Jatayu Earth’s center: రామాయణంలో సీతను రక్షించేందుకు ప్రయంత్నించి గాయపడ్డ జటాయూ పక్షి స్మారకంగా ఏర్పాటు చేసిన పక్షి విగ్రహం(Jatayu Sculpture) కేరళలో ఉంది. ఈ విగ్రహం కొల్లాం దగ్గర ఉన్న చడయామంగలంలో జటాయూ ఎర్త్ సెంటర్‌లో ఉంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద పక్షి శిల్పంగా గుర్తింపు పొందింది. వర్కాల అనేది ప్రపంచం నలుమూలల నుండి పర్యటకులు సందర్శించే ఫేమస్ ప్లేస్. వర్కాలకు వెళ్లే వారు తప్పకుండా జటాయూ ఎర్త్ సెంటర్‌ను సందర్శిస్తారు. ఇది ప్రాథమికంగా ఒక థీమ్ పార్క్ అని చెప్పుకోవచ్చు.
పురాణాల ప్రకారం, సీతను రావణుడు అపహరించి తీసుకెళ్తుండగా జటాయూ అనే ఈ పక్షి చూస్తుంది. దీన్ని సీతమ్మ కూడా గమనించి రామ లక్ష్మణులు లేని సమయంలో రావణుడు వచ్చాడని జటాయూకు చెబుతుంది. తనను రావణుడు అపహరించి తీసుకెళ్లిన విషయాన్ని రాముడికి ఎలాగైనా చెప్పాలని సీత కోరుతుంది. దీంతో ఎగురుకుంటూ పైకి వెళ్లిన జటాయూ రావణుడిని హెచ్చరిస్తాడు. రామ లక్ష్మణులు లేని సమయంలో ఇలా సీతమ్మను అపహరించి తీసుకెళ్లడానికి సిగ్గు లేదా అని ప్రశ్నిస్తాడు. ఈ విషయం తెలిస్తే రాముడు క్షమించడని హెచ్చరిస్తాడు. అయినప్పటికీ రావణుడి జటాయూ మాటలను వినిపించుకోకుండా ముందుకు వెళ్తూనే ఉంటాడు.
రావణుడి నుంచి సీతను కాపాడేందుకు జటాయూ చాలా ప్రయత్నిస్తాడు. రావణుడి రథాన్ని వెంబడిస్తూ వెళ్లి దాడి చేసేందుకు ప్రయత్నిస్తాడు. తన ముక్కు, రెక్కలు, కాళ్లతో రావణుడిపై యుద్దాం చేస్తాడు. అయినా రావణుడు సీతను వదలలేదు. తిరిగి జటాయూపై దాడి చేశాడు. దీంతో జటాయూ తన రెక్కను కోల్పోతాడు. వెంటనే రథాన్ని తీసుకొని రావణుడు అక్కడి నంచి వెళ్లిపోతాడు. అప్పుడే వర్కాలకు దగ్గరలో ఉండే కొల్లాం సమీపంలోని ఓ పెద్ద రాయిపై జటాయూ పడిపోయిందని అక్కడి ప్రజలు నమ్ముతారు. అదే స్థలంలో జటాయూ గుర్తుగా ఈ శిల్పాన్ని ఏర్పాటు చేశారు.
200 అడుగుల పొడవు, 150 అడుగుల ఎత్తులో ఈ భారీ జటాయూ శిల్పం ఉంది. సముద్రమట్టానికి 350 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది కేవలం కేరళలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా పర్యాటకులందరినీ ఆకర్షిస్తుంది.
ALSO READ: ఏం వ్యూ మామా..! లైఫ్‌లో ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలి
పర్యాటకులకు ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి టికెట్ రూ.500 ఉంటుంది. ఈ ప్రదేశం వర్కాల నుంచి 25 కిలోమీటర్లు మాత్రమే దూరం. పర్యాటకులు ఒక కేబుల్ కార్ ద్వారా శిల్పానికి చేరుకోవచ్చు. డ్రోన్‌తో చూసినప్పుడు ఈ ప్రదేశం అందంగా ఉంటుంది. అయితే పైకి వెళ్లే వారు ఆహార పదార్థాలను తీసుకెళ్లడానికి వీలు లేదు.
ఈ ప్రదేశం శిల్పం మాత్రమే కాకుండా, పర్యాటకులకు ప్రకృతి సౌందర్యాన్ని కూడా అందిస్తుంది. చుట్టూ పచ్చని కొండలు, వన్యజీవులు, సుందరమైన ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తాయి. ప్రకృతి ప్రేమికులు ఎంజాయ్ చేయాలంటే ఇది బెస్ట్ ప్లేస్. ఈ మధ్య కాలంలో పర్యటకుల తాకిడి పెరగడంతో దీనికి సోషల్ మీడియాలో తెగ హైప్ వచ్చింది. దీంతో కేరళ ట్రిప్‌కు వెళ్లే వారిలో చాలా మంది ఈ జటాయూ ఎర్త్ సెంటర్‌కు కూడా వెళ్లి వస్తారు.