికవాదుల ఓట్లను పథకం ప్రకారం తొలగిస్తున్నారని ఆరోపించారు.
ప్రతిపక్షాల మద్దతు కూడగట్టే పనిలో..
సిఈసిపై పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు అన్ని ప్రతిపక్షాల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారని తెలిపారు. ఈ పోరాటంలో కచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.
Also Read: ప్రకాశం జిల్లాలో జంటహత్యల కలకలం.. భార్య, అత్తల గొంతు కోసిన కిరాతకుడు!