1980లలో వార్తా ప్రపంచం అంటే ప్రధానంగా ఆకాశవాణి, దూరదర్శన్, వార్తాపత్రికలు. అంతే. టీవీ ప్రతి ఇంట్లో ఉండేది కాదప్పుడు. వార్త తెలుసుకోవాలంటే..ఉదయం పేపర్ కోసం ఎదురుచూడాల్సిందే అప్పటి దాకా న్యూస్ తెలిసేదే కాదు.లేదంటే రేడియో బులెటిన్ వినాలి. టీవీ ఉంటే.. దూరదర్శన్ వార్తల సమయం కోసం వేచి చూడాలి. వార్తకు ఒక సమయం ఉండేది. దాని కోసం ఎదురుచూపులు. పడిగాపులూ ఉండేవి.
అప్పటి జర్నలిస్టుకు నోట్‌బుక్.. టైప్‌రైటర్.. టెలిఫోన్.. కెమెరా ఉండేవి. రిపోర్టర్ సమాచారం సేకరిస్తే..కాపీ తయారు చేయాలి. వార్తా సంస్థకు లేదా న్యూస్‌రూమ్‌కు పంపాలి. టీవీ కోసం తీసిన ఫిల్మ్‌ను ప్రాసెస్ చేసి..ఎడిట్ చేసిన తర్వాతే ప్రసారం చేసేవారు. అందుకే..అప్పుడు వార్తకు వేగం తక్కువగా ఉండేది. అయితే 1980లలోనే టెలివిజన్ వార్తలకు కొత్త ఊపు వచ్చింది. 1982లో దూరదర్శన్ జాతీయ ప్రసారం.. కలర్ టెలివిజన్ ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా టీవీ ప్రభావం పెరిగింది.
ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీతో ఘటన జరిగిన క్షణాల్లోనే వార్త ప్రపంచం ముందుకొస్తోంది. ఒకప్పుడు న్యూస్‌రూమ్ నుంచి ప్రేక్షకుడి వరకు వార్త ప్రయాణించేది.ఇప్పుడు.. రిపోర్టర్ చేతిలోని మొబైల్ నుంచే ప్రేక్షకుడి స్క్రీన్‌పైకి వార్త చేరుతోంది. అప్పుడు వేదికలు తక్కువ..వేగం తక్కువ.. కానీ ఎడిటోరియల్ నియంత్రణ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు వేదికలు అనేకం..వేగం అపారం..పోటీ కూడా అదే స్థాయిలో పెరిగింది.
అప్పట్లో ప్రజలు ఎక్కువగా వార్తా పత్రికలు చదివేవారు. పొద్దున్నే వార్తలు చదివితే గానీ.. కాలకృత్యాలు తీర్చుకొనేవారు కాదు. కాఫీ లేదా టీలతోపాటు.. వార్తలు నమిలేయాల్సిందే అన్నట్లుగా ఉండేవారు. అయితే, ఇప్పుడు.. వెబ్ సైట్ల ద్వారా ఏ రోజు వార్తలు ఆరోజే వచ్చేస్తున్నాయి. మొబైల్ తెరిస్తే చాలు నోటిఫికేసన్ల ద్వారా సంఘటన వివరాలు తెలిసిపోతున్నాయి. ఏదైనా సబ్జెట్ గురించి తెలుసుకోవాలంటే.. గూగుల్‌లో సెర్చ్ చేస్తే చాలు. ఇప్పుడు ఏఐ మరింత వేగంగా సమాచారాన్ని అందిస్తోంది. కానీ.. ఆ రోజుల్లో ఇంటి అరుగుపై కూర్చొని న్యూస్ పేపరు చూస్తున్నప్పుడు కలిగిన ఆనందం.. ఇప్పుడు కలుగుతుందా? ఏమంటారు 80’s కిడ్స్?
Also Read: 80ల్లో ఫోన్ కాల్.. త్వరగా మాట్లాడకపోతే జేబు ఖాళీ, ఇంట్లో ల్యాండ్‌లైన్ ఉంటే.. అదో స్టేటస్
Also Read: 80ల్లో సైకిల్ ఉంటే అదో గొప్ప.. అప్పటి నిబ్బాలు చేసే విన్యాసాలకు నిబ్బీలు ఫిదా!